అనేక తలాల మమేక సృజన
ABN , Publish Date - May 04 , 2026 | 12:39 AM
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి సజావు వాక్యాల్లోని మెలికలు మెల్లిగా గానీ అందవు. Diegetic, mimetic (కథ చెప్పటం, చూపటం) అనే ఈ రెండు కథన ప్రక్రియలనూ ఏకకాలంలో నిర్వహించడమే గాక వారి...
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి సజావు వాక్యాల్లోని మెలికలు మెల్లిగా గానీ అందవు. Diegetic, mimetic (కథ చెప్పటం, చూపటం) అనే ఈ రెండు కథన ప్రక్రియలనూ ఏకకాలంలో నిర్వహించడమే గాక వారి వాక్యం, ఒక విశ్లేషణా స్వరాన్ని కూడా కాంతిలా తనకు చుట్టుకుని వస్తుంది కాయితం పైకి. సమీక్షాస్వరగర్భితమైన లిఖితశబ్దం వీరి వచనం. కథా వస్తువుకు తగిన భాషా సామగ్రిని నిర్మించుకున్న ఇంజనీయర్ పనితనముంటుంది వీరి సాహిత్యంలో.
‘పతంజలి శాస్త్రి కథలు’ పుస్తకానికి రాసిన ముందుమాటలో ‘‘కొన్ని కథల వెనక రచయిత ధుమధుమలాడే ముఖం కనిపిస్తుంది’’ అంటారు కె.ఎన్.వై. పతంజలి (చిన్న పతంజలి). పర్యావరణ అపహరణం, నీచ రాజకీయాలు, ఆధునిక మానవుడి నిస్సార మనస్తత్వం, జ్వాల నిద్రపోయి పొగచూరు పట్టిపోయిన మానవ సంబంధాలు... స్థూలంగా వీరి ధర్మాగ్రహ కారణాలు అనుకోవచ్చు. ‘‘వ్యంగ్యం నా శరీరంలో గుచ్చుకున్న బాణం, అది తీస్తే నా ప్రాణం పోతుంది’’ అన్న కీర్క్‌గార్డ్ మాట కూడా గుర్తురాక మానదు పతంజలి గారిని చదువుతుంటే. పదునైన వ్యంగ్యం వీరి వాక్యంలో దాక్కున్న బాణం.
వ్యంగ్యం, ఆగ్రహం కాలక్రమేణా నిర్వేదంతో వినపడటం, నిర్వేదం మెల్లిగా తాత్త్వికతతో కూడిన సంయమన వాక్కులోకి చేరటం రచనల సహజ పరిణామక్రమం. ఇది అంచెలంచెలుగా జరుగుతుంది. సాహిత్యసృష్టికై రగిలించిన అగ్నిని నియంత్రించే కళే రచయిత క్రాఫ్ట్ – Tuning the fire.
‘రామేశ్వరం కాకులు’ కథాసంపుటిలో ‘వెన్నెల వంటి వెలుతురు గూడు’, ‘ఉర్వి’ సౌష్టవమైన కథలుగా నిలబడుతూనే, దీర్ఘకవితలనిపించుకోగల రచనలు. ‘వెన్నెలవంటి...’లో వస్తువు పురుషుని మనస్సు. రైలు ప్రయాణంలో ఎదురుసీట్లో నిద్రపోతున్న అందమైన స్త్రీతో రొమాంటిక్ ఊహలలో యథేచ్ఛగా విహరించటానికి సంకోచించని అతని మనసు, నూటఎనభై డిగ్రీల పరివర్తనం చెంది అదే స్త్రీలో మాతృదర్శనం చేసుకుందుకు ఒక్క నిమిషమే తీసుకున్న కథ అది. కానీ కథ చివర్లో ‘‘పాల సిరల వంటి మెత్తటి వేళ్ళు క్రాఫులో చొచ్చుకునిపోయిన హాయి’’ అని అతన్ని అనుకోనివ్వడంలో కదూ వ్యంగ్యం! స్త్రీని యువతిని చేసేదీ, తల్లిని చేసేదీ ఆమె తాలూకు ఒకే రూపవిశేషం. కానీ, తలకిందులైన ఆ దృష్టే అతని పరివర్తనానికి గుర్తు. ఈ రచయిత చేతిలో స్త్రీ పాత్రలు ఎక్కడా ఆక్షేపణలకు గురికాలేదు, ఒక్క ‘గేదె మీద వాలిన పిట్ట’ నవలలో ‘పూర్ణ’ లౌకికం, నేర్పరితనం గలది అనే ధ్వని వినిపించటం తప్ప.
మూడో నాలుగో పదాలతో వీరి వాక్యం ఏర్పరచిన బొమ్మ తన భౌతికరూపవిశేషాలతో, మానసిక స్థితితో మాత్రమే కాదు, దాని భూతభవిష్య కార్యకారణాలన్నిటితోటి, జన్మాంతర జాతకంతో సహా రూపం దాల్చి వచ్చేస్తుంది– (‘‘బోనులో పొడుగ్గా నుంచుని, దురదృష్టం, నిస్పృహ కలిసి పెట్టిన సంతకం లాంటి మనిషి’’). మనుషులూ, స్పర్శేంద్రియ గ్రాహ్యమైన వస్తువులే కాదు, రూపం లేని స్థల, సమయాలు, భావాలు కూడా ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వంతో పరిచయమై అలా నిలబడి పోతాయి పాఠకుల స్మృతిలో. మనసూ నోరూ పెట్టుకుని మనతో మాట్లాడుతుంటాయవి. ఎండ, వెన్నెల, అపరాహ్ణం, కరువు, మేజాబల్ల, కుర్చీ, చెఱువు, పార్కు, చెక్కబల్ల, దాని మీద ముసలాయన, ఇలా అన్నిటికీ ఒక ముఖం, ఒక persona (మూర్తిమత్వం) ఇచ్చి మర్యాద చేస్తుంది వీరి వచనం.
మరి వీరికి దేనితో పేచీ? మనిషి మూర్ఖత్వంతో, నిష్క్రియాపరత్వంతో పెద్ద పేచీ. వర్గ చైతన్యం, సామూహిక చైతన్యం, పాలకులకు, ప్రజలకు చైతన్యం అనేవి పాత నినాదాలు. చైతన్యం ఎప్పుడూ ఉంది, లేక కాదు. ప్రజల్లో అది సుప్తావస్థలో, పాలకుల్లో తామసరూపంలో ఉండటమే సమస్య. అదే వీరి కథలు మాట్లాడింది. ఖద్దరు చొక్కాల వెనక, ఖాకీ యూనిఫారంల వెనక, స్పిరిచువల్ శాలువాల వెనక ఉండిపోయిన మనిషి కొండకచో అయినా కాస్త కరగటం, స్వస్వరూప సహజమైన ఇంగితంలోకి అప్పుడప్పుడూ అయినా మేలుకోవటం అరుదయ్యేకొద్దీ వీరి కథలు పదును దేలుతుంటాయి.
‘రామేశ్వరం కాకులు’ కథలో ‘పద్మావతి’లోని జీవుని వేదనకు ముగింపును రచించిన ఇన్‌స్పెక్టర్, ఏ రోగికి ఏ వైద్యం పనిచేస్తుందో తెలిసిన వైద్యుడు, ఆమె తోటి వారందరికీ రామేశ్వరానికి టికెట్లు కొనలేదతను. ఆమె అస్తిత్వ వేదనను వాడు చూడగలిగేలా చేసింది నిజానికి ఆమే. అతన్ని వాడి పోలీసుతనం నుంచి వొలిచి (‘‘ఆమె చూపులు అతని ఖాకీ బట్టలను ఉల్లిపొరలా విడదీసాయి, అతని కంఠంలోని తీవ్రత వేపగాలిలో కలిసిపోయింది’’) మనిషిలోని కరుణను నిలబెట్టింది. ఆ కరుణే నిర్దయగా ఆమెను ఈ పనికిరాని లోకం వదిలి నడిసముద్రంలో మునగమంటుంది. అవును, ఆమెకు అప్పుడు కావలసింది అనుక్షణ ప్రాణభయాన్ని జయించగల నిర్దయే. ధైర్యమే.
కాలం లాగే మనిషి చేతనకూ అవధులను ఒప్పుకోదు వీరి రచన; తుది మొదలున్న జన్మ అనే పరిమిత పరిధికి లోబడి ఉండదు మనుషుల చైతన్యం వీరి దృష్టిలో. జన్మాంతర జ్ఞానంతో యేటిలో చేప ఈదినంత సులువుగా కాలాలనీదగల జీవులు తారసపడతారు ఈ కథల్లో. ‘దీపాల పల్లె బోవాలె’ కథలో వృద్ధుడికి అంత్యకాలంలో వస్తూపోతూవున్న స్మృతి బాల్యకాలపుది కాదు, అసలు ఈ జన్మదే కాదు.
కాలాన్ని, చైతన్యాన్ని తన అధీనంలో ఉంచుకోవడం తెలుసు ‘కచ్ఛప సీత’కు, ఇంద్రియాలనే కాదు. లక్ష్మణుడి అరణ్యవాస కారణంగా విరహదుఃఖంలో పడిన ఊర్మిళను వెతుక్కుంటూ వచ్చి ఆమెకు అంతర్ముఖ విద్యను ఆచరణలో చూపి, ఆ సాధనలో ఆమెను నిలిపి నిష్క్రమించింది ఆధ్యాత్మగురువు ‘సీత’.
‘అతను’ కథలో మనిషికి ఇతర మనుష్యులు కంప్యూటర్ తెర మీద pixels వంటివారు. తన జీవితం, తన తత్త్వము కూడా తనకు తెరమీది బొమ్మలు మాత్రమే. ఇతను అంతర్ముఖుడు కాడు. మానవ సహజమైన స్పందించే శక్తి లోపించిన అసంబద్ధ ప్రాణి. కామ్యూ నవలా పాత్ర ‘మెర్సాల్ట్’ యాంత్రిక వైఖరీయే ఇతనిది. అస్తిత్వ నిరాకరణమే ఇతని అస్తిత్వ లక్షణం. ఇతను మళ్ళీ మనకు ‘గేదె మీద వాలిన పిట్ట’ నవలలో ‘ఆదిప్రకాశ్’గా ఎదురుపడతాడు. మేధ తప్ప బుద్ధి పనిచేయని జీవి.
పతంజలి శాస్త్రి గారి కథలది నిరీశ్వరవాదం కాదు. అలా అని ఆస్తిక్యవాదానికో, అస్తిత్వవాదానికో, అసంబద్ధవాదనకో కూడా పరిమితం అయిపోకుండా, వాదాలకతీతంగా మనిషి అస్తిత్వానికి ఒక అర్థాన్ని అన్వేషిస్తూ, దర్శిస్తూ సాగిన సాహిత్యం ఇది.
క్రియాశీలత వీరి మంత్రం. వీరి సిద్ధాంతం క్రియా యోగం. వీరి కథల ధర్మం (మతం) బౌద్ధం. ‘‘ధర్మం చర!’’ ధర్మాన్ని ఆచరించు! ధర్మబద్ధమైన కర్మ చేయడమే మనిషి ధర్మము అనేదే వీరి కథల మతము.
శాస్త్రి గారి ‘భగవంతం కోసం’ కథలోని మనిషి చేసిన వెతుకులాట అతనున్న గదిలోని టేబిల్ సొరుగులోని కొవ్వొత్తి, అగ్గిపెట్టె చూసాక ముగుస్తుంది. అస్తిత్వ చింతన చేయటానికైనా నిల్చున్నచోట దీపం వెలిగించుకోవాలి కదా ముందు మనిషి!
ప్రాక్టికల్ అయితేనే వేదాంతమైనా ఆచరణీయం అనే జ్ఞానానికి తెరుచుకున్న కథ ‘కిటికీలు’. ముదిమి (‘‘శీతువు’’ అంటారాయన), మృత్యువు, దాని తర్వాతి అపరకర్మలు వీటికి తాకని దూరంలో నిల్చుని చాలా దగ్గరగా రచయిత చూడగలిగిన విధంలో గొప్ప శాంత విచారణ కనపడుతుంది.
తీవ్ర ధిక్కార స్వరం ‘యువరానర్’ది. ఈ కథలో ఉద్వేగాల వ్యక్తీకరణలు ప్రచ్ఛన్నంగా ఉండవు. మొదటి వాక్యం నుండీ చివరి బిందువు వరకూ రూపం దాల్చిన తీవ్ర ఆగ్రహమే.
ప్రాజెక్టు కుంభకోణం బద్దలై కుతకుతలాడుతున్న ఆఫీస్‌లో, బైరాగి కవిత్వం చదువుతూ ‘‘నక్సలిజం ప్రాక్టీస్ చేసే ట్రైబల్ పీపుల్ గూఢచారి’’ ఒకడుంటాడు, అతనే ‘బాలి’. ఆఫీస్ ఫైళ్లు తడిపి ఆఫీసర్తో మూడు చెఱువుల నీళ్ళు తాగించాడు. ఎప్పుడు పేలుతుందో తెలియని డైనమైట్ మీద కూచున్న కథ ఇది!
‘ఆమెదనంతపురం’, ‘కతలవ్వ’, కథల్లో విషయాలు రాయలసీమ నీళ్ళకరువు, కాటకము. వాటి కథనానికి వాడిన అలెగరీ పతంజలి గారి మరొక గొప్ప పనిముట్టు. కథలో పిల్లల అవసరం ఎంత! మోడర్న్ ఫేబుల్ వంటి పనిముట్టు ఎంత అవసరమో పిల్లల ఉనికికీ అక్కడ అంతే అవసరం. పెద్దవాళ్ళకు బుద్ధి చెప్పటానికి పిల్లలసాకు కావాలి. ‘తురక పాలెంలో దేవకన్యలు’ శుద్ధ ముగ్ధ మార్మిక సౌందర్యంతో వచ్చిన కథ. పల్లెలు మురికి అనుకునే పిల్లలకు వాటి మహత్వం చూపించేందుకు మిథ్‌లా సాగిన కథనం. ‘కదిరమ్మ పేరంటాలు’ నిరాశలు కనే కల.
ఈ కథల్లోని క్రాఫ్టే సంపన్నమైంది. వ్యావహారిక బుద్ధికి కనపడే కథ ఒకటి, పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యే అలోక దృష్టికి అందే కథ ఒకటి, రెండుతలాలలో రెండు విడివిడి కథలను నడుపుతుంది కథనం. కలలు, అధివాస్తవికత, మార్మికత, వివిధ తలాలలో పనిచేసే మనిషి చేతన... వీటిని వీరి కథలు విస్తారంగా వాడుకున్నాయి.
తర్కమూ తాత్వికత, ఆధునిక స్పృహ ప్రాచ్యవిజ్ఞానము, వాస్తవము కల్పనా ఇలా పలు విరుద్ధాల జతలు సమన్వయంతో కలిసిన చోట జరిగిన సృష్టి పతంజలి శాస్త్రి గారి సాహిత్యం.
పద్మజ సూరపరాజు
ఇవి కూడా చదవండి..
కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ