Share News

‘పాత’ ఎండుటాకుల గాలి

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:03 AM

ఈ గాలి సుత ఎంత రుచిగా వున్నదీ సనమెత్తటి చర్మంతో అర చేయిని స్పర్శిస్తదీ యానాది దేవా మాగిన కనురెప్పల జారే కోమల నిషాదం...

‘పాత’ ఎండుటాకుల గాలి

ఈ గాలి సుత

ఎంత రుచిగా వున్నదీ

సనమెత్తటి చర్మంతో

అర చేయిని స్పర్శిస్తదీ

యానాది దేవా

మాగిన కనురెప్పల

జారే కోమల నిషాదం

యాపరసం నమిలి

కలింకాయను కొరికినట్టుంటదీ

లోపలి లోకాల బొరియలు

పాటలతో శోకాన్ని పాడుతున్నట్టుంటదీ

వూపిరి చిమ్మటిస్తున్నట్టు

గమకాలు

కాళ్ళను ముడుచుకొని

కడుపు పేగుల దాగినట్టూ

కెంపెరుపు కాంతి

పూడ్చి పూడ్చీ పండీ పండీ

పగిలిన జాంపండు

కొమ్మకు వేలాడుతున్నట్టు

అడుగంటిన బాయి లోపలి నిద్రగాలి

మసిలిపోతూ అలిసిపోతూ

పచ్చగిల్లుతున్నట్టూ

నిశ్శబ్దం విరోధాభాస అవునా...

మొదటనే వాటిల్లిన సత్యమేనా

స్పర్శల తడితనమేనా..

ఆదిమ వానలూ వనాలూ

కలిసి తానం చేస్తున్నట్టూ

వాగు అలల మీద

తేలుకుంట

ఈత కొట్టుకుంట వోతున్న

మా కుమ్మరి పాపమ్మ

మట్టిదీపం

ఎంత పాతదీ

ఎంత గట్టిదీ

దాని వెలుగూ..

నువ్వొద్దెనే..

నీలాగనే

ఈ పిల్లలంతా

కలె తిరిగి

నీ బొడ్డు పేగునుంచి రాల్తున్న

మన కాలపు నెత్తుటి బొట్లే..

ఇవి ఎంత వెచ్చగున్నాయీ..

కొత్తగున్నాయీ..

నీ శబ్ద నిశ్శబ్దాలనీ

పాత బేడీలనూ వంచి తెంపుతున్నవీ

అమ్మా మాయమ్మా

రేణుకెల్లమ్మా..

సిద్ధార్థ

73306 21563

ఇవి కూడా చదవండి:

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 03:03 AM