పశుపతి దేవుని ముద్రిక.. భారతదేశీయమే
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:30 AM
భారతీయ సంస్కృతి చాలా కాలం నుంచి ఉందని తేల్చే చిహ్నం పశుపతి దేవుని ముద్రిక అని భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం తెలిపింది. దానికి ఆధారంగా ఒక ముద్రికను చూపింది. అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రుష్కే...
భారతీయ సంస్కృతి చాలా కాలం నుంచి ఉందని తేల్చే చిహ్నం పశుపతి దేవుని ముద్రిక అని భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం తెలిపింది. దానికి ఆధారంగా ఒక ముద్రికను చూపింది. అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రుష్కే ఆ ముద్రిక శివునిది కాదని, యూరేషియాకు చెందిన లార్డ్ ఆఫ్ యానిమల్స్‌ది అని చెప్పారు. ఇరాన్‌కు చెందిన ప్రోటో ఎలమైట్ కళాఖండాలతో దీనికి పోలిక ఉందని అన్నారు. చుట్టూ పశువులు, మధ్యలో మనిషి ఉండడమనే పోలికను ఆమె చూపుతున్నారు. కానీ, ఈ ముద్రిక భారతీయ సంస్కృతికి చెందినదేనని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.
ఈ మూర్తి మూల బంధాసనంలో ఉన్నాడు. మూల బంధాసనం యోగాసనాల్లో ముఖ్యమైన ఆసనాల్లో ఒకటి. యోగం ఉపనిషత్తుల్లో ఉంది. యోగ శాస్త్రాన్ని పతంజలి రచించాడు. హఠయోగ ప్రదీపిక వంటి అనేక యోగ గ్రంథాలు భారతీయ సంస్కృతిలో ఉన్నాయి.
ఈ మూర్తికి మూడు శిరస్సులున్నాయి. సంస్కృతంలో, సాహిత్యంలో మూడు తలలు కలవాళ్లు ఇద్దరే. ఒకడు త్రిశిరుడు. ఇతడు రుద్రుని పరివారంలోని జ్వర దేవత. త్రిశిరునికి మూడు పాదాలుంటాయి. ఈ మూర్తికి రెండే పాదాలున్నాయి. కనుక, ఇతడు త్రిశిరుడు కాదు. మరొకరు దత్తాత్రేయుడు. ఆయన యోగి. అలాగే, ఈ మూర్తి మూల బంధాసనంలో ఉన్నాడు. బలమైన ఈ రెండు ఆధారాలతో ఈ మూర్తి దత్తాత్రేయుడని చెప్పవచ్చు. యోగం ఏకాంతంలో చేస్తారు కనుక అడవి వంటి ప్రాంతంలో యోగం చేస్తున్నాడు. కావున అక్కడ జంతువులు ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ ముద్రిక సనాతన ధర్మ సంస్కృతికి చెందిన దత్తాత్రేయునిదని చెప్పవచ్చు.
ఈ ముద్రికపై ‘అముష్యదదామి’ (ఇతనికి ఇచ్చుచున్నాను) అని తెలిపే ఆరు చిత్రలిపి వర్ణాలున్నాయి. ఈ లిపిని కుడి వైపు నుంచి ఎడమ వైపునకు చదువుతారని పరిశోధకులు చెబుతారు. సంస్కృతంలో కుడి వైపు నుంచి ఎడమ వైపునకు చదివే పద్ధతి సంఖ్యలలో ఇప్పటికీ మిగిలి ఉంది. అష్టోత్తర శతమ్ అంటాం. అంటే, నూట ఎనిమిది అని అర్థం. కుడి వైపున నూరును తెలిపే శతమ్, ఎనిమిదిని తెలిపే అష్ట ఎడమ వైపున రాస్తారు. ఇతడు పరబ్రహ్మ మూర్త రూపమని తెలుస్తోంది. దత్తుడు పుంలింగం. పరబ్రహ్మ నపుంసక లింగం. అముష్య అనే పదానికి పుంలింగం, నపుంసక లింగం రెండూ ఉన్నాయి. అముష్య షష్ఠీ విభక్త్యంత పదం. షష్ఠీ విభక్తికి సంబంధమని అర్థం. ఇతడిది ఇతనికే సమర్పిస్తున్నాననే విశిష్ట భావం దీనిలో ఉంది. ‘త్వదీయమేవ, తుభ్యమేవ సమర్పయే’ అనే సంస్కృత వాక్యం ఈ భావాన్నే వెల్లడిస్తుంది. సర్వం ఈశ్వరునిదే. ఆయనది ఆయనకే సమర్పిస్తున్నాననే భావం. ఇలాంటి చిత్ర లిపి పదాలను సుమారు 200 దాకా చదవడం జరిగింది. సింధు సంస్కృతి చిత్రాలలో సుమారు నూరు చిత్రాలు వైదిక సంస్కృతికి చెందినవని వివరించడం జరిగింది. దానిని ఇక్కడ రాస్తే పెద్ద గ్రంథమవుతుంది. పై ఆధారాలు ఈ ముద్రిక ప్రాచీన భారత సంస్కృతికి సంబంధించినదని, అది ఆర్య ద్రావిడ సంస్కృతుల ఏకత్వాన్ని వెల్లడించేదని తెలుపుతున్నాయి.
పశుపతి దేవుని ముద్రిక వేరే ఉంది. దానిలో మధ్య రుద్రుడున్నాడు. ఆయన తలపై గంగా ప్రవాహం ఉంది. వీటి ఆధారంగా ఇది రుద్రుని రూపమని తెలుస్తోంది. రుద్రునికి ఎడమ పక్కన ‘ఓం’ అనే ప్రణవ చిత్రం, దానిపైన మేఘం, దాని వెనక చుక్కలు ఉన్నాయి. శివుని శిరస్సుపై జుట్టు లేదు. ఆయనకు వస్త్రాలు కనబడడం లేదు. ప్రణవానికి పైన ఒక భాగంలో చెరిగిన డమరుకము, దానికి పక్కన గొడ్డలి, దాని పక్కన రెండు చిత్రలిపి వర్ణాలున్నాయి. దాని కింద ఏనుగు, దాని కింద మానవుడు, దాని కింద వ్యాఘ్ర మృగ శిరస్సు, దాని కింద పెద్ద బాణం, రుద్రుని కింద పశువు ఉన్నాయి. రుద్రుని భుజాలకు, ముంజేతులకు అలంకారాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారాలు రాస్తే పెద్ద వ్యాసమవుతుంది. అందుకే, కొన్ని చూపుతాను.
దీనిని మూడు తలల పశుపతి దేవుని ముద్రిక అని రొమిల్లా థాపర్ (తరతరాల భారత చరిత్ర– 21పుట) రాశారు. కొందరు రెండు కొమ్ములున్నాయని (చరిత్రలో మతాలు– 2వ పుట) చెప్పారు. కానీ, ఈ ముద్రికలో మూడు తలలు, రెండు కొమ్ములు లేవు.
ప్రణవం ఈశ్వరుని పేరు అని పతంజలి ముని యోగశాస్త్రంలో ఉంది. ప్రణవం పరమాత్మునికి ప్రతీక అని ఉపనిషత్తుల్లో ఉంది. రుద్రుని వర్ణనలలో అలంకారాలు ఉన్నాయి. ‘శాంతం పద్మాసనస్థం..’ అనే శివ ధ్యాన శ్లోకంలో నానాలంకారయుక్తం, పరశుమభయదం (గొడ్డలి) శివునికి ఉన్నాయని వర్ణించారు. శివునిపైన చేప బొమ్మ, u వంటి ఆకారం కలిగిన రెండు చిత్రలిపి వర్ణాలు ఉన్నాయి. అవి శమీ అనే పదం సూచిస్తాయి. శమము కలవాడు అంటే శాంతుడు అని అర్థం. పై శ్లోకంలో శాంతం అని ఉంది. అంటే, శాంతుడనే అర్థం.
శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో గంగాధర: (శ్లో–6), వ్యోమకేశ:, దిగంబర: (12 శ్లో), కవచీ (కవచం కలవాడు) అనే నామాలున్నాయి. శివ సహస్రంలో గజేశ్వర: (ఏనుగులకు అధిపతి (148 శ్లో)) అనే నామం ఉంది. నరర్షభ: (మానవ శ్రేష్ఠుడు, 148 శ్లో). ఈ నామాలకు చిత్రాలు పశుపతి దేవుని ముద్రికలో ఉన్నాయి.
రుద్రుని వాహనం పశువు. పై ముద్రికలో పశుపతి దేవుని చిత్రం కింద పశువు చిత్రం ఉంది. మహాభారతంలో శివ సహస్రంలో ముండ: (జుట్టు లేనివాడు, 45 శ్లో), దిగ్వాసా: (దిగంబరుడు, 42 శ్లో), జ్యోతిషామయనం (చుక్కలకు ఆధారమైనవాడు, 57 శ్లో), మహా మేఘ నివాసీ (గొప్ప మేఘమునందు నివసించువాడు, 82 శ్లో), వ్యక్తావ్యక్త: (వ్యక్తముగా, అవ్యక్తముగా ఉన్నవాడు, 124 శ్లో) అనే నామాలున్నాయి. ఈ ముద్రికలో దీనికి అనుగుణమైన చిత్రాలున్నాయి. ముద్రికలో రుద్రుని సగం రూపం చిత్రించారు. ఇది వ్యక్తావ్యక్తతను తెలుపుతోంది. అలాగే, ఈ పశుపతి కవచం తొడుక్కుని ఉన్నాడు. కృష్ణ యజుర్వేదంలో రుద్రునికి నమస్కరించే మంత్రాల్లో ‘కవచం కల రుద్రునికి నమస్కారం’ అనే మంత్రం ఉంది (4 అ. 5 ప్ర. 6 అను). పశుపతి తలపై గంగ ఉంది. రుద్రునికి గంగాధరుడని పేరు ఉంది. స్వర్గాన్నుంచి భూమికి దిగే గంగ మొదట శివుని శిరస్సుపైకి వచ్చి, తర్వాత భూమికి దిగిందనే వృత్తాంతం శ్రీమద్రామాయణంలో ఉంది (బా 43స. 8 శ్లో). రుద్రునికి కుడి వైపున మానవ చిత్రం ఉంది. రుద్రునికి ద్విజావతారం ఉంది (శివ పురాణం, శత రుద్ర సంహిత). రుద్రునికి ఎడమ వైపున పెద్ద పులి ముఖచిత్రం ఉంది. భద్రాయువనే రాజును పరీక్షించడానికి శార్దూల రూపం ధరించాడు శివుడు. రుద్రుడు వ్యాఘ్రచర్మం ధరించాడని రుద్ర వర్ణనలో కనబడుతుంది. రుద్రుని ఆసనం కింద ఒక పశువు ఉంది. ఈ రుద్రుని పశుపతి అని వ్యవహరిస్తున్నారు. రుద్రునికి పశుపతి అనే పేరు వేదంలో ఉంది. (తైత్తిరీయ సంహిత 4–5–8 అను) ఈ మూర్తి మోచేతి నుంచి ముంజేతి వరకూ కవచాలు తొడుక్కున్నాడు. వీటికి హస్తఘ్నాలని పేరు. ఇవి వేదంలో ఉన్నాయి (తైత్తిరీయ సంహిత 4–6–6 అను). సింధు సంస్కృతి నుంచి వేదంలో ఉన్న శివారాధన, యోగం, శివుడు, బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపుడైన దత్తాత్రేయుడు ఉన్నారని వీటి వల్ల తెలుస్తోంది. ఆడ్రీ ట్రుష్కే వాదం ఆమె ఊహ మాత్రమే.
డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ
ఇవి కూడా చదవండి
వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ
80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..