పల్నాడు నీటి పథకంపై రాజకీయమా!
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:44 AM
మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీపై కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్ (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై...
మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీపై కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్ (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. పర్యవసానంగా 1976 నుంచి అమలులో ఉన్న కృష్ణా జల వివాదాల మొదటి ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా, గోదావరి జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తాయి. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్నది. కొన్ని వివాదాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. 1956 అంతర్రాష్ట్ర నదీ జల వివాద చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2013, రెండు రాష్ట్రాలకు శిరోధార్యం. ఈ పూర్వరంగంలో తాజాగా తెరపైకి వచ్చిన తాగునీటి పథకంపై వివాదాన్ని పరిశీలిద్దాం.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019లో ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో వ్యయాన్ని భరించాలి. తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచే ‘మిషన్ భగీరథ’ పేరుతో తాగునీటి పథకాన్ని అమలుచేస్తూ ముందంజలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్నది. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర వాటా నిధులను మంజూరు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు సద్వినియోగం కాలేదు. ‘జల్ జీవన్ మిషన్’ను ఆంధ్రప్రదేశ్‌లో అమరజీవి జలధార పథకం పేరుతో అనుసంధానం చేసి అమలు చేయడానికి, ‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను ఏర్పాటు చేశారు. రూ.30,156కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ పథకాన్ని 2026 అక్టోబరులో ప్రొద్దుటూరులో లాంఛనంగా ప్రారంభించారు. రూ.10,000కోట్ల మేరకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ల నుంచి రూ.2,500 కోట్లు కేటాయిస్తామని వెల్లడించింది.
‘అమరజీవి జలధార’ పథకంలో భాగంగా పల్నాడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు శాశ్వత తాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకం పల్నాడు వాటర్ గ్రిడ్. దీని అంచనా వ్యయం రూ.1,200కోట్లు. దీనికి, మొదటి దశలో 0.57 టీఎంసీ, తర్వాత ఏడాదికి 1.86 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జలాశయం నుంచి వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయి. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి 2025 మార్చి 17న రాజ్యసభలో చేసిన ప్రకటనలో ఈ పథకం గురించి ప్రస్తావించారు. 2027 నాటికి ఈ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో రూ.100 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారని చెబుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగుల నీటి మట్టం నుంచి నీటిని తరలించడానికి వీలుగా మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులు రహస్యంగా ఏమీ జరగడం లేదు. అయినా ఈ తాగునీటి పథకాన్ని తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎక్కుపెట్టింది. ఆ పార్టీ వాదనలన్నీ ‘బోడిగుండుకూ మోకాలికీ ముడి’ లాంటి సామెతలను గుర్తుచేస్తున్నాయి.
నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ పథకం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ సమస్య రావణ కాష్ఠంలా కాలుతూనే ఉండటానికి అన్నట్టు రాజకీయ స్వార్థపరులు నిత్యం ఆజ్యం పోస్తూనే ఉన్నారు. వాళ్లు అమలులో ఉన్న ట్రిబ్యునల్ తీర్పును గానీ, 2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని గానీ ఖాతరు చేయటం లేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం, సాగర్ కుడి కాలువ కింద 11.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి, తాగునీటికి 132 టీఎంసీల కేటాయింపు ఉన్నది. అందులో తాగునీటికి 2.55 టీఎంసీలు. ఆ నీటిని కుడి కాలువ పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉన్న చెరువులను నింపి తాగునీరు సరఫరా చేయాలి. ట్రిబ్యునల్ కేటాయించిన ఆ నీటి నుంచే 1.86 టీఎంసీలు పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా అందించడానికి ప్రభుత్వం పూనుకున్నది. బచావత్ ట్రిబ్యునల్ ఎడమ కాలువకు 132 టీఎంసీ కేటాయించింది. అందులో 106.2 టీఎంసీలు తెలంగాణకు, 32.25 టీఎంసీలు ఆంధ్రకు కేటాయించింది. ఆవిరి నష్టాలకు 17 టీఎంసీలు. మొత్తం 281 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. ఆవిరి నష్టాలతో కలిపి ఆంధ్రప్రదేశ్‌కు 174.8 టీఎంసీలు, తెలంగాణకు 106.20 టీఎంసీల కేటాయింపు ఉన్నది. అలాగే, హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీటి సరఫరా కోసం ట్రిబ్యునల్ 3.90 టీఎంసీలు కేటాయించింది. హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందింది. నీటి అవసరాలు పెరిగాయి. గోదావరి నది, దాని ఉపనది మంజీరా నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నా, హైదరాబాద్ అవసరాలు తీరడం లేదు. అది తెలుగు జాతికి గర్వకారణమైన నగరం. అందుకే, ట్రిబ్యునల్ కేటాయింపుల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో సర్దుబాటు చేసి, 3.90 నుంచి 5.70 టీఎంసీలకు పెంచారు. అలా సర్దుబాటు చేసిన నీటిలో సాగర్ కుడి కాలువ నుంచి 0.50 టీఎంసీలు కూడా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రెండు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కట్టుబడి వ్యవహరించాలి. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదులపై ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టును నిర్మించ తలపెడితే, కృష్ణానది యాజమాన్య బోర్డు–గోదావరి నది యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం ఆమోదంతోనే నిర్మాణాన్ని చేపట్టాలి. ఈ నిబంధనను ఉల్లంఘించి, 2015లో తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టింది. వాటికి నేటికీ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులే లేవు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారాన్ని అర్థించారు. అలాగే, కృష్ణానది, దాని ఉపనదులపై ఆధారపడి ఒకేసారి 16 ప్రాజెక్టులకు సమగ్ర నివేదికలను తయారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీపీఆర్‌లు రూపొందించుకోవడానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, వాటికి నీటి కేటాయింపుల అంశాన్ని విధిగా పరిగణనలో ఉంచుకోవాలి.
బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 150 టీఎంసీల ‘క్యారీ ఓవర్’ నిల్వకు అనుమతించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించకపోవడం వల్ల నేడు రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుతున్నాయి. 2027 వేసవిలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే అవకాశముంది. 2026 జూన్ 1 నుంచి నేటి వరకు 221 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరింది. తెలంగాణ జలవనరుల శాఖా మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారమే తెలంగాణ 123 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 98 టీఎంసీలు వాడుకున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి మట్టం 827 అడుగులకు పడిపోయింది. 46 టీఎంసీల నిల్వ మాత్రమే ఉన్నది. ఈ రోజు కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 1454 క్యూసెక్కులు మాత్రమే తరలిస్తున్నది. ఈ అధికారిక గణాంకాలు ఏం తెలియజేస్తున్నాయో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
తుంగా లక్ష్మీనారాయణ
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్