Share News

పాలమూరు ఆపి కాళేశ్వరం మొదలుపెట్టలేదు!

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:52 AM

ప్రొఫెసర్ హరగోపాల్ ‘నీళ్ల కోసం పాలమూరు పోరుబాట’ శీర్షికన రాసిన వ్యాసంలో (26.09.2026) రెండు అంశాలపై ఆయన తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని...

పాలమూరు ఆపి కాళేశ్వరం మొదలుపెట్టలేదు!

ప్రొఫెసర్ హరగోపాల్ ‘నీళ్ల కోసం పాలమూరు పోరుబాట’ శీర్షికన రాసిన వ్యాసంలో (26.09.2026) రెండు అంశాలపై ఆయన తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని అనిపించింది.

మొదటిది– ‘‘తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ మధ్యంతరంగా దానిని ఆపి, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించింది’’ అన్న అభిప్రాయం. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అధికారం చేపట్టిన వెంటనే ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి పొంది వాయిదా పడిన పాలమూరు ప్రాజెక్టు ఫైలును బయటకు తీసి, ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా’ (ఎస్కీ) చేత డీపీఆర్‌ను తయారు చేయించడానికి రూ.5.71 కోట్లను మంజూరు చేస్తూ 01.08.2014న జీవో జారీ చేశారు. అలా కాళేశ్వరం కంటే ముందే పాలమూరు ప్రాజెక్టు పనులు మొదలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్కీ వారు తయారు చేసిన ముసాయిదా నివేదికలోని ప్రతిపాదనలపై ఇంజినీర్లతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. 7 టీఎంసీల నికర నిల్వ కలిగిన జూరాల అప్పటికే తన స్వంత ఆయకట్టు సహా బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు, పట్టణాలు, గ్రామాల తాగునీటి అవసరాలను అతికష్టం మీద తీరుస్తున్నది. దీనిపై రోజుకు 2 టీఎంసీల నీటిని తోడే పాలమూరు ప్రాజెక్టు భారాన్ని మోపితే జూరాల మీద ఆధారపడిన ప్రాజెక్టులే కాదు, పాలమూరు ప్రాజెక్టు కూడా నీటి లభ్యత లేక చతికిలపడిపోతుందన్న అభిప్రాయం నాటి సమీక్షలో వ్యక్తమైంది. ప్రాజెక్టు సాఫల్యతను పెంచడానికి సోర్సును జూరాల నుంచి 215 టీఎంసీల శ్రీశైలంకు మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పుకు అనుగుణంగా ఎస్కీ రూపొందించిన ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించడంతో ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసి, 11.06.2015న శంకుస్థాపన చేసింది. టెండర్లు పిలిచి, ఏజెన్సీలతో ఒప్పందాలు కుదిరాక ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయి. అయితే పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టినారని 2016 డిసెంబర్‌లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కొన్ని దుష్టశక్తులు కేసు వేయడంతో ట్రిబ్యునల్ ఏకపక్షంగా ప్రాజెక్టు పనులపై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేసింది. తర్వాత కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా తాగునీటి పనులను చేసుకోవడానికి అనుమతించింది కానీ సాగునీటి పనులు మాత్రం పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే చేపట్టాలని ఆదేశించింది.


ఈ కేసుల సందర్భంగా కోర్టుకు సమర్పించిన హామీ మేరకు మొదటి దశలో తాగునీటి సరఫరా పనులు, రెండో దశలో సాగునీటి కాలువల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర బడ్జెట్‌ నుంచే గాక కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ.10 వేల కోట్ల నిధులను సమకూర్చింది. అట్లా పాలమూరు ప్రాజెక్టులో జలాశయాలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాలువలు, పైప్‌లైన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు తదితర అనుబంధ పనులను ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొనసాగించిందే తప్ప మధ్యంతరంగా ఆపివేయలేదు. ఆగస్టు 2023 నాటికి తాగునీటి సరఫరా పనులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయి. సాగునీటి పనులు చేపట్టాలంటే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి తప్పనిసరి. కేంద్రం నికర జలాలు ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తుంది. కాబట్టి మైనర్ ఇరిగేషన్‌లో 45 టీఎంసీల మిగులు జలాలతోపాటు, నాగార్జునసాగర్ ఎగువన లభించే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 45 టీఎంసీలు– మొత్తం 90 టీఎంసీలను పాలమూరు ప్రాజెక్టుకు కేటాయిస్తూ 18.08.2022న ప్రభుత్వం జీవో జారీ చేసింది. రూ.55,080 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారుచేసి సీడబ్ల్యూసీకి, పర్యావరణ మంత్రిత్వశాఖకు, ఇతర కేంద్ర సంస్థలకు పంపింది. ఈ జీవోపై కూడా సుప్రీంకోర్టు, కృష్ణా ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ట్రిబ్యునల్‌ తెలంగాణ వాదనతో ఏకీభవించి ఏపీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పుతో సబ్-జుడిస్ సమస్య తొలగిపోయింది. కేంద్ర సంస్థల నుంచి అనుమతులకు మార్గం సుగమం అయ్యింది. ఇక పర్యావరణ అనుమతి రావడం ఖాయమన్న భావనతో ప్రభుత్వం సెప్టెంబర్ 2023లో కాలువల తవ్వకానికి టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం 06.10.2023న అదనపు టెర్మ్‌స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ను కృష్ణా ట్రిబ్యునల్‌కు నివేదించింది. ఇందులో 45 టీఎంసీల గోదావరి జలాల అంశం కూడా ఉండడంతో అది మళ్ళీ సబ్-జుడిస్‌గా మారిపోయింది. దీనితో కేంద్ర సంస్థలు అనుమతులు ఆపేసినాయి. మరోవైపు కేంద్రంలో చంద్రబాబు మద్దతుతో మోదీ ప్రభుత్వం ఏర్పడటంతో సబ్-జుడిస్ సాకు చూపి సీడబ్ల్యూసీ డిసెంబర్ 2024లో ప్రాజెక్టు డీపీఆర్‌ను తిప్పి పంపింది. దానితో పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేయకుండా ఫైల్‌ను అటకెక్కించింది. పర్యావరణ అనుమతి సాధించే వరకు ప్రాజెక్టులో కాలువల తవ్వకం అనేది ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం. ‘‘27 వేల కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఎకరాకూ నీరివ్వలేకపోయింది’’ అన్న ఆరోపణకు జవాబు ఇదే. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పిలిచిన కాలువల టెండర్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. గడచిన రెండేండ్లలో పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి సాధించే విషయంలో ఏ పురోగతీ లేదు. వాస్తవాలు ఇట్లుంటే– చిత్తశుద్ధితో, వ్యూహాత్మకంగా కాళేశ్వరంతో పాటే పాలమూరు ప్రాజెక్టు పనులను కొనసాగించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ‘పాలమూరును నిర్లక్ష్యం చేసినారని’ నిందించడం సబబా?


రెండవది– ‘‘ఆశ్చర్యంగా... జిల్లాకు అన్యాయం జరిగిందంటే, పాలమూరులో ప్రవహించే నీళ్లను డిండికి తరలించి, ఈ జిల్లా కంటే అభివృద్ధి చెందిన నల్లగొండకు నీటిని తీసుకుపోవడం ఏమిటి?’’ అని ప్రొఫెసర్ ప్రశ్నించినారు. శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసి నల్లగొండలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతిపాదించిన డిండి ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం పొందింది. పాలమూరు, డిండి ఎత్తిపోతలకు సోర్స్ శ్రీశైలమే కనుక రెండు వేరువేరు ఇన్‌టేక్‌లు నిర్మించడం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కష్టసాధ్యమని, రెండింటికీ ఒకే ఇన్‌టేక్‌ను ప్రతిపాదించినారు. రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోయడానికి నార్లాపూర్ పంప్‌హౌస్‌లో 145 మెగావాట్ల 9 పంపులు బిగిస్తున్నారు. ఈ 2 టీఎంసీలలో 1.5 టీఎంసీలు పాలమూరుకు, 0.5 టీఎంసీలు డిండికి తరలిస్తారు. ఇందులో ఎవరికీ ఏ అన్యాయం జరిగే అవకాశమే లేదు. అయినా పాలమూరు అధ్యయన వేదికవారు మొత్తంగా డిండి ప్రాజెక్టును రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే నీరు మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో వచ్చే కృష్ణా, భీమా, తుంగభద్ర వరద జలాలు. ఇవి పాలమూరు నుంచి పారే జలాలు ఎట్లా అవుతాయి? శ్రీశైలంలోకి చేరే వందలాది టీఎంసీల జలాల్లో 30 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు కూడా నల్లగొండ ఫ్లోరైడ్ పీడిత ప్రజలకు లేదా?

శ్రీధర్‌రావు దేశ్‌పాండే

విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 04:52 AM