Share News

పాఠకుడిని చేరలేని నేటి కవిత

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:30 AM

కేవలం కవులమనిపించుకోవాలన్న వ్యామోహం తప్ప తగిన నేపథ్యం, అవగాహన లేని వాళ్ళు ఎగబడటం వల్ల వచన కవితా ప్రక్రియ...

పాఠకుడిని చేరలేని నేటి కవిత

కేవలం కవులమనిపించుకోవాలన్న వ్యామోహం తప్ప తగిన నేపథ్యం, అవగాహన లేని వాళ్ళు ఎగబడటం వల్ల వచన కవితా ప్రక్రియ నిరర్థకమవుతోంది. ఛందోబందోబస్తులు, వ్యాకరణ నియమాలు మొదలైన సంకెళ్లను తెంచుకొని విషయాన్ని సూటిగా పారదర్శకంగా పాఠకుల కందించాలనే లక్ష్యంతో వచన కవిత ఆవిర్భవించింది. అయితే అది అతి సులభమైన ప్రక్రియ అనే అభిప్రాయంతో ఔత్సాహిక కవులు ఉత్సహపడటం వల్ల మౌలిక ప్రయోజనాన్ని, సాహిత్య గౌరవాన్ని కోల్పోతుంది. ఆధునిక కవితలు రాయడానికి నవ్య కవిత్వం చదివితే చాలు అనే కొందరు అతివాదుల ఉపన్యాసాలు కూడా యువకవులను పెడదోవ పట్టిస్తున్నాయి.

ఏ కాలంలోనైనా కవికి ప్రతిభ, సృజనాత్మక శక్తి, భాష మీద అధికారం అవసరం. కొందరు ప్రసిద్ధ కవులు కూడా పాశ్చాత్య కవిత్వ ప్రభావంతో ప్రయోగాలు చెయ్యడం వల్ల ఆధునిక తెలుగు కవితల్లో మార్మికత, అస్పష్టత చోటు చేసుకుంటున్నాయి. ‘‘నా తల్లో పాదాలు మొలుస్తాయి/ పాదాల్లోంచి తోటలు లేస్తాయి/ తోటల్లోంచి సముద్రాలు వీస్తాయి...’’ – ఇలాంటి కవితలు ఎవరికి అర్థమవుతాయి? ఏ ప్రయోజనాన్ని సాధిస్తాయి? ప్రాచీన కవిత్వంలో సంస్కృత పదబాహుళ్యం, అర్థం కాని సంధులూ సమాసాలూ వున్నాయని నిరసించి ఆధునిక కవిత్వాన్ని ఆదరించే సాహితీ ప్రియులకివి ఆశాభంగాలు కావా? ‘‘కవిత్వంలో అబ్స్‌క్యూరిటీ కొన్ని సందర్భాలలో ఉండొచ్చును.. అది ట్రాన్సపరెంట్‌ చీకటై ఉండాలి, నిన్ను పలకరించాలి’’ అనే తిలక్‌ నిర్వచనానికి ఇలాంటివి మింగుడుపడవు.

రాసినవాళ్ళే తమ ఉద్దేశ్యాన్ని, అన్వయాన్ని స్పష్టంగా వివరించలేని కొన్ని వచన కవితల కంటే సామాజిక చైతన్యం విషయంలో మినీ కవితలు, గజళ్లు, ఉద్యమ కవితలు మేలనిపిస్తున్నాయి. ఇంకా తెలుగువారి ఆస్తి అయిన పద్యాలను కూడా నిర్లక్ష్యం చెయ్యడం సరికాదు. వేమన, సుమతి వంటి శతకాల్లోని పద్యాలు, పౌరాణిక నాటకాల్లోని పద్యాలు, జాషువా కరుణశ్రీ వంటి వారి కలాలు జాలువార్చిన పద్యాలు తెలుగు వారి నోళ్లలో నానడం లేదా? ఆ మాటకొస్తే వ్యాపార ప్రధానాలైన సినిమాల్లోని పాటలు కూడా నిరక్షరాస్యులను సైతం ప్రభావితం చెయ్యడం లేదా?


జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సి. నారాయణరెడ్డి తను సినిమాలకు రాసిన పాటలు అనుషంగికాలని ప్రకటించినా, అవి ఆయన కావ్యాలకు మించిన ప్రయోజనాన్ని ప్రచారాన్ని పొందాయి. అలాగే ‘వెలుగునీడలు’ చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన ‘‘కల కానిది, విలువైనది, బ్రతుకు...’’ అనే పాట ఆత్మహత్యకు పూనుకున్న ఒక వ్యక్తిని బతికించడం కంటే ఏ సాహిత్య ప్రక్రియకైనా విలువైనదేముంటుంది. ‘మురళీకృష్ణ’ చిత్రంలో ఆత్రేయ రాసిన ‘‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని...’’ వంటి సందేశాలు ఎంతమంది ఆశోపహతుల్ని ఓదార్చవు? ‘పెళ్ళిపుస్తకం’ చిత్రానికి ఆరుద్ర రాసిన పాటలో ‘‘అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో’’ అనే పంక్తులు దాంపత్య జీవితంలోని అపశ్రుతులను చక్కదిద్దే ఆణిముత్యాలు కావా? – ఇవి సినిమా పాటల ప్రభావానికి చెందిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఈనాడు ఎన్నో సాహిత్య సంస్థలు నవలల, కథల పోటీలతో పాటు కవితల పోటీలు కూడా నిర్వహించి ఉత్తమ కవితలకు బహుమతులు అందచేస్తున్నాయి. ఈ తరుణంలో అవకాశాలను అందిపుచ్చుకుని వచనక కవితా ప్రక్రియ లక్ష్యాన్ని ప్రయోజనాన్ని యువతరం కవులు నిలుపుతారని ఆశిద్దాం.

పైడిపాల

99891 06162

ఈ వార్తలూ చదవండి

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!

Updated Date - Oct 05 , 2026 | 04:30 AM