Share News

ఆ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం కలగలేదా?

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:27 AM

రాహుల్‌ సాంకృత్యాయన్‌ విగ్రహ ధ్వంసంపై.. ఆయన రచనల ద్వారా అమితంగా ప్రభావితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులు, సాహిత్య సంఘాలు, కవులు, కళాకారుల నుంచి నామమాత్రంగానైనా నిరసన ప్రకటనలు రాకపోవటం విచారకరం. ఈ మౌనం రేపటిరోజు గురజాడ, కందుకూరి, కాళోజీ, భాగ్యరెడ్డివర్మ ఇత్యాదుల విగ్రహాల విధ్వంసానికి కూడా దారితీయవచ్చునేమో కదా!

ఆ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం కలగలేదా?
Rahul Sankrityayan

జూలై నెల మధ్యలో పశ్చిమబెంగాల్‌లోని రాణిగంజ్‌ ప్రాంతంలో రాత్రిపూట గుర్తు తెలియని దుండగులు కొందరు.. బహుభాషా పండితుడు, లోకసంచారి, విస్తృతంగా రచనలు చేసిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ విగ్రహాన్ని సమూలంగా నేలకూల్చేశారు. 1994లో రాణిగంజ్‌ బొగ్గు గనుల కార్మికులు నెలకొల్పిన విగ్రహం అది. దాని కూల్చివేతకు నిరసనగా అక్కడ రాహుల్‌జీ అభిమానులకు, బీజేపీ సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. కానీ, రాహుల్‌జీ రచనల ద్వారా అమితంగా ప్రభావితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులు, సాహిత్య సంఘాలు, కవులు, కళాకారుల నుంచి నామమాత్రంగానైనా నిరసన ప్రకటనలు రాకపోవటం విచారకరం. ఈ మౌనం రేపటిరోజు గురజాడ, కందుకూరి, కాళోజీ, భాగ్యరెడ్డివర్మ ఇత్యాదుల విగ్రహాల విధ్వంసానికి కూడా దారితీయవచ్చునేమో కదా!


కేదార్‌నాథ్‌ పాండే అనే పద్నాలుగు సంవత్సరాల కౌమారపు పిల్లగాడు, తన ఇంట్లో రెండు శేర్ల నెయ్యి ఒలకబోసిన పొరపాటుకు, తాతగారు కొడతాడని భయపడి ఇంటి నుంచి పరారీ అయ్యాడు. అప్పటికే అతనిని ఒక కవిత వెంటాడి వేధిస్తోంది. అది– ‘సైర్‌ కర్‌ దునియా కీ గాఫిల్‌ జిందగానీ ఫిర్‌ కహా... జిందగీ అగర్‌ కుచ్‌ రహీతో నౌజవానీ ఫిర్‌ కహా’ (మూర్ఖుడా ప్రపంచాన్ని పర్యటించు. జీవితం ఉన్నా మళ్లీ ఈ యవ్వనం తిరిగిరాదు). 1893లో ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లాలో గల పందహా అనే కుగ్రామంలో నిరక్షరాస్యుల కుటుంబంలో జన్మించిన ఆ బాలుడు ఆరవ తరగతి వరకే చదివినా ఏకసంథాగ్రాహి. ఒలికిన ఆ నెయ్యి అతడిని దేశదిమ్మరిగా, లోకసంచారిగా మార్చి, జ్ఞానసముపార్జనా సముద్రంలోకి నెట్టివేసింది. ఆ బాలుడు తర్వాతికాలంలో బౌద్ధమత దీక్షను స్వీకరించి ‘పండిత్‌ రాహుల్‌ సాంకృత్యాయన్‌’గా ప్రసిద్ధి పొందాడు.


జ్ఞానతృష్ణ అతడిని ఇరుకిరుకు ఇంటిగోడల మధ్య నుంచి ప్రపంచ విశ్వవిద్యాలయంలోకి నెట్టివేసింది. గురువులను వెతుక్కుంటూ కాశీ నగరానికి చేరుకుని సంస్కృతం, హిందీ భాషలలో పాండిత్యంపై పట్టు సాధించాడు. ఉత్తర భారతాన్ని బలంగా ప్ర‌భావితం చేస్తున్న ఆనాటి ఆర్యసమాజ ఉద్యమానికి ఆకర్షితుడై నాలుగు వేదాల అధ్యయనం కోసం ఢిల్లీ, పంజాబ్‌, లాహోరులను చేరుకున్నాడు. ఒకవైపు వేదశాస్త్రాలను ఔపోసన పడుతూ, మరోవైపు ‘చరైవేతి చరైవేతి’ అని శాస్త్రాలు చెప్పినట్లుగానే హరిద్వార్‌, రిషికేశ్‌, గంగోత్రి, యమునోత్రిలను కాలినడకన చుడుతూ హిమాలయ పర్వతాల పాదపంక్తులలోని ‘కిన్నెరుల లోకంలోకి’ (నేటి హిమాచల్‌ పైభాగం– టిబెట్‌కు చేరువగా) ప్రవేశించాడు. అక్కడి ప్రజల భాషా సంస్కృతులను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే బౌద్ధానికి ఆకర్షితుడయ్యాడు. టిబెట్‌ సరిహద్దుల్లోని బౌద్ధారామాలలో ఉంటూ, పాళీ భాషపై పట్టు సాధించి, బౌద్ధసాహిత్యాన్ని, ‘త్రిపిటకాల’ను అధ్యయనం చేయడం ప్రారంభించాడు


విభిన్నమైన భాషలను నేర్చుకోవటం ఆయనకు వినోదభరితమైన వ్యసనం. ఈలోగా గాంధీగారి చంపారన్‌ యాత్ర, చౌరీచౌరా ఉద్యమం ప్రారంభ మయ్యింది. జ్ఞానాన్ని ఆచరణలో అనుసరించాలని భావించే రాహుల్‌జీ.. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలను పర్యటిస్తూ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. అక్కడికి కూడా బౌద్ధమత సాహిత్యాన్ని, పాళీ భాషా గ్రంథాలను తీసుకుని వెళ్లి అధ్యయనం చేస్తూ, నోట్సులు రాసుకుంటూ రచనలు చేసేవాడు. అనేక దశలలో సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన మూడు నాలుగు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. అక్కడ సోషలిస్టులతో, కమ్యూనిస్టులతో సహవాసం చేశాడు. వారికి భారతీయ తత్వశాస్త్రంపై క్లాసులు తీసుకున్నాడు. వారు బోధించిన మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని అర్థం చేసుకుని సానుభూతిపరునిగా మారాడు. జ్ఞానదాహం ఆ పండితుడిని ‘అనేక మలుపులు, మెలికలు తిరుగుతూ స్వచ్ఛంగా ప్రవహించే గంగానదిలా’ మార్చివేసింది.


జైలు నుంచి విడుదల కాగానే.. ‘త్రిపిటకాల’ను మరింతగా అధ్యయనం చేయటానికి శ్రీలంకలోని అనురాధాపురము, కొలంబో వెళ్లాడు. అనేక బౌద్ధారామాలలో ఉపన్యాసాలు ఇచ్చాడు. తిరుగు ప్రయాణంలో తాళపత్ర గ్రంథాలను, సింహళభాషలో ఉన్న బౌద్ధ సాహిత్యాన్ని మనదేశానికి పట్టుకొచ్చాడు. ఆ తర్వాత అతని చూపు టిబెట్‌పై పడింది. మహమ్మదీయుల పరిపాలనలో నలందా విశ్వవిద్యాలయంపై దాడులు జరిగిన కాలంలో ఆనాటి బౌద్ధాచార్యులు ప్రాణాలకు తెగించి బౌద్ధ సాహిత్యాన్నంతా టిబెట్‌లోని దలైలామా ఆరామానికి తరలించారు. వాటి అధ్యయనం కోసం ప్రయాణానికి ముందే రాహుల్‌జీ అక్కడి భాష ‘బోటియా’ను, సంస్కృతిని కూలంకషంగా అధ్యయనం చేసి, ఆ భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. కష్టతరమైన మంచు మైదానాలు, కొండలలో ప్రయాణించి, మూడు పర్యాయాల్లో– ఒకప్పుడు తరలివెళ్లిన బౌద్ధ గ్రంథాలను తిరిగి బిహార్‌లోని గ్రంథాలయంలోకి చేర్చాడు.


దేశానికి తిరిగివచ్చిన తర్వాత కమ్యూనిజంపై అభిమానంతో పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. రైతు సమస్యలపై పోరాడుతూ అఖిలభారత కిసాన్‌ సభకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1944లో బెజవాడలో నిర్వహించిన కిసాన్‌ సంఘ్‌ సభకు హాజరై, తర్వాత ప్రఖ్యాత కళా విమర్శకుడు సూర్యదేవర సంజీవదేవ్‌తో కలిసి అమరావతి, ధాన్యకటకం లాంటి బౌద్ధ క్షేత్రాలను, స్థూపాలను, చైత్యాలను, ఆరామాలను దర్శించాడు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి పూరీ వరకు ఆయన కాలుమోపని చారిత్రక స్థలాలు లేవు. ‘‘ఎల్లలోకములొక్క ఇల్లై’’ అన్నట్లు.. ఇల్లూ వాకిలీ లేని ఆ ‘జంగమదేవర’ భూ మార్గం ద్వారా బర్మా, మలేసియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, జపాన్‌, కొరియా నుంచి వ్లాడివోస్టోక్‌ చేరుకుని, పదిరోజులు రైలు ప్రయాణం చేసి మాస్కో చేరుకున్నాడు. రష్యాలో పర్యటించి, మధ్య ఆసియా దేశాలను అధ్యయనం చేసి, అఫ్ఘానిస్థాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్నాడు. ఇరాన్‌, ఇరాక్‌, లండన్‌, పారిస్‌లను దర్శించి అక్కడి మేధావులకు ఉపన్యాసాలు ఇచ్చాడు.


నిజమైన విద్య విశ్వవిద్యాలయాల గోడలకవతలనే ఉందన్నట్లు... ఏ పట్టాలు, సర్టిఫికెట్లు లేని ఆ పండితుడికి మన దేశంలోని ఏ యూనివర్సిటీ కూడా ఎటువంటి గుర్తింపూ ఇవ్వలేదు. కానీ మాస్కోలోని ప్రాచ్యదేశాల భాషా విభాగం మాత్రం ఆయన సేవలు కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకుంది. అక్కడి వారికి సంస్కృతం నేర్పుతూ తను రష్యన్‌ భాషను నేర్చుకున్నాడు. ఆయనొక నడిచే విద్యాలయం. ఆయన రచనలు తెలుగులో ఓల్గా సే గంగా, జయ ఔధేయ, దివోదాసు, లోకసంచారి, ఋగ్వేద ఆర్యులు, దర్శన దిగ్దర్శన్‌ లాంటివి ఇప్పటికీ అన్ని పుస్తక దుకాణాలలో దొరుకుతున్నాయి.


నేయి ఒలకబోసిన నేరాన్ని నెత్తిమీద మోసుకుంటూ ఈ దునియా అంతా సంచరించాడు. ఆ ‘చల్‌ అకేలా ముసాఫిర్‌’ జ్ఞానమార్గం, కర్మమార్గం త్రికరణ శుద్ధిగా జీవితం చివరిక్షణాల వరకూ ఆచరించాడు. ఆ ‘త్రిపిటకాచార్యుడు’ పాండిత్యంలో కాళిదాసు, భోజరాజు, ఆచార్య నాగార్జునుడు, అశ్వఘోషుడు, దిగ్నాగుడు, ధర్మకీర్తి లాంటి వారితో సమస్థాయి సాధించినవాడు. 1963లో రాహుల్‌జీ మాస్కోలోని ఓ హాస్పిటల్‌లో... స్పృహ, జ్ఞాపకశక్తి లేని స్థితిలో ఉన్న రోజులలో, భారత ప్రభుత్వం ఆయనకు ‘పద్మభూషణ్‌’ను ప్రకటించింది. ఆ వార్త ఆయనకు తెలియదు. ఆయన్ను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చాక, ఏడు పదులు దాటిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి డార్జిలింగులోని తన స్వగృహంలో కన్నుమూశారు.

‘‘జానేవాలే కభీ వాపస్‌ నహీ ఆతే, లేకిన్‌ జానేవాలో కీ యాద్‌ ఆతీహై’’.

  • పరవస్తు లోకేశ్వర్‌


ఇవి కూడా చదవండి

కొత్త ఆశలు రేపిన కుర్రకారు..!

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

Updated Date - Aug 02 , 2026 | 07:30 AM