కొత్త ఆశలు రేపిన కుర్రకారు..!
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:19 AM
మొబైల్ ఫోన్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పుణ్యమాని మౌనాన్ని వీడిన పౌరులు, ఇప్పుడు భయ సంకోచాలనూ పూర్తిగా విడనాడినట్టు కనిపిస్తోంది. పోలీసులు, లాఠీలు, తుపాకులు, నిర్బంధాలు యువజనులను ఇంకెంత మాత్రం భయపెట్టడం లేదు. సీనియర్ పౌరులూ యువతనే అనుసరించడం ఖాయం. రాజకీయ పార్టీలకు అతీతమైన రాజకీయక్షేత్రం క్రమంగా విస్తరిస్తోంది.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన ఒక పాఠాన్ని నేర్పింది. 79 సంవత్సరాల ప్రజాస్వామిక రాజకీయాలలో భారతీయ రాజకీయ పార్టీలు ఎన్నడూ నేర్వని పాఠమది. ఈ ఏడాది వేసవి కాలంలో సదరు ‘పాఠం’ ప్రథమ సూచనలు సూక్ష్మంగా దృగ్గోచరమయ్యాయి. ఉద్యమాలు, పోరాటాల ద్వారా రాజకీయపార్టీలు మార్పును తీసుకువస్తాయని చరిత్ర ఇప్పటివరకు మనకు నేర్పింది. ఆ పాఠం ఇప్పటికీ ఒక సత్యం. వలసపాలన నుంచి భారత్‌ను విముక్తం చేసే ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహించింది. స్వాతంత్ర్య విజయం సాధించింది. భారత గణతంత్ర రాజ్యాన్ని వ్యవస్థాపించింది. దశాబ్దాలపాటు వరుసగా ఎన్నికలలో విజయాలు సాధించింది. రాజ్యాంగబద్ధ పాలన, లౌకికవాదం, రిజర్వేషన్లు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, స్వతంత్ర కేంద్ర బ్యాంకు, అధికారాల బదిలీ, ఆర్థిక వనరుల పంపిణీ మొదలైన వాటితో భారత ప్రజాస్వామ్యానికి సుదృఢ పునాదులు నిర్మించింది.
ప్రాంతీయ పార్టీలు– ద్రావిడ పార్టీలు వీటికొక ఉదాహరణ. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ రాష్ట్ర ప్రజల మాతృభాషకు, రాష్ట్ర హక్కులకు, సాంస్కృతిక అస్తిత్వానికి, భూ సంస్కరణలు మొదలైన వాటికి ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయి. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి పౌర స్వేచ్ఛలకు రాజ్యాంగబద్ధ రక్షణలు కల్పించింది. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ మూవ్‌మెంట్ దేశ సరిహద్దుల వెలుపల నుంచి అక్రమంగా జరుగుతున్న వలసలను అరికట్టే చట్టాల నిర్మాణానికి దారితీసింది. భారతదేశ పరిపాలనలో ప్రధాన మార్పులు అన్నిటినీ రాజకీయ పార్టీలే ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికల ద్వారా సాధించాయి.
కాక్రోచ్ జనతా పార్టీ సంప్రదాయకమైన రీతి రివాజుల ప్రకారం ఒక రాజకీయ పక్షం కాదు. అభిజిత్ దీప్కే అనే ఒక యువకుడి ఆగ్రహపూరిత ప్రతిస్పందన నుంచి సీజేపీ ఉద్భవించింది. ఉన్నత న్యాయవ్యవస్థలోని ఒక పెద్ద మనిషి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్య అభిజిత్‌కు, ఆయన స్నేహితులకు మనస్తాపం కలిగించింది. ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా అభిజిత్ ఒక డిజిటల్ వేదికను ప్రారంభించి ‘కాక్రోచ్‌లు అన్నీ సంఘటితమయితే ఏం జరుగుతుంది?’ అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగులు, బద్ధకస్తులు నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేవారు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వృత్తిపరమైన అవగాహనతో నిశితంగా విశ్లేషించగలవారు ఎవరైనా ఈ డిజిటల్ సమూహంలో చేరవచ్చని ఆయన ఆహ్వానించారు. విద్యార్థులు, స్కాలర్లతో సహా ఈ అసాధారణ అర్హతలు ఉన్నవారు అసంఖ్యాకంగా ఉన్నారు. ఉద్యోగం లేదా వృత్తితో నిరంతరం ఆన్‌లైన్‌లో ఉంటూ, సమస్యలపై అవగాహనతో వాదించగల ప్రతిభాపాటవాలు గలవారూ చాలామంది ఉన్నారు. వీరిలో కళాకారులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, నర్సులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, జూనియర్ ప్రభుత్వోద్యోగులు తదితర గౌరవనీయ స్త్రీ పురుషులు సంఖ్యానేకంగా ఉన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీకి ఒక వ్యవస్థాపక నాయకుడు ఉన్నారు, అధికార ప్రతినిధులు ఉన్నారు. పట్టుదల, ధైర్యసాహసాలు ఉన్నాయి. అంతకుమించి మరేవీ లేవు. సీజేపీకి సంస్థాగత నిర్మాణం లేదు, సభ్యత్వం లేదు. అధికారికంగా నమోదు కాని పార్టీ అది. విధానాల ప్రకటనా జరగలేదు. ఒక రాజకీయ పక్షానికి ఉండే లక్షణాలు ఏవీ దానికి లేవు. అయినప్పటికీ 35 రోజుల నిరసనతో ఇద్దరు కేంద్ర కేబినెట్ మంత్రులు తమతో సంప్రదింపులు జరిపేలా ఒత్తిడి తెచ్చింది. తాము లక్ష్యంగా చేసుకున్న మంత్రి రాజీనామాను సాధించింది. నిరసనకారులపై ప్రభుత్వ కేసులను ఉపసంహరింప జేయడంలో సఫలమయింది. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీలు పొందింది. ఇదంతా మున్నెన్నడూ జరగనిది.
నేను మొట్టమొదటనే చెప్పినట్టు రాజకీయ పార్టీలకు అతీతమైన అటువంటి రాజకీయ ప్రదేశం 2026లో తమిళనాడులో కనిపించింది. సినీ నటుడు జోసెఫ్ విజయ్ 2024 ఫిబ్రవరిలో ఒక రాజకీయ పార్టీ (తమిళగ వెట్రి కళగం–టీవీకే)ను స్థాపించారు. అయితే అది ఒక క్రమబద్ధమైన రాజకీయ పార్టీ స్వరూప స్వభావాలను సంతరించుకోలేదు; అది ఒక అవ్యవస్థిత అభిమానుల సంఘంగా మాత్రమే ఉన్నది. ఈ అభిమానుల సంఘం సభ్యులే వివిధ స్థాయిలలో టీవీకే కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయక రాజకీయ వివేకానికి విరుద్ధ పద్ధతులలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేశారు. కులం, మతం, జెండర్, కుటుంబ వారసత్వాలు, ఆస్తులు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆ ఎంపిక జరిగింది. 234 మంది అభ్యర్థులలో 200 మందికి ప్రచార వ్యయాలకు అవసరమైన సొమ్ము కనీసంగా కూడా లేదు.
నిజానికి వారు ప్రచారమనేదే చేయలేదు. టీవీకే అభ్యర్థులలో చాలామంది తాము పోటీ చేసే నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అపరిచితులు. పోలింగ్ బూత్ ఏజెంట్లు గానీ, పోలింగ్ ఏజెంట్లు గానీ, కౌంటింగ్ ఏజెంట్లు గానీ వారికి కనీస సంఖ్యలో కూడా లేరు. విజయ్ రోడ్ షోలు నిర్వహించారు. కొన్ని సమావేశాలలో ప్రసంగించారు. ఓటర్లు పట్టించుకున్నదల్లా ‘విజయ్’, ఆయన పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘విజిల్’ మాత్రమే. అయితే సోషల్ మీడియా ద్వారా విజయ్, ఆయన పార్టీ ప్రజలకు సన్నిహితమయ్యారు. ప్రతి చోటా, ప్రతి కుటుంబంలోను విజయ్ గురించి మాట్లాడుకున్నారు. అన్నివిధాలా బలోపేతమైన ప్రత్యర్థి పక్షాలు డీఎంకే, అన్నా డీఎంకేలను ఎదురొడ్డి టీవీకే 108 స్థానాలలో విజయం సాధించింది. 35శాతం ఓట్లను కైవసం చేసుకున్నది.
టీవీకే విజయాన్ని ఏ రాజకీయ పార్టీ ఊహించలేదు. ఏ రాజకీయ నాయకుడూ కలలోనైనా అనుకోలేదు. ఏ పాత్రికేయుడూ పొరపాటున కూడా అభిప్రాయపడలేదు. ఓటర్ల సర్వేలు నిర్వహించే నిపుణులలో ఏ ఒక్కరూ సూచనమాత్రంగానైనా చెప్పలేదు. తమిళనాడులో ఆ అద్భుత రాజకీయ మార్పును, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా పౌరులే సాధించారు. టీవీకే గెలుపు పౌర వివేకానికి విజయం. పరస్పర పరిచయం లేని, ఒకరితో ఒకరు మాట్లాడుకోని ఓటర్లు ఒకే తీరున ఓటు వేసి రాజకీయ మార్పు తీసుకువచ్చారు. ప్రభవిస్తోన్న కొత్త పౌర చైతన్యంలో అటువంటి వినూత్న రాజకీయ పరివర్తనలు అసాధ్యమేమీ కాదు.
తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనూహ్య పరిణామాన్ని, జంతర్ మంతర్ నిరసన పర్యవసానాలను రాజకీయ పార్టీలు నిష్పాక్షికంగా పరీక్షించాలి. సువ్యవస్థిత రాజకీయ పార్టీలు కాలం చెల్లిపోయినవిగా కాకపోవచ్చు. కానీ, హై కమాండ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ కౌన్సిల్, మహాసభ, సభ్యత్వం, పార్టీ సంస్థాగత ఎన్నికలు మొదలైనవి అనవసరమైనవి అవుతాయి. ‘ఓటు బ్యాంకు’ అనే పదం మటుమాయం కావచ్చు. మొబైల్ ఫోన్, ట్విటర్ (ఎక్స్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పుణ్యమా అని మౌనాన్ని వీడిన పౌరులు ఇప్పుడు భయసంకోచాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. పోలీసులు, లాఠీలు, టియర్ గ్యాస్, తుపాకులు, అరెస్టులు, నిర్బంధాలు యువజనులను ఇంకెంత మాత్రం భయపెట్టడం లేదు. వయోజనులు, సీనియర్ పౌరులూ యువతనే అనుసరించడం ఖాయం. రాజకీయ పార్టీలకు అతీతమైన రాజకీయ ప్రదేశం మరింత విస్తృతమవాలని నేను కోరుకుంటున్నాను.
జెన్–జీ, ఇతర నిరసనకారుల ఎదుట అతి ముఖ్యమైన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి: తొలుత విశ్వవిద్యాలయాలను మధ్యయుగాల మనస్తత్వాలు, సంస్కరణ వ్యతిరేక ధోరణుల నుంచి విముక్తం చేయాలి; కొంతమంది వ్యక్తులు ధర్మం, సంస్కృతి పేరిట ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించే మోరల్ పోలీసింగ్‌కు, పోలీసుల క్రూర పద్ధతులకు, బజరంగ్‌దళ్ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలి; స్థానిక రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆసుపత్రులు, రేషన్ దుకాణాలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు మొదలైన వాటిలో అవినీతిపై పోరాడాలి. మేలైన, మెరుగైన మార్పు ప్రతిదీ సుసాధ్యమేనన్న భావన జంతర్ మంతర్ ఆందోళన అనంతరం కలుగుతోంది.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
ఇవి కూడా చదవండి
దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్
సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం