ఆరెంజ్ ఎకానమీ.. ఏ రేంజ్?
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:15 AM
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే. ముఖ్యంగా Is India Becoming a Dictatorship? అంటూ అద్భుతమైన, ఆధారసహితమైన రీసెర్చ్ కంటెంట్‌తో...
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే. ముఖ్యంగా Is India Becoming a Dictatorship? అంటూ అద్భుతమైన, ఆధారసహితమైన రీసెర్చ్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ధ్రువ్ రాఠీ, గోదీ మీడియా అంటూ మోదీని టార్గెట్ చేసిన రవీష్ కుమార్, ‘The Deshbhakt’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన ఆకాష్ బెనర్జీ, యూపీ మే కా బా? (యూపీలో ఏముందని) దేశమంతా నిరుద్యోగం, పేదరికమేనంటూ గళమెత్తిన నేహాసింగ్ రాథోడ్... ఇలా పదుల సంఖ్యలో యువ ఇన్‌ఫ్లూయెన్సర్లంతా బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఒంటరిగా, బిగ్గెస్ట్ పార్టీగా ఉన్న తిరుగులేని బీజేపీని ప్రాంతీయ పార్టీల చలువతో అధికారం నిలబెట్టుకునే స్థాయికి తెచ్చిన ఘనత ఈ యువ ఇన్‌ఫ్లూయెన్సర్లదే అంటే నమ్మితీరాల్సిందే. ఈ వాస్తవాన్ని, ముప్పును ముందే పసిగట్టింది కాబట్టే.. వారిని నిలువరించేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆరెంజ్ ఎకానమీకి తెరలేపిందన్నది కాదనలేని నిజం. ఎక్కడిదీ ఆరెంజ్ ఎకానమీ?
బ్రిటన్ దేశానికి చెందిన ప్రఖ్యాత వ్యూహకర్త, రచయిత జాన్ హోకిన్స్ తన “The Creative Economy: How People Make Money from Ideas” పుస్తకం ద్వారా సృజనాత్మకతకు, ఆర్థిక వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటిచెబుతూ ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని వినియోగించారు. అయితే, ఆరెంజ్ ఎకానమీకి ఒక స్పష్టమైన రూపునిచ్చింది మాత్రం ఇంటర్–అమెరికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులు ఫెలిప్ బ్యూట్రాగో, ఇవాన్ డ్యూక్ వాస్తవానికి మన దేశానికి ఆరెంజ్ ఎకానమీ అనే పదం కొత్త కానీ, అనేక దేశాలు ఆరెంజ్ ఎకానమీకి ప్రోత్సాహకాలు అందించి అద్భుతాలు చేసి చూపించాయి.
ఆరెంజ్ ఎకానమీని అధికారికంగా తన జాతీయ విధానంలో ‘ఆరెంజ్ లా’గా చేర్చుకున్న మొదటి దేశం కొలంబియా. అదే బాటలో దక్షిణ కొరియా ఆరెంజ్ ఎకానమీతో అద్భుతాలు సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. నేడు ప్రపంచాన్ని ఉర్రుతలూగిస్తున్న కె–పాప్ మ్యూజిక్, కె–డ్రామాల (సినిమాలు) వెనుక ఉన్నది ఈ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థే. ఆ తర్వాత బ్రిటన్, నైజీరియాలు తమ దేశాల్లో ఆరెంజ్ ఎకానమీని విపరీతంగా ప్రోత్సహించారు. యునెస్కో నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఆరెంజ్ ఎకానమీ ఏటా సుమారు 2.25 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఆలోచనలే అసలైన సంపదగా మారే రోజులు వస్తాయని రెండు దశాబ్దాల క్రితం జాన్ హోకిన్స్ ఊహించారు. సంపద అంటే భూమి, బంగారం లేదా యంత్రాలు అనుకునే ప్రపంచానికి ‘ఆలోచనలే అసలైన సంపద’ అని ప్రకటించిన వ్యక్తి జాన్ హోకిన్స్.
ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని ఆరెంజ్ ఎకానమీ సరిగ్గా జాన్ హోకిన్స్ ఆలోచనలను అవగతం చేసుకొని రూపొందించిందే. ఆయన తన పుస్తకంలో ప్రస్తావించిన ‘వ్యక్తిగత సృజనాత్మకత’ ఆధారంగానే బడ్జెట్‌లో ఇండివిడ్యువల్ టాలెంట్‌ను గుర్తించేందుకు ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ టెక్నాలజీస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా 15 వేల పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు ఏర్పాటుకు పునాదులు పడ్డాయన్నది నిర్వివాదాంశం. అంతేకాదు, ఆలోచనలను వ్యాపారాలుగా మార్చడం కోసం ఏర్పాటు చేసిన ఆరెంజ్ ఎకానమీ ఫండ్ రూ.2,500 కోట్ల నిధి కూడా హోకిన్స్ చెప్పిన ‘How people make money from ideas’కు ఆచరణాత్మక రూపమే. సృజనాత్మకత కొత్తది కాదు, ఆర్థికశాస్త్రమూ కొత్తది కాదు.. కానీ వాటి మధ్య ఏర్పడిన ఈ కొత్త బంధమే భవిష్యత్తును శాసిస్తుందని మన పాలకులు అర్థం చేసుకోవడానికి రెండు దశాబ్దాలు పట్టడమే విడ్డూరం.
భారతదేశంలో సినిమా, సంగీతం, కళాకారులు, ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇప్పటివరకు వీటిని కేవలం వినోదంగానే చూశారు. కానీ 2026–27 బడ్జెట్ ద్వారా దీన్ని ఒక వ్యవస్థీకృత ఆర్థిక రంగంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల గ్రామీణ కళాకారులకు కూడా అంతర్జాతీయ మార్కెట్ దొరికే అవకాశం ఉంది. ఆరెంజ్ ఎకానమీ వంటి అద్భుతమైన చొరవ తీసుకున్నప్పటికీ అవి అందరికా? లేక బీజేపీని స్తుతించే కంటెంట్ క్రియేటర్లకే ఈ బడ్జెట్ కేటాయిస్తారా అనే సందేహం యువతలో ఉంది. అందుకే చాలామంది ఇది ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ క్రియేటర్లను కార్నర్ చేసే కార్యక్రమంగా విమర్శిస్తున్నారు. అయితే అది వాస్తవం కాదని, కంటెంట్ ఉన్న ప్రతీ కటౌట్‌కి ఆరెంజ్ ఎకానమీ అండగా నిలబడుతుందనే భరోసా కల్పించాల్సింది ప్రభుత్వమే. ఈ దేశ యువత భవితకు ఆరెంజ్ ఎకానమీ హారతి పట్టాలని ఆశిద్దాం. ఆరెంజ్ ఏ రేంజ్ కార్యక్రమం అన్నది భవిష్యత్తే చెప్పాలి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇటువైపుగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
శ్రీపాద రమణ
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News