ఆందోళనల మాటున అరాచకమా?
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:38 AM
ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నా దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కడం రివాజుగా మారింది. భారత్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ఉన్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల పత్రికలలో వచ్చిన వార్తల...
ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నా దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కడం రివాజుగా మారింది. భారత్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ఉన్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగానో, ఇక్కడ జరిగిన ఒక ఘటననో చూపించి చట్టసభలను అదేపనిగా అడ్డుకోవడం కొన్ని రాజకీయ పక్షాలకు దశాబ్దకాలంగా అలవాటుగా మారింది. ఇందులో ప్రధానపాత్ర దేశాన్ని నాలుగు దశాబ్దాలు పాలించి, ఇప్పుడు అధికారం లేక తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీదే. అవినీతికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా 2013లో అన్నా హజారే నిరశన వ్రతం చేపడితే, రాహుల్‌గాంధీ దృష్టిలో నాడు అది దేశానికి అరిష్టం. కానీ, ఆయన ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుంగ్ నిరశనకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు, పార్లమెంట్ ముట్టడికి వచ్చిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలకు వత్తాసు పలికారు. అంతేకాదు, ఏకంగా ప్రధానమంత్రి నివాసం ఎదుట, ఎలాంటి సమాచారం లేకుండా తానే స్వయంగా ధర్నాకు దిగారు. చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడినా ప్రధాని పదవికి రాజీనామా చేయని వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ, ఆ చెట్టు పేరుతోనే మనుగడ సాగిస్తున్న ఈ నేత, ఇప్పుడు నీట్ నిర్వహణలో జరిగిన ఒక తప్పిదాన్ని చూపి, ప్రధాని రాజీనామా చేయాలని ధర్నాకు దిగడం ఎంత అసంబద్ధమో కదా!
నీట్ ప్రశ్నపత్రం బహిర్గతమయినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ‘విద్యార్థులు’ పేరుతో ఈ ఉద్యమం ప్రారంభమయింది. ఏదైనా ప్రశ్నపత్రం బహిర్గతం కావడం ఒక తరం మీద దుష్ప్రభావాన్ని చూపేదే. అది అవ్యవస్థకు నిదర్శనం కూడా. కానీ కేవలం నీట్ ప్రశ్నపత్రం బహిర్గతమయినందుకు ప్రారంభమైన ఈ నిరసనలో, అది కూడా జెన్–జీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అలజడిలో నిజాయితీ ఎంత? అహింసాయుతంగా పోరాటం చేస్తామని అది చెబుతోంది కానీ, జూలై 20న ‘వేలాదిమంది’ జరిపిన పార్లమెంట్ ముట్టడి ప్రయత్నంలో కనిపించినది అహింసా పంథాయేనా? సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష శిబిరంలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రస్తావన ఎందుకు? దీనికీ నీట్ ప్రశ్నపత్రం లీక్‌కీ సంబంధం ఏమిటి? ప్రశ్నపత్రం బహిర్గతం కావడానికి, సీతారాములకు ముడిపెట్టి ఒక స్టాండప్ కమేడియన్ తన పైత్యాన్ని ప్రదర్శించడం ఎందుకు? ఇస్లాంను కీర్తించే గజల్స్ మారుమోగడం ఎందుకు? భరతమాత భావనను కించపరచడం ఎందుకు?
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో జెన్–జీ ఉద్యమం వలెనే భారత్‌లోనూ యువతరం తిరగబడుతోంది అంటూ పార్లమెంట్ వేదికగా కూడా బీజేపీ ప్రభుత్వానికి బెదిరింపులు వినిపించాయి. జూలై 20 నాటి పార్లమెంట్ ముట్టడి వేళ కూడా కొందరు వీరావేశంగా టీవీ చానెళ్ల ముందు అలాగే గర్జించారు. ఇంతకీ ఆ మూడు దేశాలలో జెన్–జీ ఉద్యమం తరువాత పరిస్థితి ఏమిటి? వాంగ్‌చుక్ జంతర్ మంతర్ దగ్గర ఆమరణ దీక్షకు కూర్చున్నప్పుడే నేపాల్‌లో సమాంతరంగా జరిగిన పరిణామాలు అభిజిత్ దీప్కే, అనుచర జెన్–జీలకు తెలియనట్టుంది. జెన్–జీ హింసాయుత అలజడితో ఇటీవలే నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్‌షాను ఇప్పుడు అదే జెన్–జీ రాజీనామా చేయాలంటూ రోడ్డెక్కింది. ఇక్కడ నీట్ ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో దేశాన్ని అస్థిరం చేయాలన్న అసంబద్ధ వైఖరిని మరిపిస్తూనే, రాంగ్ పార్కింగ్‌లో మోటార్ బైక్‌ను ఉంచిన గణేశ్ అనే నేపాలీ యువకుడు, ట్రాఫిక్ పోలీసులతో గొడవపడి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి పాల్పడటంతో దీనికి బాధ్యత వహిస్తూ బాలెన్ రాజీనామా చేయాలని జెన్–జీ రోడ్డెక్కింది. అంతేనా! ప్రభుత్వ స్థలాలలోని అక్రమ కట్టడాలను కూల్చినందుకు కూడా బాలెన్‌మీద జెన్–జీ కన్నెర్ర జేసింది. బంగ్లాదేశ్‌లో హసీనాను తరిమేసి, యూసుఫ్‌ను దేశాధినేతను చేసింది జెన్–జీ. కానీ, ఆయన మీద కూడా అనతికాలంలోనే అసంతృప్తి రేగింది.
కాంగ్రెస్, దాని వెంట ఉన్న విపక్షాలు పూర్తిగా అరాచకాన్నే కోరుకుంటున్నాయి. జూలై 21న ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించడం ముమ్మాటికీ అరాచక సృష్టికే. 2022లో శ్రీలంకలో రాజపక్స అధికార భవనాన్ని ఆక్రమించడం, 2025లో నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసాన్ని ముట్టడించడం గుర్తుకు రావడం లేదా? ‘నేపాల్ పరిస్థితులు వస్తాయనీ, తెస్తామనీ’ గొంతు చించుకునే నాయకుల, పార్టీల ఉద్దేశం అక్కడిలాగే మన పార్లమెంట్ భవంతికి నిప్పు పెట్టడమేనా? అంతేకాదు, ఢిల్లీ తాజా పరిణామాలు కొందరు రైతులకు తమ డిమాండ్లను గుర్తుకు తెచ్చాయి కూడా.
దేశంలో రాజకీయ నిరుద్యోగులకూ, కొన్ని చట్టాలు రావడం ఇష్టంలేని వారికీ విద్యార్థుల జీవితాలే గుర్తుకు వస్తాయి. కాబట్టి జెన్–జీలో కనిపించే అవలక్షణాలను ఇకనైనా బేరీజు వేసుకోవాలి. ఇది అరాచకాన్ని నమ్ముకుంది. అలజడి చేయడానికి తీసుకున్న విషయం ఒకటైతే, అంతర్గతంగా ఉండే ఆలోచన వేరొకటి. ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్నే తుదముట్టించే గొడ్డలి పిడి తరహా లక్షణం వీరి సొంతం. త్రివర్ణ పతాకం పట్టుకుని మరీ దేశ సార్వభౌమాధికారం పట్ల అవిధేయతను ప్రదర్శిస్తున్నారు. రాజ్యాంగ ప్రతులను, డాక్టర్ అంబేడ్కర్ చిత్రాలను పట్టుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ అంశాలను యువత గుర్తించాలి. ప్రజాస్వామ్య పద్ధతులలో వ్యవస్థను మెరుగుపరచడానికి ఆలోచించాలి. అరాచకాన్ని తెచ్చుకుంటే అభివృద్ధిని అర్ధ శతాబ్దం వెనక్కి నెట్టడమే.
గోపరాజు నారాయణరావు
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు