Share News

ఊరి దారులు

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:37 AM

పొట్టలో పిట్టలు కూస్తున్న వేళ అవ్వ చేతి గాజుల సవ్వడి వంటింటి నుంచి వినిపించే మొదటి పిలుపు...

ఊరి దారులు

పొట్టలో

పిట్టలు కూస్తున్న వేళ

అవ్వ చేతి గాజుల సవ్వడి

వంటింటి నుంచి వినిపించే

మొదటి పిలుపు

పొలిమేర దాటకముందే

చింతచెట్టు నీడలో

చేతికందిన రెండు చింతకాయలు

ఆకలికి రెండు పూటల పండుగ

బావి దగ్గర తడిసిన గోచీతో

బిక్కు బిక్కుమంటూ నిలబడిన బాల్యానికి

నేరేడు పళ్ళు

నల్లని మిఠాయి పొట్లాలు

మామిడికాయ ముక్కకు

ఉప్పూ కారం అద్దుకుని

నాలుక మీద పెట్టుకుంటే

ఇంట్లో పండని పండుగలన్నీ

ఒక్కసారిగా నోట్లోనే పండేవి

ఎండకు ఎండిన పెదవుల మీద

కొబ్బరి నీళ్లు పడితే

ఎవరో తల నిమిరినట్టుండేది

పొలంలో మిగిలిపోయిన

వేరుశెనక్కాయల కోసం

మట్టిని వేళ్లతో తొలిచిన రోజులు

ఇప్పటికీ చేతిగీతల్లోనే

దాచుకున్నాను

చెట్టు మీద పండినదానికంటే

నేల మీద దొరికినదే

ఎక్కువ తియ్యగా ఉండేది

ఆకలి మర్మాన్ని

విప్పి చూపిన

మధురమైన పాఠమది

రాత్రి పొయ్యి మీద

చివరి మంటతో ఉడికిన

చారన్నం వాసన

ఇప్పటికీ

ఎక్కడో దూరంగా ఉన్న

ఆ ఇంటి తలుపు తెరుస్తుంది

కూర తక్కువైతే

పచ్చిమిరపకాయను

రెండుగా చీల్చి

అన్నంలో కలిపిపోయిన

ఆ నలుగురు మనుషుల్ని

ఇప్పుడు ఎక్కడని వెతకను?!

పొట్ట నిండకపోయినా

మనసు మాత్రం

అవ్వ ఒడిలో

ఎప్పుడూ నిండిపోయేది

ఇప్పటికీ

వేసవి మధ్యాహ్నాన

ఒంటరిగా నిలిచిన

ఆ మామిడి చెట్టును చూస్తే

దాని కొమ్మలకన్నా ముందే

నా బాల్యం

పరుగెత్తుకుంటూ వచ్చి

చేతులు చాస్తుంది

ఒకప్పుడు

ఆకలిని మోసిన

ఈ చిన్నపేగు

ఇప్పుడు

జ్ఞాపకాలతో నిండిపోయి

తిరిగి ఆకలేస్తోంది...

అప్పటి తిండికోసం కాదు

ప్రేమగా పంచిన

ఆ చేతుల కోసం

తిరిగి రాని

అప్పటి మనుషుల కోసం!

వైష్ణవిశ్రీ

80742 10263

ఈ వార్తలూ చదవండి

కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..

ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

Updated Date - Nov 23 , 2026 | 01:38 AM