Share News

ఆకాశంలో సగానికి అవార్డుల్లో అన్యాయం!

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:12 AM

5/63 అంటే ఎంత? శాతాల్లో లెక్కవేసి చూస్తే 7.9 శాతం వస్తోంది. ఇవే గనుక మార్కులు అయివుంటే ‘‘మా కడుపున చెడబుట్టావు’’ కాటగిరీకి చెందుతాయి. ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అయివుంటే ‘‘డిపాజిట్ కోల్పోయే’’ లెక్కకి...

ఆకాశంలో సగానికి అవార్డుల్లో అన్యాయం!

5/63 అంటే ఎంత? శాతాల్లో లెక్కవేసి చూస్తే 7.9 శాతం వస్తోంది. ఇవే గనుక మార్కులు అయివుంటే ‘‘మా కడుపున చెడబుట్టావు’’ కాటగిరీకి చెందుతాయి. ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అయివుంటే ‘‘డిపాజిట్ కోల్పోయే’’ లెక్కకి చెందుతాయి. కానీ దురదృష్టవశాత్తూ, ఇది గత 70 ఏళ్ళలో భారతీయ సాహిత్యంలో తలమానికమైన అవార్డుల్లో ఒకటైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు రచయితల్లో మహిళల సంఖ్య.

ఒక రచయితను అంచనా కట్టడానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమే గీటురాయి కాదనేది వాస్తవమే. కానీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇతర గుర్తింపులు అరుదైన తెలుగు సాహిత్య వాతావరణంలో ఇది చాలా ముఖ్యమైన పురస్కారం. స్త్రీవాద సాహిత్యం, మహిళా చైతన్యం ఉవ్వెత్తున ఎగసి తెలుగు సాహిత్యాన్ని గత శతాబ్దంలోనే సుసంపన్నం చేసినా అకాడమీ గుర్తింపు మాత్రం ఐదంటే ఐదుగురే మహిళలు అందుకోవడం ఏమిటన్నది మనం వేసుకుని తీరాల్సిన ప్రశ్న.

కేంద్ర సాహిత్య అకాడమీని 1954లో భారత ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కలిగిన జాతీయ సాహిత్య సంస్థగా స్థాపించింది. ఏటా అకాడమీ బడ్జెట్‌లో ప్రధాన భాగం కేంద్ర సాంస్కృతిక శాఖ కేటాయింపుల నుంచి వస్తుంది. రకరకాల పనులు చేసినా సాహిత్యలోకంలో అకాడమీ పేరు తలచుకోగానే పురస్కారాలే గుర్తుకు వస్తాయి. తెలుగు సహా 24 భాషల్లో ప్రతీ ఏటా ఒక ‘ఉత్తమ రచన’కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. క్రమేపీ ఇతర పురస్కారాలను, గుర్తింపులను (సాహితీ సమ్మాన్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్, సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం, బాల సాహిత్య పురస్కారం, యువ సాహిత్య పురస్కారం) ఏర్పరిచి ఏటేటా ఇస్తున్నా, మెయిన్ అవార్డు అని సాహిత్యకారులు పిలుచుకునే ఈ పురస్కారానికి ఉన్న ఆకర్షణ వేరు.


1955 నుంచి గత ఏడు దశాబ్దాలుగా మొత్తం 63 మందికి తెలుగులో ఈ పురస్కారాలు ఇచ్చారు. మొదటి రెండున్నర దశాబ్దాలు మహిళలకు ఒక్క పురస్కారం కూడా దక్కలేదు. 1982లో ఇల్లిందల సరస్వతీదేవి ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళగా నిలిచారు. దశాబ్దాల పాటు సమాజంలో వచ్చిన మార్పులకు అద్దంపడుతూ ఆవిడ రాసిన వంద కథల సంపుటి ‘స్వర్ణకమలాలు’కు ఈ పురస్కారం ప్రకటించారు. మరో దశాబ్దం తర్వాత 1992లో మాలతీ చందూర్‌కు ‘హృదయనేత్రి’ నవలకుగాను అకాడమీ అవార్డు వచ్చింది. దశాబ్దాలపాటు ఆవిడ పేరు తెలుగునాట ఇంటింటా తెలుసు. ‘ప్రమదావనం’, ‘నన్ను అడగండి’, ‘పాత కెరటాలు’, ‘కొత్త కెరటాలు’ వంటి శీర్షికలు నిర్వహించడమే కాక నవలలు, కథలు రాశారు. మరో పుష్కరం గడిచాకా 2005లో అబ్బూరి ఛాయాదేవికి ‘తన మార్గం’ కథా సంకలనానికి పురస్కారం దక్కింది. కథా సాహిత్యంలో స్త్రీవాద దృక్పథాన్ని ప్రభావశీలంగా ఉపయోగించుకున్న ఛాయాదేవిని ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు స్త్రీవాద రచయితగా గుర్తించవచ్చు. 2013లో ‘సాహిత్యాకాశంలో సగం’ వ్యాస సంకలనానికి గాను కాత్యాయని విద్మహేకు అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో సాహిత్య విమర్శ, పరిశోధనల్లో కృషిచేసిన మహిళకు ఈ పురస్కారం లభించిన ఏకైక సందర్భం ఇదే. 2015లో ప్రముఖ స్త్రీవాద రచయితల్లో ఒకరైన ఓల్గాకు ‘విముక్త’ కథా సంకలనానికి గాను పురస్కారం లభించింది. కథలు, నవలలు, అనువాదాలు మొదలుకొని బహుముఖాల్లో ఆవిడ సాహిత్యకృషి కొనసాగింది. జాతీయస్థాయిలోనూ ఓల్గా రచనల అనువాదాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. 2005–15 మధ్యలో 3 పురస్కారాలు మహిళలకు లభించడంతో పరిస్థితి మెరుగుపడుతోందన్న సూచన కనిపించినా 2016–25 దశాబ్దంలో ఒక్క ఏడాదీ మహిళలు ఎంపిక కాకపోవడం వల్ల పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చినట్టు అయింది. సాహిత్య అకాడమీ తెలుగులో ఇచ్చే ఇతర పురస్కారాల్లోనూ ఈ ధోరణే కనిపిస్తుంది. బాల సాహిత్య పురస్కారానికి 16 మందిలో ఇద్దరు (12.5శాతం), యువ పురస్కారానికి 15 మందిలో ముగ్గురు (20శాతం), అనువాద పురస్కారానికి 36 మందిలో ఏడుగురు (19శాతం) మాత్రమే మహిళా సాహిత్యవేత్తలు ఎంపికయ్యారు.

బయటకు కనిపించే గణాంకాలను దాటి కాస్త లోతుగా పరిశీలిస్తే అకాడమీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో సైతం మహిళల పట్ల వ్యవస్థీకృత ఉదాసీనతే బయటపడుతోంది. 2018 నుంచి 2025 వరకూ ఎనిమిది సాహిత్య అకాడమీ పురస్కారాల షార్ట్‌లిస్టుల్లో 97 మంది రచయిత పేర్లు పరిగణనకు వస్తే అందులో మహిళలు పేర్లు పదే (8.25 శాతం). ప్రతీ ఏటా ముగ్గురు సాహిత్యవేత్తలను జ్యూరీలో సభ్యులుగా తీసుకుంటారు. షార్ట్‌లిస్ట్ నుంచి ఎవరికి పురస్కారం ఇవ్వాలనేది అకాడమీకి వారే సూచిస్తారు. 2013–2025 మధ్యలో 13 జ్యూరీల్లో 39 మంది సభ్యులు ఉంటే వారిలో నలుగురే (10 శాతం) మహిళలు. పైగా 13 సంవత్సరాల్లో పదేళ్ళు ఒక్క మహిళ కూడా లేకుండా జ్యూరీలు పూర్తిగా పురుషులతో నిండిపోయాయి.


తెలుగు సాహిత్య రంగంలో విస్తృతమైన, వైవిధ్యభరితమైన కృషిచేసిన మహిళలకు ఎందరికో ఈ పురస్కారం లభించలేదు. దశాబ్దాల క్రితమే మరణించిన తొలితరం వారి నుంచి హేమాహేమీలైన సమకాలీనుల దాకా ఎందరో అర్హులైన మహిళా రచయితలు ఉన్నా కనీసం కొందరి పేర్లు ప్రస్తావిస్తే ఈ లోటు ఎంత తీవ్రమైనదో, లోతైనదో తెలుస్తుందన్న ఉద్దేశంతో, వారు బాగా ప్రాచుర్యం చెందిన క్యాటగిరీల వారీగా కొన్ని పేర్లు ఇస్తున్నాను:

కథలు – ఆర్. వసుంధరాదేవి, కళ్యాణ సుందరీ జగన్నాథ్, భానుమతీ రామకృష్ణ, పి. సత్యవతి, పొత్తూరి విజయలక్ష్మి, సోమరాజు సుశీల, శివరాజు సుబ్బలక్ష్మి, ఎస్‌. జయ, నిడదవోలు మాలతి, బొమ్మ హేమాదేవి, గోగు శ్యామల, చాగంటి తులసి, కుప్పిలి పద్మ, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, శీలా సుభద్రాదేవి

నవలలు – బీనాదేవి (ఈ జంట రచయితల్లో భాగవతుల త్రిపుర సుందరమ్మ), తెన్నేటి లత, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కె. రామలక్ష్మి, యద్దన పూడి సులోచనారాణి, పి. శ్రీదేవి, వాసి రెడ్డి సీతాదేవి, సి. సుజాత, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, జలంధర.‍

కవిత్వం – జయప్రభ, కొండేపూడి నిర్మల, మహెజబీన్, రేవతీదేవి, ఇంద్రగంటి జానకీబాల, విమల, పాటిబండ్ల రజని, జూపాక సుభద్ర, అయినంపూడి శ్రీలక్ష్మి, అనిశెట్టి రజిత, చల్లపల్లి స్వరూపరాణి, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, గీతాంజలి...

సాహిత్య విమర్శ, పరిశోధన – నాయని కృష్ణకుమారి, ముదిగంటి సుజాతారెడ్డి, పి. యశోదారెడ్డి, సి. మృణాళిని, మైథిలీ అబ్బరాజు, జొన్నవాడ రాఘవమ్మ, ముక్తేవి భారతి, రావి ప్రేమలత, కొండపల్లి నీహారిణి, కె. మలయవాసిని

వీళ్ళే గాక అర్హులైనవారు ఇంకెందరో ఉన్నారు. ఎంత విలువైన కృషి పురస్కారానికి నోచుకోకుండా ఉండిపోయిందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. అకాడమీ పురస్కారాల నియమ నిబంధనలూ, సాంకేతికాంశాలు అర్హులైన మహిళా రచయితలకు పురస్కారం రాకుండా అడ్డుపడి వుంటుందని భావించడానికైనా వీల్లేనంత విస్తృతంగా ఈ జాబితా ఉంది. తెలుగు సాహిత్యంపై విస్మరించే వీల్లేని ముద్ర వేసిన తొలితరానికి చెందిన సుప్రసిద్ధ మహిళా రచయితల్లో పలువురు మరణించడంతో సాహిత్య అకాడమీ పురస్కారం వారిని అందుకోకుండా ఉండిపోయిందన్న లోటు అలానే ఉండి పోతుంది. పురస్కారం పొందిన రచనలు పలు భారతీయ భాషల్లోకి అకాడమీ అనువదింపజేసి ప్రచురించింది. ఎంతటి విలువైన సాహిత్యాన్ని తోటి భాషల వారు చదివే అవకాశం లేకపోయిందో చూస్తే ఈ పరిణామం వల్ల జరిగిన ఆపర్చునిటీ కాస్ట్ (అవకాశాల నష్టం) తెలుస్తుంది. అయితే, జీవించి ఉన్న దిగ్గజ మహిళా రచయితలకు, యాక్టివ్‌గా రచనలు చేస్తున్న ఇప్పటితరంవారినీ గుర్తించడం ద్వారా ముందడుగు వేయాలి.


అయితే, ఇదేదో తెలుగుకే పరిమితమైన సమస్య అనో, సాహిత్య అకాడమీకే పరిమితమైన అంశమనో అనుకోనక్కరలేదు. సూరజ్ జాకోబ్, విమల విశ్వనాథ్ చేసిన పరిశోధన ప్రకారం 2016 నాటికి అన్ని భాషలూ కలిపి 8.1 శాతం సాహిత్య అకాడమీ పురస్కారాలు మాత్రమే మహిళలకు లభించాయి. ఇంగ్లీష్‌ (25 శాతం), అస్సామీస్ (18 శాతం), సింధీ (13 శాతం), మలయాళం (11 శాతం) వంటి భాషలు కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. జ్ఞానపీఠ్ పురస్కారం (13 శాతం) కూడా మహిళల ప్రాతినిధ్యంలో వెనుకబడే ఉండడం ఇది విస్త్రతమైన వ్యవస్థాగత లోపం అనే గుర్తుచేస్తుంది. అయితే, సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డుల్లో తెలుగు శాతం వీటన్నిటికన్నా కూడా తక్కువగా ఉండడం గమనార్హం. తెలుగు సాహిత్యకారుల్లో అర్హులైన మహిళలు ఈనాటికీ ఎందరో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో అయినా ఈ అనౌచిత్యం సరి అవుతుందనీ, దాని కోసం నియమ నిబంధనల్లోనూ, స్ఫూర్తిలోనూ కూడా తగిన సంస్కరణలు చేస్తారని ఆశిద్దాం.

సూరంపూడి పవన్‌ సంతోష్‌

96406 56411

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 02:12 AM