Share News

తలసేమియా బాధితులలో భరోసా నింపుదాం!

ABN , Publish Date - May 09 , 2026 | 01:30 AM

ప్రాణాంతక మహమ్మారి తలసేమియాతో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ ట్రస్టు కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. మే 10న హైదరాబాద్‌లోని జలవిహార్, నెక్లెస్ రోడ్...

తలసేమియా బాధితులలో భరోసా నింపుదాం!

ప్రాణాంతక మహమ్మారి తలసేమియాతో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ ట్రస్టు కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. మే 10న హైదరాబాద్‌లోని జలవిహార్, నెక్లెస్ రోడ్ వద్ద 3కె, 5కె, 10కె రన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ట్రస్టు స్థాపించిన నాటి నుంచి సామాజిక బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నా, తలసేమియా బాధితుల కోసం చేసే పోరాటం మాకు అత్యంత ప్రాధాన్యమైనది. వ్యాధి బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. హైదరాబాద్ నగరవాసులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్దయెత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రక్తదానం ప్రాణదానంతో సమానం, ఆ దిశగా ప్రజలను చైతన్యపరచడమే మా లక్ష్యం. తలసేమియా బాధితులకు అండగా నిలవడానికి అవసరమైన వనరులను సమకూర్చడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశ్యం. తలసేమియా విముక్త సమాజం కోసం, సామాజిక స్పృహను పెంపొందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పరుగు శారీరక దృఢత్వం కోసం కాదు. ఇది ఒక ఆశయం కోసం చేసే పరుగు.

తలసేమియా అంటే ఒక జన్యుపరమైన రక్త రుగ్మత. ఈ వ్యాధి ఉన్న వారిలో హిమోగ్లోబిన్ సరిగా ఉత్పత్తి కాదు. దీనివల్ల వారు నెలకు రెండుసార్లు రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక ఆశాదీపంలా నిలుస్తోంది. ఉచిత రక్తనిధి ద్వారా వందలాది చిన్నారులకు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ఈ రన్ లక్ష్యం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం, నిధుల సేకరణ, బాధితుల చికిత్స కోసం కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చడం, రక్త దానం పట్ల యువతను చైతన్యపరచడం.


తలసేమియా చికిత్సకు అయ్యే ఖర్చు సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారం. అంతకంటే ముఖ్యంగా సరైన సమయంలో రక్తం లభించక ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వంటి సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా ఉచితంగా రక్త మార్పిడి సేవలు అందిస్తున్నా, ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాలంటే సామాజిక చైతన్యం అవసరం. ఒకరి రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడితే, ఒకరి పరుగు వంద మందిలో అవగాహన పెంచుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే కేవలం టిక్కెట్ కొనడం కాదు. ఒక చిన్నారి కళ్ళల్లో వెలుగులు నింపే బాధ్యత. ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల వారు కలిసి నడిచినప్పుడే ఈ సమస్య తీవ్రత అందరికీ అర్థమవుతుంది. కేవలం హైదరాబాద్ వంటి నగర ప్రాంతాలకే పరిమితం కాకుండా, ఈ సందేశం మారుమూల గ్రామాలకు కూడా చేరాలి.

మే 8, 9 తేదీలలో బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నాం. పాల్గొనేవారు ఇక్కడ తమ రన్ కిట్స్ తీసుకోవచ్చు, ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 10కె రన్‌ బహుమతులు 3 వయస్సు విభాగాల (పురుషులు, మహిళలు)లో ఉంటాయి. 18 నుంచి 34 సంవత్సరాలు, 35 నుంచి 49 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైబడిన వారు. మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000, మూడో బహుమతి రూ.8,000.

సేవా స్పూర్తితో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా 25 బెడ్స్‌తో తలసేమియా కేర్ సెంటర్‌లను నిర్వహిస్తోంది. రక్తం కోసం ఎదురుచూసే తలసేమియా బాధితులు వారి తల్లిదండ్రుల కన్నీళ్లను తుడిచిన విశ్వసనీయ కేంద్రం ఎన్టీఆర్ ట్రస్ట్. కుల మతాలకు, ధనిక, పేదరికాలకు అతీతంగా ఉచితంగా రక్తం, ఫిల్టర్స్, మందులను అందిస్తోంది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్ని బ్లడ్ సెంటర్ల ద్వారా మొత్తం 23,706 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించింది. ఈ ట్రస్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ISO 9000–2015–సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తోంది. హెచ్‌ఐవి, హెపటైటిస్ బీ, సీ, మలేరియా వంటి వ్యాధుల కోసం స్క్రీనింగ్ చేస్తుంది.


తలసేమియా బారిన పడిన ఒక బిడ్డకు ఏడాదికి అయ్యే ఖర్చు వివరాలు... రక్త యూనిట్ల ధర రూ.51,000; ల్యూకో ఫిల్టర్ ఖర్చు రూ.26,000; మందులు రూ.84,000; విటమిన్ సప్లిమెంట్లు రూ.20,000; వైద్య పరీక్ష ఖర్చు రూ.32,000; ఇతర (రవాణా, ఆహారం మొదలైనవి) ఖర్చులు రూ.37,000 వెరసి... సంవత్సరానికి రూ.2,50,000 అవుతుంది. ప్రతి తలసేమియా రోగికి సంవత్సరానికి 17సార్లు రక్త మార్పిడి చేయాలి. ఈ పరిస్థితిని అధిగమించడానికి సాధారణ ప్రజలలో అవగాహన పెంచడం తప్పనిసరి. కావున యువత వేసే ప్రతి అడుగు, ఒక బిడ్డ గుండె చప్పుడును ఆపకుండా కాపాడుతుంది. పరుగులో పాల్గొనడమే కాకుండా, రక్తదానం చేయండి. మీ రక్తం ఒక ప్రాణానికి ప్రాణవాయువు అవుతుంది. మే 10న జరిగే 10కె రన్ పరుగులో భాగస్వాములై, మానవత్వాన్ని చాటుదాం. తలసేమియా బారిన పడిన చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు చేయి చేయి కలుపుదాం.

నారా భువనేశ్వరి

మేనేజింగ్ ట్రస్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్‌

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 01:30 AM