సామాజిక న్యాయం.. సంక్షేమ రాజ్యం
ABN , Publish Date - May 27 , 2026 | 12:55 AM
నందమూరి తారక రామారావు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజాహితమే... అదో సంచలనం. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ప్రజానాయకుడిగా ఆయన దేశ చరిత్రలో...
నందమూరి తారక రామారావు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజాహితమే... అదో సంచలనం. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ప్రజానాయకుడిగా ఆయన దేశ చరిత్రలో నిలిచిపోయారు. మే 28 అనేది కేవలం ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రమే కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవం మేల్కొన్న రోజు. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు ఒక సాధారణ పార్టీ సమావేశం మాత్రమే కాదు. ఇది కార్యకర్తల ఆత్మీయ కలయిక. పసుపు జెండా వెనుక ఉన్న కోటిమంది ఆశయాల ప్రతిధ్వని. పార్టీ సిద్ధాంతాలపై చర్చలు, రాష్ట్ర రాజకీయాలపై ఇక్కడ అనేక తీర్మానాలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది మహానాడులో పశ్చిమాసియా యుద్ధం కారణంగా నెలకొన్న ద్రవ్యోల్బణం, తెలంగాణలో పార్టీ బలోపేతం, సూపర్ సిక్స్ తదితర పథకాలపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ, కార్యకర్తలకు దిశానిర్దేశం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ప్రకటిస్తారు. మనవడు లోకేష్ తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుండడంతో ఈ మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అభివృద్ధి, అమరావతి, పోలవరం నిర్మాణం, యువతకు ఉపాధి, సంక్షేమం, సమతుల్యత, పార్టీ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. లోకేష్ చొరవతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. దీనిపై మహానాడులో విస్తృత చర్చ జరగనుంది. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు ఆన్‌లైన్‌కే పరిమితమైంది. గతంలో కోవిడ్ కారణంగా రెండుసార్లు ఈ తరహాలోనే నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రభంజనంలా మొదలైన తెలుగుదేశం పార్టీ పాలన ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఢీకొని ఢిల్లీ పీఠాన్ని కుదిపేసింది. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ.. నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అభివృద్ధి దిశగా విస్తరించింది. ఇప్పుడు యువనేత నారా లోకేష్ కొత్తతరం నాయకత్వంతో మరింత ఆధునిక దిశగా అడుగులు వేస్తోంది. సమకాలీన సవాళ్లకు సమాధానాలు అందించే బలమైన శక్తిగా రూపాంతరం చెందుతోంది. మూడు తరాల కాలక్రమంలోనూ ఒకే ఆశయం, ఒకే లక్ష్యంతో వెలుగుదేశంగా విరాజిల్లుతోంది. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి చరిత్రను తిరగరాసింది. 24 ఏళ్ళు అధికారపక్షంలో, 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. ఏ పక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసింది. కేంద్రంలో కనీసం ఆరు ప్రభుత్వాలు ఏర్పడటానికి, మనగలగడానికి కారణం అయింది. ఒక ప్రాంతీయ పార్టీని పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన ఘనత కూడా తెలుగుదేశానిదే.
జాతీయ పార్టీలలో లేని సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావహమైన ధృక్పథం, రాజకీయ పరిణితి తెలుగుదేశంలో ఉన్నాయి. అందుకే దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం విధానాలను, పథకాలను అనుకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో నాయకులకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పింది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులను తయారు చేసే పాఠశాల. కొంగొత్త రాజకీయ ఆవిష్కరణలకు, నూతన సంస్కరణలకు ప్రయోగశాలగా మారింది. తెలుగు గడ్డపై కులమతాలకు అతీతంగా, పేదవాడి సంక్షేమం నుంచి ఆధునిక సాంకేతిక శిఖరాల వరకు తెలుగుదేశం వెలుగు ప్రస్థానం అద్భుతం. ఎన్టీఆర్ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే మూల సిద్ధాంతంతో ప్రారంభించిన తెలుగుదేశం ప్రయాణం.. నాలుగున్నర దశాబ్దాల తర్వాత కూడా తెలుగు రాజకీయాల్లో ఒక ధృవతారగా వెలుగుతూనే ఉంది. తెలుగుదేశం కేవలం రాజకీయ పార్టీ కాదు.. ఒక ప్రజా విశ్వాసం. రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళల నుంచి వృద్ధుల వరకు ప్రతి వర్గానికీ చేరువై తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. బడుగు, బలహీనవర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించింది. వారిని చట్టసభలకు పంపి రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవం తెచ్చింది.
ఎన్టీఆర్ వేసిన పునాదిపై చంద్రబాబు అభివృద్ధి అనే మహాసౌధాన్ని నిర్మించారు. తన దార్శనికతతో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టారు. తెలుగుదేశంలో మూడోతరం నాయకత్వం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టగలడన్న నమ్మకాన్ని నారా లోకేష్ కలిగించారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు తండ్రి బాటలో పయనిస్తున్నారు. తాత, తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని తనదైన శైలిలో దూసుకుపోతూ తెలుగుదేశానికి ఆశాకిరణంలా మారారు. పార్టీలో కోటిమంది సభ్యులను చేర్చి వారికి బీమా సౌకర్యం కల్పించారు. వినూత్న కార్యక్రమాలతో కార్యకర్తలకు చేరువయ్యారు. యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పి వెలుగు నింపింది.
తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, సంక్షోభాలు, కుట్రలు తట్టుకుని సమున్నతంగా నిలబడింది. సంక్షోభం ఎదురైనప్పుడల్లా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు చేరువయ్యారే తప్ప ఎక్కడా అదరలేదు, బెదరలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, అభివృద్ధి లక్ష్యాన్ని మరువకుండా ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలను కొనసాగిస్తూనే ఉంది. ప్రజలతో మమేకమై అజేయమైన శక్తిగా ఎదుగుతూనే ఉంది.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ