Share News

కేంద్ర పరీక్షల సంక్షోభం: బాధ్యులు ఎవరు?

ABN , Publish Date - May 26 , 2026 | 03:05 AM

ఒకప్పుడు పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా రాజకీయ బాధ్యతను స్వీకరించి, పదవికి రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కమిటీలు...

కేంద్ర పరీక్షల సంక్షోభం: బాధ్యులు ఎవరు?

ఒకప్పుడు పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా రాజకీయ బాధ్యతను స్వీకరించి, పదవికి రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కమిటీలు, విచారణలు, వివరణలకే పరిమితమవుతున్నారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు; జవాబుదారీతనం అనే ప్రజాస్వామ్య విలువ క్షీణిస్తున్న సంకేతం.

ఎన్‌టీఏ వంటి జాతీయ పరీక్షా సంస్థల వైఫల్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి మరింత ఆందోళనకరం. ఏ శాఖలో అవినీతి, అక్రమం, నిర్లక్ష్యం జరిగిందని తేలినా, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం, పూర్తిస్థాయి స్వతంత్ర విచారణ జరపడం, అవసరమైతే పదవీ బాధ్యతల నుంచి తొలగించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య పాలనలో కనీస ప్రమాణాలు కావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సందర్భాల్లో బాధ్యులపై చర్యలకు వెనుకంజ వేస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్‌టీఏ వివాదాల సందర్భంలోనూ విద్యా మంత్రిత్వశాఖ నైతిక బాధ్యత వహించాలన్న డిమాండ్లు వస్తున్నా, వాటిని నిర్లక్ష్యం చేయడం కనిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రధానమంత్రి స్థాయిలో పరిపాలనా జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గత ఐదేళ్లలో పరీక్షా ఫీజుల ద్వారా ఎన్‌టీఏకు వందల కోట్ల రూపాయల మిగులు నిధులు సమకూరినా, పరీక్షా భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయడంలో ఎందుకు వైఫల్యం చోటుచేసుకుందన్న ప్రశ్నకు సమాధానం రావాలి. లక్షలాది మంది విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేసి, పరీక్ష రద్దు తర్వాత ఫీజు రీఫండ్ ప్రకటించడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. విద్యార్థులు కోల్పోయిన సమయం, మానసిక వేదన, ప్రయాణ వ్యయాలు, విద్యా ప్రణాళికల అంతరాయానికి ఎవరు జవాబుదారీ?

కేంద్ర ప్రవేశ పరీక్షలు సమాన అవకాశాల పేరుతో ముందుకు వచ్చినా, వాస్తవంలో అవి ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతున్నాయి. కోటా, ఢిల్లీ వంటి ఉత్తర భారత కోచింగ్ కేంద్రాల ఆధిపత్యం దేశవ్యాప్తంగా విస్తరిస్తుండగా, హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల్లో కూడా అదే నమూనా బలపడుతోంది. డమ్మీ స్కూల్స్, కార్పొరేట్ కోచింగ్ సంస్కృతి పరీక్షలను విద్యా హక్కు నుంచి వ్యాపార మోడల్‌గా మార్చేశాయి. అదనపు క్రాష్ కోర్సులు, పునఃసిద్ధత ప్యాకేజీలు, ప్రత్యేక పరీక్షా బ్యాచ్‌లు ఆర్థికంగా బలమైన వర్గాలకు మరో అవకాశం కల్పిస్తే... పేద, గ్రామీణ విద్యార్థులపై మాత్రం అదనపు మానసిక–ఆర్థిక భారం మోపుతున్నాయి.


నీట్ వంటి పరీక్షా వ్యవస్థలు ఉత్తర భారత విద్యా నమూనాను మొత్తం దేశంపై రుద్దుతున్నాయనే విమర్శకు బలం పెరుగుతోంది. ఉత్తర భారతీయ సామాజిక–విద్యా నిర్మాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కోచింగ్ సంస్కృతి, పరీక్షా నమూనాలు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులపై సమానంగా అమలవుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల విద్యా చరిత్ర, బోధనా విధానాలు, రాష్ట్ర బోర్డు నిర్మాణాలు, స్థానిక భాషా ఆధారిత విద్యా వ్యవస్థలు ఈ కేంద్రీకృత నమూనాలో నష్టపోతున్నాయి. ఇది క్రమంగా విద్యా రంగంలో ఒక ఆధిపత్య నిర్మాణాన్ని బలపరుస్తోంది. ఈ ప్రభావం కేవలం నీట్ లేదా జేఈఈ వరకే పరిమితం కాదు; సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్లు, ఇతర ఆల్ ఇండియా ప్రవేశ వ్యవస్థల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెడికల్ సీట్లు కోట్ల రూపాయలు కుమ్మరించి సాధించుకునే వాణిజ్య సంస్కృతి పూర్తిగా అంతరించిపోలేదు. అలాంటి నేపథ్యంలో పేపర్ లీకులు, పరీక్షా అక్రమాలు చోటుచేసుకోవడం యాదృచ్ఛికంగా తీసుకోలేం. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత బలహీనపడితే ప్రతిభావంతులైన పేద విద్యార్థుల అవకాశాలే మొదట దెబ్బతింటాయి. ఇప్పుడిప్పుడే ఆ అవకాశాలను పొందే బడుగులకు ఇంకా నష్టం. దక్షిణాది రాష్ట్రాలు విద్యా ప్రమాణాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. అలాంటి రాష్ట్రాలకు తమ అవసరాలకు తగ్గట్టు ప్రవేశ పరీక్షలను నిర్వహించుకునే స్వయంప్రతిపత్తి ఉండాలి. అదే సమయంలో పాత డొనేషన్ ఆధారిత అవినీతి వ్యవస్థలకు తిరిగి వెళ్లకుండా పారదర్శకమైన ప్రత్యామ్నాయ నమూనాలను రూపొందించాలి.

తెలుగు రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంసెట్‌లో లీకుల సమస్యలను ఎదుర్కొన్న తర్వాత బహుళ ప్రశ్నపత్రాలు, లాటరీ ఆధారిత ఎంపిక వంటి పారదర్శక సంస్కరణలతో వ్యవస్థను బలోపేతం చేశారు. అలాంటి అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచాలి. పేపర్ లీకులపై కఠిన చట్టం, స్వతంత్ర జాతీయ విద్యా ఆడిట్, డిజిటల్ భద్రతా ప్రమాణాల బలోపేతం, ఎన్‌టీఏ పనితీరుపై పార్లమెంటరీ సమీక్ష, బాధ్యులపై కఠిన చర్యలు అత్యవసరం.

పాపని నాగరాజు

సత్యశోధక మహాసభ

ఈ వార్తలనూ చదవండి:

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్

Updated Date - May 26 , 2026 | 03:05 AM