Children Book Reading: నిత్య సంక్రాంతి.. పుస్తక పఠనం
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:20 AM
వ్యక్తిత్వ వికాసంపై పదాలు, చిత్రాలు మిళితమైన పద్యాలు; కొండంత ఆకారం గల జంతువులతో మైథిలి అనే బాలిక సాహసాలు, అనుభవాల గురించిన వర్ణశోభిత బొమ్మల పుస్తకం; లోకాలకు...
వ్యక్తిత్వ వికాసంపై పదాలు, చిత్రాలు మిళితమైన పద్యాలు; కొండంత ఆకారం గల జంతువులతో మైథిలి అనే బాలిక సాహసాలు, అనుభవాల గురించిన వర్ణశోభిత బొమ్మల పుస్తకం; లోకాలకు వెలుగునిచ్చే ఆదిత్యుడిని ఒక యువతిగా చిత్రించిన ఈశాన్యభారత జానపద గాథ, సువిశాల భారతావనిని సస్యశ్యామలం చేస్తోన్న మన నదుల (కొండ నుంచి కడలి దాకా) ప్రస్థాన శోభను కల్పిత గాథలు, బొమ్మల ద్వారా కళ్లకు కట్టించిన కథనాలు, ఆధునిక భారతదేశ చిత్రకారుడు ఒకరిని పరిచయం చేసిన రమణీయ పుస్తకం సహా ఎన్నో పుస్తకాలు... దేశ రాజధానిలో కొనసాగుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనలోకి మిమ్ములను స్వాగతిస్తున్నాయి. మరి మీరు మీ పిల్లల జీవితాలలో ఆ జ్ఞానకుసుమాలు పరిమళించేందుకై వాటిని స్వాగతిస్తున్నారా? మీ మీ నగరాలు, పట్టణాలలో పుస్తక ప్రదర్శనలు జరిగినప్పుడు మీ పిల్లలను తప్పక వాటికి తీసుకువెళ్లాలి. ఎందుకు తీసుకువెళ్లాలో వివరిస్తాను.
తండ్రి సందిటా, తల్లి కౌగిటా ఉండటమే బాలలకు సరిపోదు. తల్లీ, తండ్రి నీడలోనే అంటే తమ గృహంలోనే తమకొక సొంత ప్రదేశాన్ని వారు కోరుకుంటారు. ఆ ప్రదేశమేమిటో వారు తమకు తామే ఎంచుకుంటారు. బాలల పుస్తకాలకు కూడా అలాగే సొంత గౌరవనీయమైన ప్రదేశాల అవసరం ఎంతైనా ఉన్నది. అంకితభావంతో వాటిని చూడాలి, సంరక్షించాలి. బాలలకు సదా అందుబాటులో ఉండేలా చేయడమనేది మరీ మరీ ముఖ్యం. అప్పుడే వాటి విషయమై పిల్లల్లో శ్రద్ధాసక్తులు జనిస్తాయి. ఇంటిలో ఎదురుగుండా ఉండే అన్ని వస్తువుల కంటే కూడా పుస్తకాలు చాలా విలువైనవి. అవును, అవి విలువైనవనే భావాన్ని బాలల మనసుల్లో పాదుకొల్పడం మరీ ముఖ్యం.
ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న మీరు చిన్న వయసులో పంచతంత్ర కథలు, అమర్ చిత్రకథలు చదివివుంటారు. అయితే ఇప్పుడు మీరు మీ పిల్లలు పాఠశాలల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు తోడ్పడే విద్యా సంబంధిత పుస్తకాలను మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. మరి మీ పిల్లల మనోవికాసం ఏమయ్యేట్టు? వారి ఊహా వైచిత్రి వింత సోయగాలు ఎలా పోతుంది? ఆలోచనా రీతులు జీవిత పురోగమన అవరోధాలను అధిగమించేలా ఎలా పదునెక్కుతాయి? బాలల కోసం ప్రత్యేకంగా రాసిన, రూపొందించిన పుస్తకాలను మీరు తప్పకుండా మీ పిల్లలకు అందించాలి. నెలనెలా పుస్తక దుకాణాలకు వెళ్లకపోయినా ఏడాదికొకసారి, అలాగే ఏవైనా ప్రత్యేక సందర్భాలలో జరిగే పుస్తక ప్రదర్శనలకు వెళ్లండి. మీ పిల్ల్లల పఠనాసక్తులను పెంపొందించే పుస్తకాలను కొనండి. మీ చిన్నారులకు ఇవ్వండి. వీడియోలు, రీల్స్ వీక్షణే ప్రధానమైన పిల్లల జీవితాల్లో పుస్తకాలను ప్రవేశపెట్టండి. అవి వారి మనో ప్రపంచంలో కొత్త కాంతులు ప్రసరిస్తాయి. వెలుగులను విరజిమ్మే ఆలోచనలను రేకెత్తిస్తాయి.
అవును, మీరు పుస్తక ప్రదర్శనలకు తప్పక వెళ్లాలి. మీతో పాటు మీ పిల్లలనూ తప్పక తీసుకువెళ్లాలి. వారిని మన సువిశాల ఉపఖండ చరిత్ర, అందమైన కల్పనా గాథలు, అనంత వైవిధ్యంతో అలరారుతున్న, నడయాడుతున్న జన జీవితాలతో అనుసంధానించేందుకు అదొక ఉత్తమ మార్గం. ఆ చారిత్రక నేపథ్యం తోనూ, ఆ కథలను పలవరిస్తూనూ వారు పెరుగుతారు. భారతావని అనంత జీవన వైవిధ్యంలో తమ సొంత రీతిలో వెలుగొందడానికి వారు సంసిద్ధమయ్యేందుకు ఆ సాంస్కృతిక మూలాలతో వారిని చిన్న వయసులోనే కలపాలి. కలిపి తీరాలి.
కృత్రిమ మేధతో సహజీవనం చేస్తున్న బాలల్లో జిజ్ఞాసను రేకెత్తించేందుకు, సృజనశీలతను వికసింప చేసేందుకు మీరు మీ పిల్లలను పుస్తక ప్రదర్శనలకు తీసుకు వెళ్లాలి. వారికి పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి. ఇంతకు మించిన మంచి అలవాటు ఏముంటుంది? మరింత స్పష్టంగా చెప్పాలంటే భారతీయ బాలలకు, ముఖ్యంగా ఏదైనా ఒక భారతీయ భాషలో రాసిన భారతీయ పుస్తకాల కోసం మీరు పుస్తక ప్రదర్శనలకు వెళ్లాలి. శుభస్య శీఘ్రం. బాలల కోసం రాసిన అద్భుత పుస్తకాలు మీకు లభ్యమవుతాయి. భారతీయ బాల సాహిత్యం ఇప్పుడు పురుజ్జీవన శుభ కాలంలో ఉన్నది. ఈ చైతన్యశీల వికాసం ఆంగ్లంలో రాసిన పుస్తకాలతో ప్రారంభమయింది. ఈ నవ జాగృతి సంప్రదాయ పురాణాలు, బోధనా కథలను దాటి ఒక శక్తిమంతమైన, సమకాలీన దృశ్యానికి చేరుకుంటోంది. ఆధునిక వాస్తవాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. సమస్యలను విడమరిచి చెబుతోంది. తరతరాల మౌఖిక కథల చరిత్ర, నైతికత, జ్ఞానాన్ని నొక్కి చెప్పడంలోనూ ఈ సాహిత్య జాగృతి కొత్త దారులు తొక్కుతోంది. సమకాలీన ఆలోచనలతో వారసత్వాన్ని మిళితం చేసే శక్తిమంతమైన సాంస్కృతిక మార్పును ప్రతిబింబిస్తోంది.
హిందీ భాషలో ప్రచురితమైన పుస్తకాలను చూసిన తరువాత ఇతర భారతీయ భాషలలోనూ ఇటువంటి పుస్తకాలు, వీటికి మించిన పుస్తకాలు ఉంటాయనే భావన, కాదు, విశ్వాసం కలిగింది. బాల సాహిత్య రచయితలకు, బొమ్మల సృజనకారులకు, ప్రచురణకర్తలకు, మరీ ముఖ్యంగా పాఠకులకు ఇదొక ఉత్తేజకర కాలం. ఇది, బాల సాహిత్యానికి బంగారు కాలం, సందేహం లేదు.
బాల సాహిత్య ఉత్తమ కృతులను ‘Parag Honour List’ ద్వారా తెలుసుకోవచ్చు. టాటా ట్రస్ట్ వారి చొరవతో ఇది రూపొందింది. ఇంగ్లీష్, హిందీ భాషలలో బాల, యువ పాఠకులను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ శైలిలో రాసిన, సాంస్కృతిక సంబంధిత విషయాలపై రాసిన పుస్తకాలు మాత్రమే ఈ జాబితాలో ఉంటాయి. గత ఐదు సంవత్సరాలుగా టాటా ట్రస్ట్ పరాగ్ ఆనర్ లిస్ట్‌ను ప్రకటిస్తోంది. గమనార్హమైన విషయమేమిటంటే ఆ పుస్తకాలను ట్రస్ట్ సొంతంగా ప్రచురించదు. కనుక ఇతర ప్రచురణకర్తలతో పోటీ పడే ప్రసక్తి లేదు. బాల సాహిత్య ఉత్తమ పుస్తకాలను ప్రఖ్యాత రచయితలు, చిత్రకారులు ఎంపిక చేస్తారు. 2025 సంవత్సరపు జాబితాలోను, గత ఐదు సంవత్సరాల జాబితాలలో ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌లో ‘http://www.paragreads.in.@’కు వెళ్లండి. ఇంతవరకు ఈ జాబితాలలో మొత్తం 286 పుస్తకాలు ఉన్నాయి. భిన్న వయస్కులు అయిన బాలలకు పఠనయోగ్యమైన పుస్తకాలుగా వాటిని వర్గీకరించారు. ఆ పుస్తకాలను మొత్తం 24 వేర్వేరు సంస్థలు ప్రచురించాయి. పుస్తక ప్రదర్శనలలో అవి సులభంగా అందుబాటులో ఉన్నాయి.
చాలా ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన భారతీయ బాల సాహిత్య పుస్తకాలు ఆంగ్లంలో ప్రచురితమయ్యాయి. అయితే ఒక వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. సుప్రసిద్ధ రచయిత్రి–చిత్రకారుడు ద్వయం– జూలియా డోనాల్డ్ సన్, ఆక్సెల్ షెఫ్లర్ చమత్కారమైన కథ, చిరస్మరణీయమైన పాత్రలతో సృజించిన ‘ది గ్రఫలో’ లాంటి పుస్తకాలు ఇంకా మన బాల సాహిత్య రచయితల నుంచి వెలువడడం లేదు. అయితే రచయిత సి.జి. సాలమాండర్, చిత్రకారుడు రాజీవ్ ఈప్ సృష్టించిన ‘అసునం: సంగీతాన్ని ఇష్టపడే మృగం’ అనే పిల్లల చిత్ర పుస్తకాలు పైన పేర్కొన్న ‘ది గ్రఫలో’ స్థాయిని క్రమంగా అందుకుంటున్నాయని చెప్పవచ్చు.
ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే మీరు మీ పిల్లను పుస్తక ప్రదర్శనలకు తప్పక తీసుకువెళ్లాలనే ఆశంసతోనే.. పుస్తక పఠనంతోనే చిన్నారి బాలల ఊహా వైచిత్రి వికసిస్తుందనే సత్యాన్ని తల్లిదండ్రులు మరువకూడదు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..