నిశ్శబ్దం రాస్తున్న అసంపూర్ణ కావ్యం!
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:12 AM
నిశ్శబ్దం ఒక రంగును పులుముకుంది అది నలుపు కాదు.. అలాగని వెలుగు కాదు! నేల రాలిన జ్ఞాపకం వేర్ల కింద దాక్కున్న తడిని వెతుక్కుంటోంది..
నిశ్శబ్దం రాస్తున్న అసంపూర్ణ కావ్యం!
నిశ్శబ్దం ఒక రంగును పులుముకుంది
అది నలుపు కాదు.. అలాగని వెలుగు కాదు!
నేల రాలిన జ్ఞాపకం
వేర్ల కింద దాక్కున్న తడిని వెతుక్కుంటోంది..
గడియారం ముల్లు ఆగిపోయిన చోట
కాలం తన చొక్కా విప్పి ఆరేసుకుంటోంది.
గాలికి ఆకారం లేదు..
కానీ, అది తాకిన చోటల్లా
ఓ పాత గాయం కొత్తగా చిగురిస్తోంది!
కనురెప్పల వెనుక ఒక సముద్రం..
అందులో అలలు లేవు, కేవలం లోతు మాత్రమే.
ప్రశ్న అడగకముందే సమాధానం మరణించింది,
ఇప్పుడు మిగిలింది కేవలం..
నిశ్శబ్దం రాస్తున్న అసంపూర్ణ కావ్యం!
గది మూలన నిలబడ్డ నీడ
గోడను గీరుతోంది..
అది నీ జ్ఞాపకమా? లేక నన్ను
నేను మరిచిన నిశ్శబ్దమా?
దూరానికి ఒక వాసన ఉంటుంది
పాత పుస్తకాల్లో ఎండిపోయిన పువ్వులా..
నువ్వు వెళ్ళిపోయిన దారిలో
నేల ఇప్పుడు తనని తాను భుజిస్తోంది.
కిటికీ అద్దం మీద వర్షం బొట్లు కాదు..
కాలం కరిగి కారుతున్న విషం!
గాలి నిండా నీ శ్వాస అక్షరాలు..
కానీ, చదవడానికి నా దగ్గర చూపు లేదు.
ఒక శూన్యం వచ్చి ఒళ్ళో కూర్చుంది
హృదయం గూటిలో ఒక పక్షి
రెక్కలు విరిచేసుకుని ఎగరడం నేర్చుకుంటోంది..
ఈ రాత్రికి అంతం లేదు,
కేవలం సగమే మిగిలిన నేను తప్ప!
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
80085 77834
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి