Share News

నిమ్మకాయల అవ్వ

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:37 AM

రంగస్థల పద్యాలలా ఆర్టీసీ బస్టాండ్ లోంచి బస్సులు బయటికొస్తుంటాయి; రోడ్డు పక్కన మైలురాయి...

నిమ్మకాయల అవ్వ

నిమ్మకాయల అవ్వ

రంగస్థల పద్యాలలా

ఆర్టీసీ బస్టాండ్ లోంచి

బస్సులు బయటికొస్తుంటాయి;

రోడ్డు పక్కన మైలురాయి... చింతచెట్టు నీడన

బుట్టిగంపలో ఆకుపచ్చ సూర్యుళ్లు!

నలభైఏళ్లకు పైగా అదే తావు.

అప్పుడు... చారాణకు నాలుగు

ఇప్పుడు... ఇరువై రూపాయలకు మూడు!

వయసు ఉడుగుతున్నది... కాలం తీరు మారుతున్నది

కానీ, బతుకు దెరువు మాత్రం మారలేదు!

సరిహద్దుల్లో సైనికుడిలా

రెప్ప వాల్చకుండా బరిగీసిన బతుకు యుద్ధం;

మనిషి మనిషిని ఆత్మీయంగా పలుకరిస్తూ—

‘‘తిన్నవా నాయనా... బాగున్నావా బిడ్డా’’ అంటూ

నిమ్మ పులుపులా నోరంతా ఊరే పలకరింపు!

అవ్వకు నీడ నిచ్చిన చెట్టును

రోడ్ల విస్తరణ బలితీసుకుంది

వానొస్తే గోనెసంచే కొప్పెరై నిలబడుతుంది

ఎండలు బండల్ని పగిల్చినా... ఛత్రి లేకుండానే శ్రమిస్తుంది

చుట్టూ అన్నీ మారినా—

తాను మాత్రం ఆ గజం చోటును విడువలేదు!

మసకబారిన కళ్లల్లో...

తాజా నిమ్మకాయల ఆకుపచ్చ, పసుపు రంగుల కాంతి!

దిష్టికీ, మంత్రతంత్రాలకూ ఒక సంచిలో...

తొక్కులకూ, పచ్చళ్లకూ మరో బుట్టలో...

నిగనిగలాడే నిమ్మపండ్లు చూడగానే మనసు లాగుతుంది!

‘‘ఎప్పుడూ వస్తుంటావు బిడ్డా’’ అంటూ...

ప్రేమతో ఒకటో రెండో ఎక్కువే ఇస్తుంది!

వనపట్ల సుబ్బయ్య

94927 65358

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 01:37 AM