Share News

చిత్తూరులో మరో వర్సిటీ... ‘ద్రావిడ’ సంగతేమిటి?

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:25 AM

చిత్తూరు జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌బాబు ఇచ్చిన హామీ, ఇప్పుడు అధికారిక చర్యగా రూపుదిద్దుకుంటున్నది. ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మే 30, 2026న...

చిత్తూరులో మరో వర్సిటీ... ‘ద్రావిడ’ సంగతేమిటి?

చిత్తూరు జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌బాబు ఇచ్చిన హామీ, ఇప్పుడు అధికారిక చర్యగా రూపుదిద్దుకుంటున్నది. ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మే 30, 2026న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కూడా సభ్యుడిగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఉన్న ఏకైక విశ్వవిద్యాలయానికి అధిపతి, మరొక విశ్వవిద్యాలయం రావాలా? వద్దా? అని నిర్ణయించే కమిటీలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క వాస్తవమే ఈ సమస్యకు ఉన్న సంక్లిష్టతను చెప్పేందుకు సరిపోతుంది.

కుప్పంలో 1997 నుంచి పనిచేస్తున్న ద్రావిడ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాల సంగమస్థలిలో ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం ద్వారా స్థాపించినా, ఈ చట్టంలోని నిర్వచనాలు అసాధారణమైనవి. సెక్షన్‌ 2(జి)లో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ‘పార్టిసి పేటింగ్ గవర్నమెంట్లు’గా చట్టబద్ధంగా నిర్వచించారు. సెక్షన్‌ 4(i)లో ‘జాతీయ సమైక్యత’ ఈ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక లక్ష్యంగా పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాయి. తిరువళ్ళువర్ భవనం, అక్కమహాదేవి వసతి గృహం వంటి భవనాలు అందుకు నిదర్శనం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా 27 ద్రావిడ భాషలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థగా, 27.7 కోట్ల మంది మాట్లాడే ద్రావిడ భాషా కుటుంబానికి అంకితమైన ఏకైక విశ్వవిద్యాలయం దేశంలో ఇదొక్కటే.


అయితే గత పదేళ్ళుగా నిధుల లేమి ఈ సంస్థను వేధిస్తున్నది. 2024లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం... పొరుగు సేవల ఉద్యోగుల బకాయి జీతాల కోసం, ఆర్థిక స్వావలంబన సాధించే వరకు సంవత్సరానికి రూ.5.3 కోట్ల స్పెషల్ గ్రాంట్ మంజూరు చేసింది. ఇది శాశ్వత పరిష్కారం కాదు గానీ, ఈ సంస్థకు నిజంగా ఊపిరి పోసిన చర్య. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య తగ్గింది. తమిళనాడు, కర్ణాటక విద్యార్థులకు రాష్ట్ర ప్రవేశ పరీక్షలో, ఉపకార వేతనాలలో అవకాశం ఉండదు. దూరవిద్య విభాగం NAAC ‘A’ గ్రేడ్ లేకపోవడం వల్ల పూర్తిగా మూతపడింది. జాతీయ స్వభావంతో పుట్టిన ఈ విశ్వవిద్యాలయం రాష్ట్ర పరిమిత వనరులపై ఆధారపడవలసిన పరిస్థితిలో చిక్కుకుపోయి, నెమ్మదిగా నీరసించిపోతున్నది.

చిత్తూరు జిల్లాలో ఉన్నత విద్యను విస్తరించాలనే హెచ్‌ఆర్‌డి మంత్రి లోకేష్‌ సంకల్పం హర్షణీయమైనది. అయితే ఆ లక్ష్యాన్ని సాధించే మార్గం కూడా హర్షణీయంగానే ఉండాలి. ఈ సమస్యకు ద్రావిడ విశ్వవిద్యాలయ దృష్టికోణం నుంచి చూస్తే ఉన్నవి రెండు మార్గాలు. మొదటిది– ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా మార్చడం. స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కేంద్ర విశ్వవిద్యాలయాలుగా మారడం కొత్త కాదు. మణిపూర్ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం 2005లో పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర హోదా పొందాయి. వార్ధాలోని మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం హిందీ ఒక్క భాష లక్ష్యంగా, హైదరాబాద్‌లోని ఈఎఫ్‌ఎల్‌యు కేవలం భాషా లక్ష్యం కారణంగా కేంద్ర హోదా పొందాయి. తిరుపతితో సహా సంస్కృత విశ్వవిద్యాలయాలకు మూడు కేంద్ర సంస్థలు ఉన్నాయి. ఒక్క భాషకే కేంద్ర విశ్వవిద్యాలయం సాధ్యమైతే, 27 ద్రావిడ భాషలకు సేవ చేస్తున్న ఏకైక సంస్థకు ఆ హోదా ఎందుకు సాధ్యం కాదు? చట్టపరంగా ఇందుకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మణిపూర్, అలహాబాద్ నమూనాలో పార్లమెంటులో ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టడం ఒకటి. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం 2009లోని సెక్షన్‌ 3(1) సవరణ ద్వారా ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని చేర్చడం మరొకటి. దీనికంటే మంచి మార్గాలు కూడా ఉండవచ్చు. ఏ మార్గం ముందు అందుబాటులోకి వస్తే ఆ మార్గంలో ముందుకు సాగవచ్చు.


రెండవది– చిత్తూరులో ద్రావిడ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ ఏర్పాటు. కేంద్ర హోదా కోసం ప్రయత్నించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేని పక్షంలో, ద్రావిడ విశ్వవిద్యాలయ పీజీ సెంటర్‌ను చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించవచ్చు. జిల్లా విద్యార్థులకు పట్టణ ప్రాంతంలో ఉన్నత విద్య అందడంతో పాటు ద్రావిడ విశ్వవిద్యాలయానికి విద్యార్థుల సంఖ్య పెరిగి, అదనపు ఆదాయ వనరు సమకూరుతాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండానే హామీ నిలబడుతుంది.

ద్రావిడ విశ్వవిద్యాలయం పరిస్థితిని పట్టించుకోకుండా అదే జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం స్థాపిస్తే రెండు సంస్థలకూ ప్రయోజనం ఉండదు. రెండూ నిధుల కొరత, విద్యార్థుల సంఖ్యతో సతమతమై, చివరికి బలహీనంగా మిగులుతాయి.

చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను విస్తరించాలనే మంత్రి లోకేష్‌ లక్ష్యం గొప్పది. అయితే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ద్రావిడ సంస్కృతి మొత్తానికి ప్రాతినిధ్యంగా స్థాపించిన ఈ విశ్వవిద్యాలయాన్ని వదిలిపెట్టకుండా, దానిని విస్తరించే మార్గాలను ముందుగా చూడాలి.

ఈ విశ్వవిద్యాలయంతో నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న అనుబంధం సామాన్యమైనది కాదు. సంకల్పించింది ఎన్టీఆర్ అయినా, 1997లో స్థాపన నుంచి దీనిని అభివృద్ధి చేసి నిలబెట్టింది చంద్రబాబే. ఫిబ్రవరి 25, 2015న ద్రావిడ విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న చంద్రబాబు ‘ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా మారుస్తాం’ అని ప్రకటించారు. అదృష్టవశాత్తూ ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాటి హామీని గుర్తుచేసుకుని, తాను నిర్మించిన సంస్థకు కేంద్ర హోదా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటే అది పాత హామీని నెరవేర్చడమే కాక కొత్త విశ్వవిద్యాలయం అవసరాన్ని కూడా తీరుస్తుంది. ద్రావిడ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చొరవ తీసుకుంటే అది రాష్ట్రానికి గర్వకారణం, చిత్తూరు జిల్లాకు శాశ్వత వరం అవుతుంది. దాంతో పాటు దక్షిణ భారత భాషా వారసత్వానికి న్యాయం జరుగుతుంది.

డాక్టర్ వేలం పళని

అసోసియేట్ ప్రొఫెసర్, ద్రావిడ విశ్వవిద్యాలయం

ALso Read:

18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల

Updated Date - Jul 02 , 2026 | 01:25 AM