‘ఉపాధి’ని నీరుగార్చేందుకే కొత్త నిబంధనలు!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:38 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మొదటి దశాబ్దంలోనే 32శాతం వరకూ పేదరికాన్ని తగ్గించింది. ఈ పథకం 14కోట్ల మందిని పేదరికం బారిన పడకుండా కాపాడగలిగింది. గ్రామీణ...
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మొదటి దశాబ్దంలోనే 32శాతం వరకూ పేదరికాన్ని తగ్గించింది. ఈ పథకం 14కోట్ల మందిని పేదరికం బారిన పడకుండా కాపాడగలిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలకు, పురుషులకు మధ్య ఉండే వేతనాల్లోని భేదాల్ని ఈ పథకం రూపుమాపింది. వంద రోజుల పనిగా తెలంగాణలో గుర్తింపు పొందిన ఈ పథకం అందరికీ సమాన అవకాశాల్ని, గ్రామీణ ప్రజలకు ఆదాయాన్ని, కుల మతాలకు అతీతంగా పని దినాల్ని కల్పించటంలో సఫలమైంది. ఈ పథకం ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలు తమ పిల్లల్ని బడులకు పంపటం పెరిగిందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఇంతకుముందులా వడ్డీ వ్యాపారుల ముందు అప్పుకోసం చేయి చాచే పరిస్థితి తగ్గిన విషయాన్ని కూడా ఈ అధ్యయనం పేర్కొంది. మొత్తం కూలీల్లో 58శాతం మహిళలే. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కూడా ఈ పథకం దేశ గ్రామీణ ప్రజల్ని ఆదుకొంది. పట్టణాలు, నగరాల నుంచి తరలివెళ్లిన వాళ్లకు పని కల్పించి ఆదుకొంది.
కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ఈ పథకం ప్రాథమిక స్వభావాన్నే మార్చేసింది. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమంగా కొనసాగుతున్న ఉపాధి హామీని ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాలపై భారంగా మార్చింది. గాంధీ సిద్ధాంతాల పట్ల తీవ్ర విభేదాలతో పనిచేసే ఆర్‌ఎస్ఎస్ సూచనలకు అనుగుణంగానే ఈ పేరు మార్పు చేసింది మోదీ ప్రభుత్వం. ఇంతకు ముందు వేతనాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండగా, ప్రస్తుతం కేంద్రం 60శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించేలాగా మార్పులు తెచ్చారు. ఇప్పటికే జీఎస్టీ పన్నుల విధానం ద్వారా రాష్ట్రాల నడ్డి విరిచిన మోదీ, ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఖర్చుల్ని సైతం రాష్ట్రాలే భరించేలాగా సవరణలు తేవటం దారుణం.
యూపీఏ ప్రభుత్వం పనిని హక్కుగా కల్పిస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం పని దినాలపై నియంత్రణ విధిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు ఏడాదికి 60 రోజుల్ని గుర్తించి పంటలు పండించే ఆ సమయంలో ఎలాంటి పనులూ చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన కూలీలకు వ్యతిరేకంగా మారనుంది. ఇంతకుముందు ఉపాధి హామీ పథకానికి వెళ్లే రైతు కూలీలను ఎక్కువ వేతనాలకు పిలిచేవారు. ఇప్పుడు ఆ 60 రోజుల్లో ఎలాంటి ఉపాధి ఉండకపోవటంతో కూలి రేటు తగ్గుతుంది. ఇది కచ్చితంగా రైతు కూలీలకు వ్యతిరేకమైన అంశమే. దేశంలో నిరుద్యోగం కారణంగా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉపాధి పెరుగుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో 60 రోజులు కచ్చితంగా పనులు చేపట్టకూడదన్న నిబంధన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోకి నెడుతుంది.
పేరు మార్చి, నిబంధనల్ని మార్చిన మోదీ ప్రభుత్వం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.400లకు పెంచాలన్న ప్రజల డిమాండ్‌ను మాత్రం పట్టించుకోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, జీడీపీలో ప్రస్తుతం ఈ పథకానికి 0.26శాతం నిధులు కేటాయిస్తుండగా ప్రపంచ బ్యాంక్ మాత్రం కనీసం 1.7శాతం నిధుల్ని కేటాయించాలని ప్రతిపాదించిన విషయాన్ని మోదీ సర్కారు పక్కనపెట్టింది. క్రమపద్ధతి ప్రకారం ఈ పథకాన్ని ప్రజలకు దూరం చేయటానికి మోదీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది.
చట్టం ప్రకారం 15 రోజుల్లోగా వేతనాలు జమ అవ్వకపోతే రోజువారీగా లెక్కేసి పరిహారాన్ని అందించాలి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ నంబర్ లింక్ లాంటి సాంకేతిక అంశాల్ని అడ్డుపెట్టుకొని పథకం ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. 2023 జనవరి 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించటంలో విఫలమైంది. జాబ్ కార్డుకు, ఆధార్, బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానించటం, పేర్లు, పుట్టిన తేదీల్లోని వివరాలు సరిపోకపోవటం వల్ల 6.7 కోట్ల మంది ఉపాధి హామీ పథకానికి దూరమయ్యారు. చాలామందికి తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవన్న కారణం కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల మంది ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్‌లో తమ పేరు నమోదు చేసుకోలేకపోయారు. గత పదేళ్లుగా 71శాతం మందికి సరైన సమయంలో వేతనాల్ని అందించలేకపోయింది ఎన్డీఏ ప్రభుత్వం.
ఉఫాధి హామీ పథకానికి తూట్లు పొడవటం కచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని హరించటమే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ముందులాగే ఉపాధి హామీ పథకానికి 90శాతం బడ్జెట్‌ను కేంద్రమే భరించాలి. పని దినాల సంఖ్యను 150కు పెంచి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాల్ని పెంచాలి.
తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్ ఎమ్మెల్యే
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు