Share News

హిమాలయ ‘సునామీ’కి బాధ్యులెవరు?

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:53 AM

నేపాల్‌ను విషాదసీమగా మార్చివేసిన మహా విపత్తు అది. హిమాలయ మంచుకొండల మీది హిమనీనదాలు కరిగిపోయాయి. నిటారుకొండలు తమ గర్వాన్ని వీడి కూలిపోయాయి. నదులు వరద జలాలతో పోటెత్తాయి....

హిమాలయ ‘సునామీ’కి బాధ్యులెవరు?

నేపాల్‌ను విషాదసీమగా మార్చివేసిన మహా విపత్తు అది. హిమాలయ మంచుకొండల మీది హిమనీనదాలు కరిగిపోయాయి. నిటారుకొండలు తమ గర్వాన్ని వీడి కూలిపోయాయి. నదులు వరద జలాలతో పోటెత్తాయి. అనూహ్యమైన జలప్రళయమది. హిమాలయ ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తు అసాధారణమైనది. విపత్తు దృశ్యాలు భయానకమైనవి. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ వాతావరణ విధానంపై కృషి చేస్తున్న నేపాలీ పౌరుడిగా నేను ఈ విపత్తుకు తీవ్రంగా కలత చెందాను. ఆవేదనకు మించిన ఆగ్రహం నన్ను కుదిపివేసింది. ఇటువంటి ప్రళయం విరుచుకుపడవచ్చని శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రపంచ వాతావరణ కార్యాచరణలో జాప్యమే ఈ జల ప్రళయం, సందేహం లేదు. హరితగృహ వాయు ఉద్గారాలను తగ్గించి, భూ తాపాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ఉన్న ప్రపంచ వాతావరణ కార్యాచరణ విషయంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఇటువంటి ప్రళయం జరిగేదేనా? ఆగస్టు 26న మంచు, నీరు, బండరాళ్లు, బురదతో కూడిన రాకాసివరద అశేష ప్రజలను కకావికలు చేసింది. లక్షలాది గృహాలను ధ్వంసం చేసింది, మార్కెట్లు, వంతెనలు, రోడ్లు రూపు లేకుండా పోయాయి. ఇటు నేపాల్‌లోను, అటు టిబెట్‌లోను విద్యుదుత్పాదన కేంద్రాలు కొట్టుకుపోయాయి. వందలాదిమంది మరణించగా, జాడలేకుండా పోయినవారు వేల సంఖ్యలో ఉన్నారు. అనూహ్య వేగంతో ఈ విధ్వంసం చోటుచేసుకున్నది. పర్వతాగ్రాలపై మొదలైన విపత్తు క్షణాల్లో దిగువ ప్రాంతాలకు వ్యాపించింది. ఈ విపత్తు ఒక వాస్తవాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది: నేపాల్‌కు మరింత బలమైన ముందస్తు విపత్తు హెచ్చరిక వ్యవస్థలు, హిమనీనదాల, అస్థిర కొండవాలుల నిరంతర మెరుగైన పర్యవేక్షణ, నేపాల్‌, టిబెట్‌లో ఉమ్మడి జలవనరుల పరివాహక ప్రాంతాలు ఉన్నందున ఈ రెండు హిమాలయ ప్రాంతాల మధ్య సరిహద్దు సమాచార మార్పిడి, మరీ ముఖ్యంగా ప్రాకృతిక విపత్తుల సన్నద్ధతలో భారీ ఎత్తున నిధుల వినియోగం అత్యవసరం.

నేపాల్‌లో మెరుపు వరదలు ఒక మౌలిక వాస్తవాన్ని బహిర్గతం చేశాయి: సమస్య ముందస్తు హెచ్చరికల వ్యవస్థ లేకపోవడం కాదు; వాతావరణ సంక్షోభం సృష్టిస్తున్న ప్రమాదాలు ఊహింపదగిన విపత్తులకు భిన్నంగా ఉంటున్నాయి; ఫలితంగా హెచ్చరిక వ్యవస్థలు ఆ అనూహ్య అపాయాల సంభవాన్ని గ్రహించలేకపోతున్నాయి. హిమాలయ పర్వతాల పరివేష్టిత భోటేకోశి నదీ తీరస్థ ప్రాంతాలను ముంచివేసిన వరదే అందుకొక ఉదాహరణ. బురద, కొండరాళ్లతో ఆకస్మికంగా విరుచుకుపడిన ఆ వరద నది ఎగువ ప్రాంతంలోని హైడ్రాలాజికల్‌ కేంద్రాలను, నీటి మట్టాల పెరుగుదలను కనిపెట్టి హెచ్చరికలను జారీ చేయక ముందే ధ్వంసం చేసింది. క్రమంగా పెరిగే నీటి మట్టాల పెరుగుదలను కనిపెట్టేందుకు ఆ హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు. అయితే ఆగస్టు 26న సంభవించిన రాకాసి వరద ఆ హెచ్చరిక వ్యవస్థను ముందుగానే సమూలంగా ధ్వంసం చేసింది. ఇదెలా జరిగింది? శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనా ప్రకారం, ఒక భారీ హిమనీనదం కూలిపోవడం కారణంగా ఇది సంభవించింది. పర్వతాల పై భాగంలో జరిగిన ఈ సంఘటన దిగువ ప్రాంతాలలో హింసాత్మక వరదకు దారితీసింది. ఈ క్రమం తీరుతెన్నులను కచ్చితంగా నిర్ధారించేందుకు ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అంతిమంగా శాస్త్రవేత్తల వివరణ ఏమైనప్పటికీ వేడెక్కిన పర్వత ప్రాంతాలలో ప్రమాదాలు ఎంత త్వరితంగా మహావిపత్తులుగా పరిణమిస్తాయనేదానికి ఈ సంఘటనే తిరుగులేని నిదర్శనం. స్పష్టంగా చెప్పాలంటే విపత్తును పసిగట్టడానికి ఉద్దేశించిన సాధనాలే దానివల్ల పనిచేయకుండా పోయాయి. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. గతంలో సంభవించిన వరదలను బట్టి రూపొందించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ భవిష్యత్తులో తీవ్రమైన విపత్తుల ముందు సరిపోనిదిగా మిగలవచ్చు. అంతమాత్రాన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు నిష్ప్రయోజనకరమని భావించనవసరం లేదు. అయితే వాటి పరిమితులను మనం గుర్తించాలి, అంగీకరించాలి.


వాతావరణ అనుసరణ (వాతావరణ మార్పు, దాని ప్రభావాలకు అనుగుణంగా నష్టాన్ని తగ్గించడానికి సర్దుబాటు చేసుకునే ప్రక్రియ)కూ పరిమితులున్నాయి. మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచుకోవడం, విపత్తుల నెదుర్కొనే సంసిద్ధతను మెరుగుపరచుకోవడం, జీవనాధారాలకు రక్షణ కల్పించడం మొదలైన చర్యలతో అటువంటి సర్దుబాటుకు నేపాల్‌ చాలా సంవత్సరాలుగా చురుగ్గా ప్రయత్నిస్తున్నది. అయితే వాతావరణ సంక్షోభానికి చారిత్రకంగా బాధ్యత ఉన్న పారిశ్రామిక సంపన్న దేశాల నుంచి నేపాల్‌కు తగు ఆర్థిక సహాయం లభించనే లేదు. తీవ్రమవుతున్న వాతావరణ ప్రమాదాలను, వినాశనకర వరదలను ఎదుర్కోవడానికి నేపాల్‌కు అంతర్జాతీయ సహకారం అత్యవసరం. ఎందుకంటే హిమాలయ ప్రాంతాల్లో సంభవించే ప్రాకృతిక విపత్తులు జాతీయ సరిహద్దులకు ఆవల ఉద్భవిస్తాయి. కనుక సంబంధిత దేశాల మధ్య సహకారం, సకాలంలో సమాచార మార్పిడి ఉండి తీరాలి.

నేపాల్‌ ప్రాంతపు హిమాలయాలు వేగంగా మారుతున్నాయి. హిమనీనదాలు క్షీణిస్తున్నాయి. భూతాపం హిమాలయ ప్రాంతాల సుస్థిర పరిస్థితులను వేగంగా మార్చివేస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా నివారించడమే మొదటిపని కావాలి. దశాబ్దాలుగా శిలాజ ఇంధనాల ఆధారిత అభివృద్ధి నుంచి అత్యధికంగా ప్రయోజనం పొందిన పారిశ్రామిక సంపన్న దేశాలకు కాలుష్యకారక ఉద్గారాలను వేగంగా తగ్గించాల్సిన ప్రత్యేక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, సాంకేతికతలు ఆ దేశాలకు సమృద్ధిగా ఉన్నాయి. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాల వినియోగానికి వారు శీఘ్రగతిన పరివర్తన చెంది తీరాలి. అది ఆవశ్యక న్యాయబద్ధమైన మార్పు. అయితే సంపన్న దేశాలు ఈ మార్పు దిశగా ప్రస్థానించడం లేదన్నది ఒక కఠోర సత్యం.

ఈ పరిస్థితుల నుంచి నేపాల్‌ విధిగా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. వాతావరణ సంక్షోభానికి కారణమైన ఆర్థికాభివృద్ధి నమూనాను అనుకరించకూడదు. ఒక భిన్నమైన వ్యవస్థను నిర్మించుకునే అవకాశం తనకు ఉందనే వాస్తవాన్ని నేపాల్‌ గుర్తించాలి. అభివృద్ధి పేరిట సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించుకోవడాన్ని నిలిపివేయాలి. ప్రజల జీవనోపాధులకు, పర్యావరణ సమ తౌల్యతకు ప్రాధాన్యమిచ్చే ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవాలి. కాలుష్యకారక వాయువుల ఉద్గారాలలో నేపాల్‌ వాటా చారిత్రకంగా ఎప్పుడూ 0.1శాతం కంటే తక్కువగా ఉంటోంది. నేపాల్‌ తలసరి ఉద్గారాలు ప్రపంచంలోనే చాలా తక్కువ. అయినప్పటికీ తాను సృష్టించని, వాతావరణ సంక్షోభానికి ఆ దేశం అధిక మూల్యం చెల్లిస్తోంది. ఇది న్యాయవిరుద్ధం కాదూ? వాతావరణ మార్పుల ఫలితంగా అనివార్యమవుతున్న ఆర్థిక, ఆర్థికేతర నష్టాల నుంచి కోలుకునేందుకు నష్టపరిహార సహాయం అందించాలని నేపాల్‌, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు పదే పదే డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటీవలి మహా విపత్తులో సంభవించిన అపార నష్టం నుంచి కోలుకునేందుకు విధిగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవల్సిన పరిస్థితిని నేపాల్‌కు కల్పించకూడదు. ఇది సంపన్న దేశాల నైతిక బాధ్యత. ఇప్పటికే అందిస్తున్న అధికారిక అభివృద్ధి సహాయానికి అదనంగా నష్ట పరిహార ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఈ అదనపు సహాయాన్ని సులభ షరతులపై ఉదారపూర్వకంగా అందించాలి. సంపన్న దేశాలు ప్రస్తుతం తాము ఉపయోగించుకుంటున్న శిలాజ ఇంధనాల పరిమాణాన్ని యథావిధిగా కొనసాగించిన పక్షంలో, నేపాల్‌ మొదలైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవి ఎంత అధిక మొత్తంలో నష్టపరిహార సహాయం అందించినా ప్రయోజనం ఉండదు.


భోటేకోశి నదీ తీరస్థ ప్రాంతాల ప్రజలు హిమాలయాలు వేడెక్కడాన్ని కోరుకోలేదు. మంచు పర్వతాలు వేడెక్కడానికి కారణమైన శిలాజ ఇంధన ఆర్థిక వ్యవస్థను కూడా వారు ఎంచుకోలేదు. తగినంత ఆర్థిక, సాంకేతికత మద్దతు లభిస్తే పరిస్థితులకు అనుగుణంగా మారి తమ భవిష్యత్తును పదిలం చేసుకోగలరు. హిమనీనదాలు కరగడాన్ని నివారించలేకపోయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అధునాతన సాంకేతికతల తోడ్పాటుతో వాతావరణ విపత్తులను ముందుగానే పసిగట్టి, వాటి నుంచి సురక్షితంగా లేదా సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడగలరు. నష్టపరిహార సహాయం అనేది దాతృత్వం కాదు. తాము చేయని అపరాధానికి భారీగా నష్టపోయిన ప్రజల శ్రేయస్సు పట్ల తమ బాధ్యతగా ఆ సహాయాన్ని పారిశ్రామిక సంపన్న దేశాలు అందించాలి.

సునీల్‌ ఆచార్య

అంతర్జాతీయ వాతావరణ విధాన నిపుణుడు

(ది గార్డియన్‌)

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 01:53 AM