సింహాసనం వణకలేదు, స్పందించింది!
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:42 AM
సమాజ విశ్లేషకులు డానీ రాసిన ‘సింహాసనం వణికింది’ వ్యాసం (31.07.2026) నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై జరిగిన ‘కాక్రోచ్’ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా రాసినట్టుగా కనపడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పూర్తిగా...
సమాజ విశ్లేషకులు డానీ రాసిన ‘సింహాసనం వణికింది’ వ్యాసం (31.07.2026) నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై జరిగిన ‘కాక్రోచ్’ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా రాసినట్టుగా కనపడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పూర్తిగా టార్గెట్ చేసింది. వ్యాసకర్త ఎక్కడా విద్యార్థుల ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై కానీ, విద్యార్థుల డిమాండ్లను విశదీకరించటంపై కానీ, నీట్ లీక్ సూచనలపై కానీ దృష్టి పెట్టలేదు. మోదీని ప్రపంచ నియంతగా చూపించి హిట్లర్ పక్కన చేర్చే ప్రయత్నానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
జంతర్ మంతర్ ఉద్యమం మొదటి కోరిక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ప్రధానమంత్రి విద్యార్థుల కోరిక తీర్చారు. కానీ డానీ మాత్రం, ‘ఇంతకాలం ఒక నారటివ్‌ను మన చేత నమ్మించారు: భారత ప్రధాని సర్వశక్తిమంతులు, సర్వజ్ఞులు. వారు అనుకున్నదే జరుగుతుంది. ఎంతటివారైనా వారి పాదాక్రాంతం కావాల్సిందే. వారు హిమాలయాలంత ఎత్తులో ఉంటే, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తూర్పు కనుమల్లోని చిన్న గుట్ట మాత్రమే,’ అని వ్యాసకర్త తన ఊహాజనిత కథనం రాశారు. తాను హిమాలయాలంత ఎత్తు అన్న భావన ప్రధానికీ లేదు. తాను తూర్పు కనుమల్లోని చిన్న గుట్ట అన్న అభిప్రాయం ప్రతిపక్ష నాయకునికీ లేదు, ఆ పార్టీ శ్రేణులకూ లేదు. దేశ ప్రజలకూ లేదు. ఈ రెండు అభిప్రాయాలూ వ్యాసకర్త సొంత అభిప్రాయాలు మాత్రమే. ఆయన దృష్టిలో వారిరువురికీ ఇచ్చిన స్థానం అది. దానిని పాఠకులపై రుద్దే ప్రయత్నం చేశారు.
‘షాహీన్ బాగ్, మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక రైతు ఉద్యమం, మహిళా రెజ్లర్ల ఆందోళనలు వంటి సంఘటనలను సామాజిక వర్గాల ఉద్యమంగా ముద్ర వేసి సమాజం నుంచి వేరు చేశారు,’ అంటూ అవి సాధించని విజయాన్ని జంతర్ మంతర్ సాధించిట్లు సూత్రీకరించారు వ్యాసకర్త. అవును, ఆ గత ఉద్యమాల పరిధి, విస్తృతి చిన్నది కాబట్టే అవి దేశవ్యాప్తం కాలేకపోయాయి. వాటి పట్ల కూడా కేంద్రం నియంత పోకడ ఎక్కడా చూపించలేదు. పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కాబట్టే అవి కొంతకాలం రగిలి శాంతించాయి. ఆ ఉద్యమాలు వేరు. జంతర్ మంతర్ ఆందోళన వేరు. మొదటివి కాస్తో కూస్తో అనుభవం, పెద్దరికం, నిర్దిష్టమైన నిర్మాణంతో ఉద్యమించాయి.
జంతర్‌మంతర్‌లో ‘బొద్దింకలు’ మాత్రమే ఆందోళనలు చేశాయి. నాయకత్వం వహించాయి. ఇవి లేవనెత్తిన అంశం దేశవ్యాప్తమైన యువతకు సంబంధించిన సమస్య. కింది కులాల వారికంటే, అసంఖ్యాక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల సమస్య. కాబట్టే ఎలాంటి నిర్మాణం, నాయకత్వం, నిధుల సమీకరణ వంటి ముఖ్యమైన అంశాలు లేకున్నా, సోషల్ మీడియా పిలుపుతోనే బలమైన గొంతుకలను సమీకరించాయి, బలంగా వినిపించాయి. మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఏ దేశంలోనైనా యువత ఆందోళనలు చాలా వాడిగా వేడిగా ఉంటాయి. వాటి పట్ల ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. కట్టుదాటితే శాంతి భద్రతలు, దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రజాస్వామిక స్పృహ కేంద్రానికి బలంగా ఉంది. ఈ ఆందోళనలో కూడా ఎన్నో అపశ్రుతులు దొర్లాయి. మోదీ వ్యతిరేక శక్తులు ఇందులో పనిచేశాయి. రక్షణ బలగాలపై దాడులు జరిగాయి. ప్రధానిని, ఆయన తల్లిని అమానవీయకరమైన వ్యాఖ్యలు చేసి దూషించారు. అవి అవసరం లేదు. ఐనా ఎందుకు చేశారు? బహుశా ఉద్యమాన్ని రక్తపు మడుగుల దిశగా నడిపించాలని అదృశ్య శక్తులు తలపోసి ఉండవచ్చు. ఈ అంశాన్ని పసిగట్టే ప్రధాని ‘మన పిల్లలు’ అన్న భావనతో సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎంత బలమైన నాయకుడు ఐనా, తాను నమ్మిన నేత ఐనా, ఆయన నేతృత్వంలో బీజేపీ గెలుపు గుర్రం అధిరోహించినా, అప్పటికే నీట్‌పై కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నా కూడా, విద్యార్థుల మొదటి డిమాండ్‌ను నెరవేర్చి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు ప్రధానమంత్రి. మిగిలిన రెండు డిమాండ్‌లను అంగీకరించారు. ఇది ప్రజాస్వామ్య పాలకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. నియంతలకు ఇలాంటి ఇజం ఉండదు.
‘ఈ ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నిరూపించింది. నాయకుడు అన్నీ తాను కాకూడదు. ప్రజలను ఉద్యమించేలా చేయాలి. ఇది సీట్ల కోసం, పదవుల కోసం, కూటముల కోసం పరస్పరం తగవులాడుకుంటూ రోజు రోజుకూ బలహీనపడుతున్న విపక్షాలకు ఒక గుణపాఠం. ప్రజలను వీధుల్లోకి తీసుకురండి. ప్రజలకు నాయకత్వం అప్పజెప్పండి’ అంటూ విపక్షాలను కూడా నెమలి ఈకల విమర్శతో నిమిరారు వ్యాసకర్త. లేకపోతే తన లోగుట్టు పూర్తిగా బయటపడుతుందని, ‘సమాజ విశ్లేషకులు’ అన్న పదానికి మరక పడుతోందని జాగ్రత్తపడ్డారు, భయపడ్డారు. వెరసి, ఈ వ్యాసకర్త బొద్దింకల మాటున ‘పెద్ద బొద్దింక’గా గుర్తింపు పొందేందుకు తెగ తాపత్రయపడ్డారు. ప్రధానమంత్రిని ఎంత బలంగా బోనులో నిలబెడితే, తనకు అంతే గుర్తింపువస్తుందని చాలా ఆశపడ్డారు.
పోతుల బాలకోటయ్య
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా