Share News

జంతర్ మంతర్‌ స్ఫూర్తితో విద్యావ్యవస్థ ప్రక్షాళన

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:55 AM

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల, యువకుల ఉద్యమం చరిత్రను సృష్టించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది...

జంతర్ మంతర్‌ స్ఫూర్తితో విద్యావ్యవస్థ ప్రక్షాళన

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల, యువకుల ఉద్యమం చరిత్రను సృష్టించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే మంత్రి రాజీనామాతోనే భ్రష్టుపట్టిన మన దేశ విద్యా వ్యవస్థ మారిపోదు. పరీక్ష పేపర్ లీకేజీలు, అవకతవకలు, అవినీతి వంటి సమస్యలు తొలగిపోవు. ఎందుకంటే పేపర్ లీకేజీలకు మూలం వేరుగా ఉంది. మెడికల్ కాలేజీల ప్రవేశానికి లక్షల మంది రాసే పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాటు ఔచిత్యాన్ని ప్రశ్నించాలి. వాస్తవానికి ఎన్టీఏ అనేది ఒక అకడమిక్ బాడీ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన సంస్థా కాదు. అది ప్రత్యక్ష రాజకీయ నియంత్రణ కింద పనిచేసే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ. దానికంటూ స్వతంత్రత, స్వయంప్రతిపత్తి ఏమీ ఉండవు. అలాంటి సంస్థకు దేశంలోని నీట్‌తో సహా అనేక ప్రవేశ పరీక్షలను, పోటీ పరీక్షలను నిర్వహించే బాధ్యతను ఎందుకు ప్రభుత్వం అప్పగించింది? కారణం దేశ విద్యారంగాన్నంతా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తెచ్చుకునే అధికారాల కేంద్రీకరణ విధానం. అందువల్లనే పరీక్షలలో అక్రమాలు, అవకతవకలు, అవినీతి వ్యవహారాల మూల బిందువు ఒకేచోట కేంద్రీకృతమై దేశమంతటా కంపనాలు వ్యాపిస్తున్నాయి.

నీట్ కోచింగ్ సెంటర్స్‌ను నిర్వహిస్తున్న వారే నీట్ పేపర్ సెట్టర్స్‌గా అవతారమెత్తారంటే ఎన్టీఏ కేంద్రంగా కోచింగ్ మాఫియా ఏ స్థాయిలో బలం పుంజుకుందో వెల్లడవుతుంది. ఈ విధమైన వేల కోట్ల రూపాయల అవినీతి వ్యాపారం అధికార ప్రాంగణాలలోని అధినేతల అండదండలు లేకుండా జరిగే వ్యవహారం కాదు. కావున ఎన్టీఏ ఉనికిని, దాని చుట్టూ బలంగా అల్లుకొని ఉన్న అవినీతి చట్రాన్ని బ్రద్దలు కొట్టాలి. లేదంటే కంటితుడుపు చర్యగా పేపర్ లీకేజీలో దళారి పాత్ర పోషించిన కొద్దిమంది నేరస్తులను బలి ఇవ్వడం, ఎన్టీఏలోని కొద్దిమంది అధికారులను తొలగించడం వంటి కసరత్తుగా మిగిలిపోతుంది. ఇంత ఆగ్రహం, ఆందోళన చెలరేగిన నేపథ్యంలో అసమర్థ ఎన్టీఏను రద్దుచేసి, తిరిగి రాష్ట్రాల స్థాయిలోనే మెడికల్ అడ్మిషన్స్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ న్యాయబద్ధమవుతుంది. ఉమ్మడి జాబితాలోని విద్యపై రాష్ట్రాల హక్కులను హరిస్తున్న, రాజ్యాంగ ఫెడరల్ సూత్రాలను కాలరాస్తున్న విద్యా కేంద్రీకరణ విధానానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

పేపర్ లీకేజి సమస్య అనేది నేడు కొత్తగా తలెత్తినది కాదు. గతంలో కూడా మెడికల్, ఇంజినీరింగ్, వంటి కోర్సులకు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలలోనూ అక్రమాలు, అవకతవకలు, లీకేజీలు చోటుచేసుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా, మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ ప్రపంచీకరణ విధానాల అమలు తర్వాత మన దేశ విద్యా వ్యవస్థలోనే ఒక అసంబద్ధత, అసమతుల్యత పెరుగుతూ వస్తోంది. అదే కొన్ని కోర్సులకు అవాంఛనీయ, అనుచిత పోటీ. చదువులంటే మెడికల్, ఇంజినీరింగ్, కంప్యూటర్, బిజినెస్ మేనేజ్‌మెంట్, సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ కోర్సులు కావడం. జేఈఈ, నీట్ పరీక్షలలో మంచి ర్యాంకులు పొందడమే మహా యజ్ఞమైంది. మిగతావన్నీ కొరగానివిగా, అర్భకుల చదువులుగా భావించే అపోహ బలంగా పాతుకుపోయింది. ఇలాంటి అపోహలను సొమ్ము చేసుకోవడానికి కోచింగ్ సంస్కృతి ఒక జాడ్యంలా వ్యాపించింది.


వీటికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వాలు విద్యను ఒక వ్యాపార సరుకుగా మార్చడానికి వరుసగా విధానాలను చేపట్టాయి. ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల సెట్టింగ్‌ను కోచింగ్ సెంటర్ల తర్ఫీదుకు అనుగుణంగా మార్చడం ప్రభుత్వ విద్యా యంత్రాంగంపై విద్యా వ్యాపార సంస్థల పట్టుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీనికితోడు సమాజంలో నిరుద్యోగం, ఉపాధి లేమి అంతకంతకూ పెరుగుతుండడంతో పిల్లల భవిష్యత్తు యెడల అంతులేని అభద్రతాభావం తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఈ పరిస్థితులే కార్పొరేట్ విద్యకు, కోట్ల వ్యాపారానికి, కోచింగ్ సెంటర్ల మాఫియా ముఠాలకు స్వర్గధామంగా పరిణమించాయి.

ప్రభుత్వాల జెండాలు ఏవైనా పేపర్ లీకేజీ పాపంలో అవి భాగస్వాములే. వాటి మధ్య తగాదా అంతా గద్దె మీద ఎవరుండాలన్నదే. కార్పొరేట్ సంస్థల సేవలో తరిస్తున్న ప్రభుత్వాలు ఏవైనా విద్యలో వ్యాపార సంస్కృతిని, కోచింగ్ మాఫియాను అంతం చేస్తాయని, పేపర్ లీకేజీలు లేని పటిష్ట విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తాయని ఆశించలేం. ఇందుకు ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే బిల్లుల జాబితాలో వికసిత్ భారత్ శిక్షా అభియాన్ (వీబీఎస్ఏ) అనేది ఒకటుంది. ఇది ఉన్నత విద్యలోని అన్ని నియంత్రణా సంస్థలను రద్దుచేసి, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక అత్యంత కేంద్రీకృత నియంత్రణా సంస్థను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినది. ఇది విద్యలో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఫెసిలిటేట్ చేయడానికి రూపొందింది. వాస్తవానికి ఇలాంటి బ్యూరోక్రటిక్ బాడీని నెలకొల్పే బిల్లు గత ప్రభుత్వాల హయాంలోనే తయారు కావడం గమనార్హం.

పిల్లల చదువులు, వారి భవిష్యత్తు పట్ల సమాజంలో ఎంతో ఆసక్తి, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఒక బలమైన ప్రజా ఉద్యమం ద్వారానే మన దేశ విద్యా వ్యవస్థను మార్చడం సాధ్యమవుతుంది. ఇందుకు కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని, కోచింగ్ మాఫియాను నిర్మూలించాలని ఉద్యమించాలి. విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, అధికారాల కేంద్రీకరణ విధానాలను, పెంచడానికి తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం –2020ని రద్దు చేయాలని, ప్రజానుకూల విద్యా విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేయాలి. చరిత్రాత్మక జంతర్ మంతర్ ఉద్యమ స్ఫూర్తి విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన అయ్యే వరకూ కొనసాగాలి.

ఎస్. గోవిందరాజులు

ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ

Also Read:

చికెన్‌ 65 అనే పేరు ఎలా వచ్చింది?

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Jul 28 , 2026 | 12:55 AM