Share News

జెన్ జీ, జెన్ ఆల్ఫా ఆశలను ‘నీట్’ నెరవేర్చగలదా?

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:57 AM

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను భారత్ ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో ఇప్పుడు చూడాలి. చైనాకు చెందిన ‘గావ్‌కావ్’ పరీక్ష– ఏటా కోటి ముప్పై లక్షల మందికి...

జెన్ జీ, జెన్ ఆల్ఫా ఆశలను ‘నీట్’ నెరవేర్చగలదా?

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను భారత్ ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో ఇప్పుడు చూడాలి. చైనాకు చెందిన ‘గావ్‌కావ్’ పరీక్ష– ఏటా కోటి ముప్పై లక్షల మందికి పైగా రాసే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష. దీనిని చైనా కేవలం విద్యా ప్రక్రియగా కాక, జాతీయ విశ్వసనీయతకు ప్రతీకగా చూస్తుంది. ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్ష ముగిసే వరకు భద్రతను జాతీయ భద్రతా మిషన్ స్థాయిలో నిర్వహిస్తూ, జీపీఎస్ వాహనాలు, స్ట్రాంగ్ రూములు, ఏఐ ఆధారిత సీసీటీవీలు, ఫేషియల్ రికగ్నిషన్, సిగ్నల్ జామర్లను వినియోగిస్తున్నది. కాపీయింగ్ లేదా లీకేజీలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటోంది. అక్కడి సందేశం స్పష్టం– ‘‘పరీక్షపై దాడి అంటే వ్యవస్థపైనే దాడి’’. పరీక్ష రోజున విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ట్రాఫిక్ నియంత్రణ, నో–సౌండ్ జోన్లు అమలు చేస్తారు.

మన దేశంలో కూడా జాతీయ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను ‘రక్షిత సామగ్రి’గా వర్గీకరిస్తూ, వ్యవస్థీకృత లీకులను కఠినమైన, కాలపరిమితితో కూడిన విచారణతో క్రిమినలైజ్ చేస్తూ, ఒక పరీక్షా భద్రతా చట్టం చేయవచ్చు. అంతర్జాతీయ పరీక్షా భద్రతా మార్గదర్శకాల ఆధారంగా పేపర్ సెట్టింగ్, ప్రింటింగ్, పరీక్షా కేంద్రాల పనితీరును ఆడిట్ చేసే అధికారాలతో, పరీక్షా నిర్వహణ సంస్థలతో సంబంధం లేకుండా స్వతంత్ర, చట్టబద్ధమైన ఒక జాతీయ పరీక్షా భద్రతా సంస్థను ఏర్పాటు చేయాలి. దీనికి సొంత సైబర్ ఫోరెన్సిక్ వింగ్, ఇన్సిడెంట్–రెస్పాన్స్ టీమ్‌లు ఉండాలి. పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు తీసుకురావాలి. పరీక్షలను పూర్తిగా బహుళ షిఫ్టులలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చాలి. దీనికోసం ఆల్గారిథమ్ ఆధారంగా రూపొందించిన పెద్ద క్వశ్చన్ పూల్స్, బలమైన ఎన్‌క్రిప్షన్, అసాధారణ సమాధానాల సరళిని గుర్తించేలా రియల్–టైమ్ అనలిటిక్స్ ఉపయోగించాలి. దీనివల్ల, ఒక్క ప్రశ్నపత్రం లీక్ అయినా మొత్తం వ్యవస్థ కుప్పకూలకుండా ఉంటుంది. పరీక్షా పారదర్శకతను ఒక ఉమ్మడి పౌర విధిగా మార్చాలి. అంతర్గతంగా సమాచారం ఇచ్చేవారికి (విజిల్ బ్లోయర్) బలమైన రక్షణ కల్పించాలి. ప్రతి లీకేజీని, దాని పర్యవసానాలను పారదర్శకంగా బహిర్గతం చేయాలి.


భారతదేశంలోని జెన్ జీ, జెన్ ఆల్ఫా తరాలు కఠినమైన పరీక్షలకు భయపడటం లేదు. తమ శ్రమను మట్టిలో కలుపుతూ అవినీతి వ్యవస్థలో జరుగుతున్న అన్యాయమైన పరీక్షలకు భయపడు తున్నారు. చైనా ‘గావ్‌కావ్’కు ఇచ్చే ప్రాధాన్యంను, మన వ్యవస్థ కూడా విద్యార్థుల కష్టాన్ని గౌరవించడానికి ఇస్తుందని నిరూపిస్తే.. నీట్ 2026 అనేది భారతదేశం పరీక్షల పారదర్శకత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని నిర్ణయించుకున్న సంవత్సరంగా గుర్తుండి పోతుంది. జెన్ జీ, జెన్ ఆల్ఫా ఆశలను విస్మరించే సాహసం ఎవరూ చేయకూడదు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు ‘భవిష్యత్’ను నిర్ణయించే అధికారం వారి చేతిలో కూడా ఉంటుంది.

m ఆర్. రమేశ్‌చంద్ర

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 03:57 AM