Share News

బహుళార్థక రంగస్థల కవిత ‘నీలవేణి’

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:40 AM

‘‘ఈ పిచ్చి ప్రపంచం లాగే నువ్వు కూడా ఎందుకురా ఈ ప్రేగులెముకల దేహం కోసం మరణిస్తావు?’’...‘‘మీరంతా కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళు. అందుకే ఇంత హింస, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా సబ్ ఠీక్ హై...

  బహుళార్థక రంగస్థల కవిత ‘నీలవేణి’

‘‘ఈ పిచ్చి ప్రపంచం లాగే నువ్వు కూడా ఎందుకురా ఈ ప్రేగులెముకల దేహం కోసం మరణిస్తావు?’’...‘‘మీరంతా కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళు. అందుకే ఇంత హింస, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా సబ్ ఠీక్ హై అంటున్నారు. మేం చూడగలిగే గుడ్డి వాళ్ళం’’...‘‘మేం చేస్తే నేరం. మీరు చేస్తే చట్టబద్ధం, మేం చేస్తే కామం, మీరు చేస్తే శృంగారం’’... ఇలాంటివి మరెన్నో తాత్విక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంఘర్షణలను అత్యంత కళాత్మకంగా, యిప్పటివరకు ఏ తెలుగు నాటకమూ ప్రదర్శించని విధంగా, ఒక మహా అద్భుత ఇంద్రజాల ప్రదర్శన లాగా తన జనపదం నాటక రిపర్టరీ ద్వారా, తాను రచన చేసి, పరికల్పన, దర్శకత్వం చేసి ‘నీలవేణి’ నాటకాన్ని ఇటీవల రవీంద్ర భారతిలో ప్రదర్శించాడు శ్రీనివాస్ దెంచనాల. ప్రాథమిక ప్లాట్ కోసం గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ను వాడుకున్నాను అని చెప్పాడు.

‘నీలవేణి’ సాంఘిక, పౌరాణిక, తాత్విక, శాస్ర్తీయ, జానపద లక్షణాల సంయోగం. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి కొడిగట్టుతున్న నాటకపు దీపాన్ని దేదీప్యమానం చేసింది. మసక చీకటి నేపథ్యంలో నీలిరంగు దీపాల కాంతిలో రంగస్థలం మీద ఆరంభమై ప్రేక్షకుల ఉత్సుకతను తారాస్థాయికి తీసుకుపోయింది. కాంతులు విరజిమ్మే కనకదుర్గ విగ్రహం ముందు కళాకారుల గానం, నృత్యం కనకదుర్గామాతను ఆవాహన చేస్తూ సాగే అభినయం శాస్ర్తీయ సంస్కృత నాటకపు ‘నాంది’ ‘ప్రస్తావన’లను తలపింపచేసింది. విగ్రహం నుండి కనక దుర్గ ప్రత్యక్షం అవడం ఒక కన్నుల పండగ. ఆరంభంలోను అంతిమ దృశ్యంలోను నీలవేణి రంగడిని చంపవద్దని వారించినప్పుడు, దేవత మానవులతో కలిసి సంభాషించడం, అదీ సామాజిక న్యాయం కోసం, ఇది తెలుగు నాటకరంగంలో అపూర్వ ఘట్టం.

ఒక వృద్ధ అంధ భిక్షకుడు చీకట్లో నడిచేవారిని జాగ్రత్తగా వెలుగువైపు నడవాలని పదే పదే హెచ్చరిక చేయడాన్ని దర్శ కుడు సంగీతంలోని refrain లాగా వాడుకొని భౌతిక, స్థానిక, తాత్విక స్థాయిని, యూనివర్సల్‌ స్థాయిని దాటించి ఒక మార్మిక స్థాయికి తీసుకుపోతాడు ప్రేక్షకుడిని. ప్రతీ దృశ్యమూ ఒక కవితా ఖండికను చూసిన అనుభూతిని అందిస్తుంది. ఈ నాటకంలోని మౌలిక అంశం మనసుకూ, శరీరానికీ మధ్య సంఘర్షణే అయినప్పటికీ, దేహం అశాశ్వతతత్వాన్ని వివరించి, మహా ఆశ్చర్యంగా నాయకుడు (ఆలం సందీప్) క్లైమాక్స్‌లో కళ్ళల్లో త్రిశూలాన్ని దించుకున్నాక పారడాక్సికల్‌గా ప్రఖ్యాత గాయకుడు జంగిరెడ్డి గొంతుతో నేపథ్యంలో ‘‘నీ రక్త మాంసపు ప్రేగులెముకల దేహమును జూసే ప్రేమిస్తినీ’’ అని వినడం లోని రసానుభూతిని నాటకాన్ని చూసి మాత్రమే పొందగలం. ప్రేమకీ–కామానికీ, స్వేచ్ఛకూ–కట్టుబాటుతనానికీ, గ్రామానికీ–నగరానికీ, విలువలకూ–కెరీరిజంకూ ఉన్న సంఘర్షణనూ అనివార్య బంధాన్నీ ఏక స్థల కాల సందర్భంలో చూపించడం దర్శకుడి ఊహా నైపుణ్యానికి నిదర్శనం. నాటక కథ సాధారణమైనదే అనిపించినా దర్శకుడి తిరుగుబాటు ధోరణి చాలామందిని రస వ్యాకులతకు గురిచేస్తుంది. ప్రదర్శనశైలిలోని ప్రాచీన సంస్కృత, జానపద, ఆధునిక సంప్రదాయాల మేళవింపు, వస్తువులోని బహుళ వస్తువులు మన తెలుగు నాటకానికి ఒక అసాధారణమైన ఆధునికానంతరతను ఇస్తున్నాయి.


అయిదుగురు అంధ భిక్షకులు హైదరాబాద్‌ నగర పొలిమేరల్లో శిథిల కనకదుర్గ గుడి పక్కన నివసిస్తూ రకరకాల మోసాలకు గురవుతుంటారు. నాటకంలో మొదటి మలుపు గుడ్డివాళ్ళకు చూపు తెప్పించే డాక్టర్ పక్క ఊరికి రావడం. ఆ గుడ్డివాళ్ళందరూ తమలో యువకుడైన రంగడి మీద పూర్తి విశ్వాసంతో తాము కూడబెట్టుకున్న డబ్బుతో అతనికి శస్త్రచికిత్స చేయిస్తారు. కానీ చూపు వచ్చిన రంగడి మనస్తత్వంలో విపరీతమైన మార్పు వస్తుంది. అది అతన్ని ప్రేమించిన నీలవేణి (మామిడి శ్రీలక్ష్మి)తో సహా అందరినీ దుఃఖాగ్రహానికి గురిచేస్తుంది. చూపు వచ్చిన రంగడు తను జీవించిన పరిసరాలను అసహ్యించుకొని, వాళ్ళను వదిలేసి తన దారి తాను చూసుకొని వెళ్ళిపోయినాక కూడా, నీలవేణితో ఉన్న ప్రేమ, శృంగార సంబంధాలను తెంపుకోలేకపోతాడు. అటు డబ్బు మీది వ్యామోహంతో తనను నమ్ముకున్న గుడ్డివాళ్ళను మోసం చేసి, వాళ్ళచేతనే భిక్షాటన చేయించి, కళ్ళున్న వాళ్ళను గుడ్డివాళ్ళుగా నటింపజేసి వాళ్ళ చేతనే డబ్బు సంపాదించే వ్యాపారం చేసి, రంగడు ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. ఎంత సంపాదించినా, గొప్ప పదవిని దక్కించుకున్నా, నీలవేణి పట్ల అతనికి ఉన్న కోరిక, ప్రేమ అతన్ని విచక్షణా జ్ఞానం కోల్పోయేట్టు చేసి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఆమె చేత నిరాకరింపబడతాడు. అతని మీద నమ్మకం పోయిందని, అతను ఇదివరకటి రంగడు కాదని నీలవేణి తేల్చిచెప్పినా వినకుండా మీదకు వస్తుంటే, ఆమె ఆగ్రహించి కనకదుర్గా మాత త్రిశూలంతో అతని కళ్ళు పీకేయబోతుంది. దుర్గ ప్రత్యక్షమై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజల అభిప్రాయం అడుగుతుంది. ప్రజలు వాడి వాదన వినకుండానే వాణ్ని ఎన్‌కౌంటర్‌ చేయాలి అనడం ద్వారా మన సంఘంలోని మాస్‌ హిస్టీరియా బట్టలు విప్పుతాడు దర్శకుడు. తల్లి ఆదేశం ప్రకారం నీలవేణి రంగణ్ణి క్షమించి వెళ్ళిపొమ్మంటే, నీలవేణి మీది కోరికను, ప్రేమను చంపుకోలేని రంగడు తీవ్ర మానసిక సంఘర్షణలో తన కళ్ళు తానే పొడుచుకుంటాడు. మళ్లీ గుడ్డివాడై తన అంధ భిక్షక గుంపులో కలిసిపోతాడు. చీకటిలో నడిచేవారు జాగ్రత్తగా వెలుగువైపు నడవాలని చేసే నాటకారంభ హెచ్చరికతో నాటకం ముగుస్తుంది. క్లైమాక్స్‌లో షేక్‌స్పియర్‌ వంటి వారు వాడిన సాలిలాక్వీ (ఆత్మభాషణం)ని వాడడం, అది కూడా శ్రీశ్రీ కవితను పునర్నిర్మించి వాడడం, ఒక అద్భుతం. పతాక సన్నివేశం ప్రఖ్యాత గ్రీకు విషాదాంత నాటకకర్త సొఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలోని అపరాధ భావ సంఘర్షణతో ఈడిపస్ తన కళ్ళు తానే పొడుచుకుని గుడ్డివాడు అవడాన్ని గుర్తుకు తెచ్చింది.


ఈ నాటకం భారతీయ సంస్కృత, జానపద కథాగాన శైలినీ, నృత్యరూపక శిల్పాన్ని మిశ్రమించుకున్న ఒక సరికొత్త ఆధునికానంతర నాటక శైలిని సృష్టిస్తుంది. ప్రేక్షకుడిని దుఃఖ, బీభత్స రసాత్మకంగా రంజింప చేస్తుంది. పౌరాణిక, తాత్త్విక లక్షణాలతో పాటు సామాజిక, వ్యక్తిగత సంఘర్షణను, రాజకీయ దృక్కోణాన్ని కళాత్మకంగా ప్రదర్శించడం కోసం దర్శకుడు కర్ణాటక యక్షగానన్నీ, తెలంగాణ జానపద రీతుల్ని, నిర్వచనంలో ఇమడని మనిషి ఎత్తు కనకదుర్గ విగ్రహాన్నీ, అద్భుత కాంతివిన్యాస వైభవాన్నీ, కవితాత్మక–ప్రతీకాత్మక–చిత్రాత్మక రసమయ సంభాషణలనూ వాడుకున్నాడు. కళ్ళు వచ్చిన రంగడు తన అంధ ప్రేయసికి ప్రకృతి సౌందర్యం చూపించే దృశ్యంలో వేదికపై చంద్రుడినీ, నదినీ, పూలతోటను ఒకేసారి సృష్టించడం నాటకానికి తలమానికం. ఇక్కడ దేవులపల్లిని వాడుకోవడం అపురూపం. కనకదుర్గకు కర్ణాటక యక్షగాన దుస్తులు, ఆహార్యం, ఛండే దరువులకు నాట్యం, ఫైబర్ దుర్గ మాయమై నటి దుర్గ ప్రత్యక్షమవడం మనకు మహానుభూతి. ఈ నాటకం శ్రీనివాస్‌ దెంచనాలను మరొక్కసారి జాతీయస్థాయి దర్శకుడిగా నిలబెట్టింది. ఈ నాటకంలోని ప్రయోగాలు భవిష్యత్తు ప్రయోక్తలకు, నాటక రచయితలకు, ప్రయోగకర్తలకు మార్గదర్శకంగా ఉంటాయి.

అటు ఆధునికానంతర కవిత్వంలోనూ, ఇటు నాటక రంగంలోను నలభై రెండేళ్ళుగా కృషి చేస్తున్న దెంచనాలకు ఈ రెండు తప్ప వేరే ప్రపంచాలు లేవు. కవిత్వానికి, నాటకానికి సంబంధించిన పరిశోధన, ప్రయోగం, నూతన ఆవిష్కరణ, శిక్షణ, సాధనలే అతడి ఊపిరి. 1990లలోనే తెలుగు ఆధునిక అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు పునాది అయి, తెలుగు వచన కవితను ఒక పెద్ద మలుపు తిప్పిన ‘గురి తప్పిన పద్యం’, తరువాతి ఆధునికానంతర కవితా సంపుటి ‘భస్మసారంగి’ కవిగా, ‘ఆదిశక్తి’తో భారతీయ నాటకానికి indigenous political శిల్పాన్ని ఇచ్చిన నిత్య అసంతృప్తుడు శ్రీనివాస్‌ దెంచనాల. నాటక కళాభిమానుల సాయంతో ఈ నాటకాన్ని అన్ని ప్రాంతాల్లోనూ ప్రదర్శించా లన్నది ఇప్పుడు అతని ఆశయం.

చింతపట్ల సుదర్శన్

98483 26517

ఈ వార్తలనూ చదవండి:

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు

Updated Date - Aug 17 , 2026 | 03:40 AM