Share News

‘నీలమ్మ తల్లికి...’

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:04 AM

తిరుమల్‌తో నా పరిచయం 1979లో. అప్పుడే తను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు వరవరరావు రిఫరెన్స్ తీసుకొని. త్వరలోనే మా మిత్రుత్వం బలపడింది. నాలాగే తిరుమల్ కూడా...

‘నీలమ్మ తల్లికి...’

తిరుమల్‌తో నా పరిచయం 1979లో. అప్పుడే తను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు వరవరరావు రిఫరెన్స్ తీసుకొని. త్వరలోనే మా మిత్రుత్వం బలపడింది. నాలాగే తిరుమల్ కూడా మిత్రులను సంపాదించడంలో దిట్ట. మా ఇద్దరి మధ్య స్నేహం సాహిత్యానికి సంబంధించిందే! అప్పటికే రిత్విక్ ఘటక్‌పై తిరుమల్ వ్యాసాలు రాశాడని వరవరరావు పేర్కొన్నాడు.

గమ్మత్తుగా నేను, గద్దర్, భూపాల్‌, నర్సింహ, మాధవ్, దేవరాజు మహారాజు ప్రభృతులం ఆయనకే కాకుండా ఆయన ఇంటికి కూడా దగ్గరయ్యాం. వంగపండు ప్రసాదరావు కూడా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మా గుంపులో చేరేవాడు. It was a great fun.

తిరుమల్ అప్పుడే ‘తెలంగాణ రైతాంగ పోరాట పాటలు’ అన్న విషయంపై పీహెచ్‌డీ చేయడానికి పూనుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఆ కాలంలోనే ‘నీలమ్మ’తో పరిచయం. ఆ చిరునవ్వు ఆమె ముఖాన్ని అలంకరించడం కూడా నేనప్పుడే చూశాను. అదే చిరునవ్వుతో ‘నీలమ్మ’ గత నాలుగు దశాబ్దాలుగా తన ముఖాన్ని అలంకరించుకున్నారు. ‘అతిథి దేవోభవ’ అన్న నానుడి లోకంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఆ నానుడిని తూచా తప్పకుండా పాటించినవారు కేవలం ఒక్క నీలమ్మ గారేనేమో! ఇంటికి వచ్చిన అతిథుల పట్ల ఆమె ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రశాంత వదనం, ఆదరంగా స్వాగతించడం, వాళ్లు ఇంట్లో ప్రశాంతంగా ఆసీనులవడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడంలో ఆమె దిట్ట.

‘తిరుమల్ తిప్పకాయ’. ఎక్కువ మాట్లాడడు కానీ ఎక్కువగా తిరుగుతుంటాడు. తరచుగా లోకాన్ని చుట్టిరాకుంటే ఆయనకేం తోచదు. అంటే ఊరికే తిరిగిరావడం కాదు, తన ప్రతి ప్రయాణానికో ప్రయోజనం ఉంటుంది. తిరిగి ఇంటికి చేరిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం ఆయన సేకరించి మమ్మల్ని ఆశ్చర్యపరిచేవాడు. ఆయన ఆసక్తి చరిత్ర పట్ల, జానపద కళారూపాల పట్ల. ఈ అభిరుచిలో ప్రత్యేకత ఏమీ లేదు, కానీ తిరుమల్‌కు మరొక గొప్ప లక్షణం ఉంది: ‘ఆ జానపద రూపకాలు పాడి వినిపించేవారు ఎవరు?’ అన్నది ఆయనకు అత్యంత ముఖ్య విషయం. కచ్చితంగా అలా వినిపించేవారు జానపదులే. ఎలాగైతే తిరుమల్ వాళ్లను వాళ్ల ఇళ్లలో (ఊర్లలో) దర్శించాడో, అలాగే వాళ్లూ తన ఇంటిని దర్శించాల్సిందే! తమ ఆతిథ్యం స్వీకరించాల్సిందే!


ఇక్కడే ఈ ‘నీలమ్మ’ తల్లి సహనానికి పరీక్ష. ఎందుకంటే ఇక్కడ కులం, మతం ఏవీ ఉండవు. మనుషులే ఉంటారు. స్వచ్ఛమైన జానపదులు వాళ్లు. వారితో అతడి సాహచర్యం ఐదు దశాబ్దాలుగా కొనసాగింది. వాళ్లను తమ ఇంట్లోనే కాకుండా గుండెల్లో కూడా పెట్టుకున్న తల్లి ఈ నీలమ్మ తల్లి. ఈమె అనురాగానికి, ప్రేమకీ అంతూపొంతూ లేదు. హద్దులు అసలే లేవు. ఏ హద్దులు లేని ఇల్లే తిరుమలరావు ఇల్లు. ఆ ఇంటిని ఒక విడిదిగా మార్చేశాడాయన. ‘డక్కలి వాళ్లు’ బ్రాహ్మణుల కన్నా గర్వంతో ఆసీనులై ఉంటారు ఆ ఇంట్లో! ఈ ఇంటివాళ్ల త్యాగనిరతికి అందరం జోహార్లు అర్పించాల్సిందే! ఆ హోమ్‌ మేకరే మన ‘నీలమ్మ’. త్యాగానికి ఆమె ప్రతీక. ఆ ఇల్లొక అనుభవ మండపం.

బి. నరసింగరావు (దర్శకుడు, చిత్రకారుడు)

ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:05 AM