Share News

గోర్కీ అమ్మ వంటి మన నీలమ్మ

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:25 AM

జయధీర్ తిరుమలరావు సహచరిగా ఎక్కువమందికి తెలిసి ఉండొచ్చు కానీ, ఎరిగినవారికి ఆమె నీలమ్మ, నీలగారు. జీవితాంతం ఇతరుల మంచి కోసం, సామూహిక లక్ష్యాల కోసం...

గోర్కీ అమ్మ వంటి మన నీలమ్మ

జయధీర్ తిరుమలరావు సహచరిగా ఎక్కువమందికి తెలిసి ఉండొచ్చు కానీ, ఎరిగినవారికి ఆమె నీలమ్మ, నీలగారు. జీవితాంతం ఇతరుల మంచి కోసం, సామూహిక లక్ష్యాల కోసం పాటుపడిన మహా మానవి. ముప్పై నాలుగేళ్ల కిందట, ఒక అమాయకపు పల్లెటూరి పిల్లనైన నేను, పరిశోధకురాలిగా వారింట్లో అడుగుపెట్టాను. ఒక డాక్యుమెంటరీ పనిమీద చిక్కడపల్లిలోని వారింట్లో దాదాపు నాలుగు నెలలు ఉన్నాను. అప్పటివరకూ సాంప్రదాయిక కుటుంబ చట్రాలను, భద్రలోకపు ఇళ్లను మాత్రమే చూసిన నా కళ్లకు వారి ఇల్లు నవలోకం! అక్కడ భార్యను భర్త ‘నీలగారూ’ అని పిలుస్తుంటే ఆమె ఆత్మవిశ్వాసంతో మెసలడం, ఆ పిలుపును స్వీకరించడం... రోజువారీ జీవితాల విప్లవం.

ఆ ఇంటికి నిరంతరం మనుషులు వచ్చిపోతూ ఉండేవారు. అస్తిత్వ ఉద్యమ చర్చలు, వాదోపవాదాలు సాగుతూ ఉండేవి. యువతరం, ముఖ్యంగా నాకన్నా అయిదారేళ్లు మాత్రమే పెద్దయినవారు కూడా అనర్గళంగా మేధాచర్చలు చేస్తూ ఉండేవారు. ఆలోచనాపరులెవరికైనా కలల ప్రపంచం వంటి ఆ ఇంటి లయ, రూపం, వర్ణం, అక్షరం, నాదం మాత్రం నీలమ్మే. అక్కడికి మాస్టారి కోసం వెళ్లినవారు నీలమ్మ ప్రేమను గుండె నిండా పొంది తిరిగివెళ్లేవారు. మనుషులను ఆదరించి అన్నం పెట్టడమన్న గొప్ప సుగుణం వెనుక వెలకట్టలేని చాకిరీ ఉంటుంది. దాన్ని ఆమె కష్టంగా కాక బాధ్యతతోనూ, స్వభావసిద్ధమైన ప్రేమతోనూ చేసేవారు.

నీడవలె వెనక ఉండికాక... మాస్టారు, ఆమె పక్కపక్కన నడిచారు. అనేకమందితో కలిసి నడిచారు. అందువల్లనే వారి ప్రధాన కృషిరంగమైన ఆద్యకళల గురించి ఈనాడు మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో వారు వేలాది ఆద్యకళారూపాలను సేకరించారు. జానపదులను, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణతో పాటు మరికొన్ని ప్రాంతాలలో మరుగున పడిపోతున్న ఆదివాసుల జీవన వస్తుసంచయాన్ని సేకరించి, పదిలపరిచే బాధ్యతను అవిశ్రాంతంగా మోస్తూనే ఉన్నారు. నిజానికి విశ్వవిద్యాలయాల్లో, పెద్దపెద్ద సంస్థల్లో ఏళ్ల తరబడి ప్రాజెక్టుల రూపంలో వీటిని సేకరిస్తే, ప్రభుత్వం వాటిని మ్యూజియమ్స్‌లో భద్రపరుస్తుంది. అలాంటిది ఈ ఒక్క కుటుంబం, వారితో కలిసి నడిచే కొద్దిమంది ఇంత పెద్ద బాధ్యతను మోశారు, మోస్తూనే ఉన్నారు.


సేకరణ కోసం నెలల తరబడి తిరగడం, సమయం, శ్రమ, డబ్బు, ఆరోగ్యం, ఎమోషన్స్... వీటన్నిటిని వెచ్చించవలసి ఉంటుంది. ఇదే అసాధారణమైన పని అనుకుంటే, దానికి తోడు వాటిని ఇళ్లలోనూ, ఆశ్రయం కల్పించినచోట పదిలపరిచి, సంరక్షించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆద్యకళాకృతులు చెక్కవి అయితే చెద పట్టడం, లోహానివి అయితే తుప్పు పట్టడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. ఆ చారిత్రక సంపదను భద్రంగా ఉంచడం కోసం వాటిని పసిపిల్లల కన్నా మిన్నగా సాకిన ప్రేమమయి నీలమ్మ. ఆస్తమాకు తోడు వీటి నిర్వహణ కూడా ఆమె ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపి ఉండొచ్చు.

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో నవంబర్ 9న, తన 70వ ఏట నీల మరణించారు. ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు కావాలని, తాము సేకరించి పదిలపరిచినవన్నీ భవిష్యత్ తరాల అవగాహనకు, జ్ఞానానికి చేర్పు కావాలని ఆమె ఎంతగానో తపించారు. ఆ కల నెరవేరకుండానే వెళ్లిపోయారు. మనుషులకే కాదు, తమదైన సంస్కృతి కలిగిన గిరిజన జానపదుల విలువైన వారసత్వ సంపదకూ ఆమె ఎనలేని సేవ చేశారు. తాను చేయాల్సిన పనిని వ్యక్తులు చేసి చూపించినప్పుడు ప్రభుత్వం కళ్లకద్దుకుని మ్యూజియం ఏర్పాటుకు కావలసిన చర్యలు తీసుకోవాలి. అలాంటిది మేధా సమాజం నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పుడు దాదాపు నాలుగు వేలకు పైగా చారిత్రక వస్తువులు, హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలోని మూడుగదుల్లో కిక్కిరిసి ఉన్నాయి. మరిప్పుడు వాటిని పదిలపరిచేది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం నీలమ్మ మనసుతో ఆలోచన చేసి, వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలి.

కె.ఎన్. మల్లీశ్వరి

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 03:25 AM