ఇందుగలదు.. అందు లేదా అవినీతి?!
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:27 AM
న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదని మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యానం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొన్న మార్చిలో ఎన్‌సీఈఆర్‌టీ వారు 8వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది...
న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదని మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యానం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొన్న మార్చిలో ఎన్‌సీఈఆర్‌టీ వారు 8వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది సాంఘికశాస్ర్తం సిలబస్‌లో న్యాయ వ్యవస్థలోని అవినీతి, అలసత్వంపై ఒక పాఠ్యాంశం చేర్చగా, దానిపై ఉన్నత న్యాయవ్యవస్థ తీవ్రంగా స్పందిస్తూ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాన్ని తమ వ్యవస్థపై ఒక పద్ధతి ప్రకారం చేసిన కుట్రపూరిత దాడిగా అభివర్ణిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక అడుగు ముందుకేసి సంబంధిత ఎన్‌సీఈఆర్‌టీ వారిపై సుమోటోగా కేసు తీసుకుంటానని హెచ్చరించారు. వీరందరి బాధ్యతతో కూడిన బాధ ఏమిటంటే, ఇలాంటి పాఠ్యాంశ బోధనలు బాలల లేత మనసులపై దుష్ర్పభావం చూపిస్తాయట! సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యబాగ్చి, విపుల్ ఎస్. పంచారీ వంటి వారు ఈ అంశాన్ని ధర్మాసనం ముందు ఉంచుతూ, ఇందుకు బాధ్యులయిన ఎన్‌సీఈఆర్‌టీ వారిని ప్రాసిక్యూట్ చెయ్యాలని కూడా ప్రతిపాదించారు.
ఇక్కడ గమనార్హమైన విషయం ఏమిటంటే, ఎన్‌సీఈఆర్‌టీ వారు తమ పాఠ్యాంశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలోని మొదటి మూల స్తంభమైన లెజిస్లేచర్ రాజకీయ విభాగాన్ని వదిలేశారని జ్యుడీషియరీ వాపోయింది. దీని అర్థం సునిశితులైన అందరికీ తెలుసు! ఎనిమిదో తరగతి అంటే సుమారు 13 సంవత్సరాల వయసు. తరాల మార్పిడిలో నేటి విద్యార్థుల గ్రహణశక్తిని సునిశిత పరిశీలనలను రెండుమూడు దశాబ్దాల వెనుకవారితో పోలిస్తే కొంత భేదం(మెరుగైన అవగాహన) ఉంటుందనేది అందరూ ఒప్పుకునే అంశమే. అందుకే కదా ఈ వయసులో వారికి పాఠ్యాంశాల్లో రాజ్యాంగాంశాలు, శాసనసభలు, గ్రామ పంచాయతీలు, పరిపాలనా విధానాల గురించి బోధిస్తున్నారు.
న్యాయవ్యవస్థలో జాప్యం, అవినీతి గురించి పరిశీలిస్తే.. ‘సమయానికి రాని న్యాయమైన తీర్పు అంటే, న్యాయం నిరాకరించబడినట్లే’నని కదా నీతిమంతమైన మన న్యాయసూత్రాల మూల సిద్ధాంతం. మరి ఇక్కడ సమయపాలన గురించి పాఠకుల విజ్ఞతకు వదిలేసే విషయాలు ఒక్కమారు తిలకిద్దాం. ఈనాటికీ వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు... సుప్రీంకోర్టు 81 వేలు, వివిధ ఉన్నత న్యాయస్థానాల్లో 62.4 లక్షల కేసులు, జిల్లాలు, అనుబంధ కోర్టుల్లో 4.7 కోట్లు. సీపీజీఆర్‌ఏఎమ్‌ఎస్ (సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా అనేకానేక ఫిర్యాదులు, మరింకెన్నో ఆర్బిటరీ కేసులు!
ఇక అవినీతి విషయానికి వస్తే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను ఒక ఇంటర్వ్యూలో ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అవినీతి’పై స్పందన కోరగా– ‘అవినీతి ఈ సమాజం పుట్టినప్పటి నుంచీ ఉందని, ఈ అవినీతి, లంచగొండితనం సమాజంలో అంతర్భాగమై చలామణిలో ఉన్న ఒక జీవన విధానమని, న్యాయమూర్తులు స్వర్గం నుంచి ఊడిపడలేద’ని ఎంతో స్పష్టంగా చెప్పారు. మరో గమనార్హమైన విషయమేమిటంటే ఇదే గొగోయ్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. గొగోయ్ సేవలకు మెచ్చో, ఏమో ఉద్యోగ విరమణ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ను విశిష్టమైన రాజ్యసభకు ఎంపిక చేసింది!
మరొక సంచలన ఉదంతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మది. ఈ ఘటన దేశమంతటా మార్మోగింది. ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా, సగం కాలిన 500 రూపాయల నోట్ల కట్టల మేటలు బయటపడ్డాయి. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించిన కమిటీ నివేదించిన నిర్ధారిత ఆధారాలతో ఆయన వ్యవహారం పార్లమెంట్‌లో అభిశంసన వరకూ వచ్చింది. ఇవి కేవలం కొన్ని అవినీతి అనకొండల విసర్జిత ఆహార అవశేషాల ఆధారిత పచ్చి నిజాల మచ్చుతునకలు. వాద, ప్రతివాదనలు ముగిసిన తరువాత, నిర్ణీత కాలపరిమితిని మించి, అతిక్రమించి.. తమ వద్దే ఉంచుకుంటున్న ‘రిజర్వ్‌డ్ ఫర్ జడ్జిమెంట్’లు సమర్థనీయమేనా?.. వంటి విషయాలపై న్యాయ వ్యవస్థ ఎప్పటికీ స్పందించదు.
మరి ఎన్‌సీఈఆర్‌టీ విషయంలో వారు ఏ దురుద్దేశపూరిత కుట్రలో భాగంగా ఈ పాఠ్యాంశం చేర్చారో గోప్యత వీడి బహిర్గతం చేయకపోతే ‘అవినీతిని ఖండించలేదు కాబట్టి... ఇప్పుడు బలవంతంగా తొలగించబడిన పాఠ్యాంశాన్ని ఏ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చాలో, రాజకీయ విభాగాన్ని ఏ ఏ విషయాల్లో వదిలేశారో’ న్యాయవ్యవస్థ వివరం ఇస్తే ఈ వివాదాస్పద అంశాలకు తెరపడి, న్యాయవ్యవస్థపై విశ్వసనీయత పెరుగుతుంది!
l బూరుగుపల్లి పాపారావు
ఇవి కూడా చదవండి
వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ
80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..