‘నషా ముక్త్ భారత్’ మన తక్షణ కర్తవ్యం!
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:33 AM
ఈ మధ్య పత్రికల్లో గంజాయి క్వీన్ నీతూబాయి గురించి చదివాం. ఒక సాధారణ గృహిణిలా కనిపించే నీతూబాయి 2017లో గంజాయి వ్యాపారంలోకి ప్రవేశించింది. 2020లో...
ఈ మధ్య పత్రికల్లో గంజాయి క్వీన్ నీతూబాయి గురించి చదివాం. ఒక సాధారణ గృహిణిలా కనిపించే నీతూబాయి 2017లో గంజాయి వ్యాపారంలోకి ప్రవేశించింది. 2020లో ఆమెపై తొలి కేసు నమోదైంది. అంటే సుమారు పదేళ్ల నుంచి ఆమె కొన్ని వేల మందికి గంజాయి అమ్మింది. ఆ గంజాయి వల్ల కొన్ని వందల కుటుంబాలు నాశనమై ఉండొచ్చు. మన చుట్టూ అనేకమంది నీతూబాయి వంటివారు ఉన్నా, మన కళ్ల ముందే రకరకాల విధానాల్లో వ్యాపారం జరుగుతున్నా మనం పట్టించుకోం. జూబ్లీహిల్స్‌లోని పబ్‌లలో ఎల్ఎస్డీ విరివిగా దొరుకుతూ ఉండొచ్చు. దాని పక్కనే ఉన్న లేబర్ బస్తీలలో అంత ఖరీదు లేని గంజాయి లభిస్తూ ఉండొచ్చు. ఎలా చూసినా మనుషులపై ఇలాంటి మాదక ద్రవ్యాలు చూపించే ప్రభావం ఒకటే. ప్రస్తుతం ‘నషా ముక్త్ భారత్’ అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని మోదీ దీనిపై దృష్టి సారించి, ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించటానికి కారణం మన దేశ జనాభాలో సగానికిపైగా యువతే. సరైన మార్గదర్శకత్వం లేక యువత డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడితే, వచ్చే పదేళ్లలో దేశాభివృద్ధి కుంటుపడుతుంది. మన దేశంలో మాదక ద్రవ్యాల వాడకం పెరగటానికి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. మొదటిది, ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురైపోయి చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడటం. దీనివల్ల ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇతరులతో చెప్పుకోలేని పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా కౌన్సిలర్స్, మానసిక నిపుణుల సంఖ్య తగినంతగా లేదు. రెండోది, మాదక ద్రవ్యాల అందుబాటు. ఆన్లైన్ వాణిజ్యం బాగా విస్తరించిన తర్వాత మాదక ద్రవ్యాల లభ్యత పెరిగింది. హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో కొన్ని టిఫిన్ సెంటర్లలో కూడా మాదక ద్రవ్యాలు లభిస్తున్నాయని వార్తలు వింటూనే ఉన్నాం. ఇలా మనను అన్ని వైపుల నుంచి ఈ మాదక ద్రవ్యాల బెడద కమ్ముకువస్తోంది. ప్రజలను వీటి బారిన పడకుండా ఇప్పటి దాకా చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీకృతమవటం లేదు. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈగిల్ తరహా ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఫలించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలి. అప్పుడే తమకు ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలను ప్రజలే నిర్ధారించుకోగలుగుతారు. ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.
కీర్తిరెడ్డి జూటూరు
బీజేపీ రాష్ట్ర నాయకురాలు
ఇవి కూడా చదవండి..
అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..