Share News

నరేంద్రుడు.. నవభారత పథనిర్దేశకుడు

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:17 AM

సాధించిన విజయాలు, కాలపరిమితులు ఒక పరివర్తనాత్మక యుగానికి సరైన కొలమానాలు కావు. అవి కేవలం గణాంకాలు మాత్రమే....

నరేంద్రుడు.. నవభారత పథనిర్దేశకుడు

సాధించిన విజయాలు, కాలపరిమితులు ఒక పరివర్తనాత్మక యుగానికి సరైన కొలమానాలు కావు. అవి కేవలం గణాంకాలు మాత్రమే.

దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఇది కేవలం ఒక ఘనతను సాధించడమో లేదా అధికార కాలపరిమితిలో రికార్డు సృష్టించడం మాత్రమే కాదు... అంతకంటే ఎంతో గొప్పది. కాలానికి ఉన్న అంతర్లీన భావాన్ని కేవలం సంఖ్యలతోనే చెప్పలేం. ఈ విధంగా ఆయన భారతదేశ అద్భుత మేధస్సు, రాజనీతిజ్ఞతలకు ప్రతీకగా నిలుస్తారు.

నరేంద్ర మోదీ ప్రజా జీవితం సామాన్య కార్యకర్తగా ప్రారంభమై అసాధారణ స్థాయికి ప్రస్థానించింది. సంఘ్ పరివార్ స్ఫూర్తితో ఒక సాధారణ ఆరెస్సెస్ కార్యకర్తగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. 1950లు, 1960ల నాటి రోజుల్లో తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అప్పట్లో ఏ మాత్రం ప్రజాదరణ లేని సిద్ధాంతాన్ని ఆయన బలంగా సమర్థించారు, దీక్షా దక్షతలతో అనుసరించారు.

ఆ కాలంలోని సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయనకు చెప్పుకోవడానికి ఎలాంటి రాజకీయ లేదా ఉన్నత వర్గాల నేపథ్యం లేదు. హారో, ఆక్స్‌ఫర్డ్, కొలంబియా లేదా హార్వర్డ్ వంటి విదేశీ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థుల ప్రత్యేక క్లబ్‌లను ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఎంతో గొప్పగా చూసేవారు. సర్ విన్‌స్టన్ చర్చిల్, భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ‘హారో బాయ్స్’గా ప్రసిద్ధులు. వారు ఒకే భాష మాట్లాడేవారు. ఉన్నత వర్గాల మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై వారు పంచుకునేవారు. మోదీ వీటన్నింటికీ పూర్తిగా విభిన్నమైన మనిషి.

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలతో మమేకమవడం ద్వారా మోదీ పొందిన క్షేత్రస్థాయి అనుభవం.. భారత సమాజం, ప్రజల ఆందోళనలు, వారి ఆకాంక్షల పట్ల ఆయనకు ఒక అసాధారణమైన అవగాహనను ప్రసాదించింది. ఆశయ సాధనలో ఆయనకు ‘వ్యక్తిగత జీవితంలో నిరాడంబరత, ప్రజా జీవితంలో ఆచరణాత్మకత’ అనే రెండు శక్తిమంతమైన వ్యక్తిత్వ లక్షణాలు తోడ్పడ్డాయి.


పరస్పర విరుద్ధమైన పరిస్థితులను నరేంద్ర మోదీ ఎంతో సులువుగా సమన్వయం చేసుకుంటారు. ఉదాహరణకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయితీలపై ఆధారపడని ఒక వృద్ధి నమూనాను మోదీ గట్టిగా ప్రోత్సహించారు. అదే తరహాలో కరోనా తర్వాత కాలంలో– దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసేందుకు ప్రధానమంత్రిగా– ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన సామాజిక గృహ నిర్మాణ పథకం, ఆయుష్మాన్ భారత్ వంటి బీమా పథకాలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు రక్షణగా నిలుస్తూ ప్రజలకు ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ తీర్చడంతో పాటు ఆరోగ్య భద్రతకు పూచీపడుతున్నాయి.

వాస్తవానికి మోదీ దేశ రాజకీయాలను అత్యంత లోతైన రీతిలో పునర్నిర్మించారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పీడించిన సమస్యలు ఇప్పుడు కేవలం చరిత్ర పాఠ్య పుస్తకాల్లో భాగమైపోయాయి. ప్రజల సామూహిక ఆలోచనలలో అయోధ్య అంటే ఇప్పుడు ఒక భవ్యమైన దేవాలయం మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఒకనాటి మందిర్‌–మసీదు వివాద స్థలం కాదు. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను వాటి పూర్వ వైభవానికి పునరుద్ధరించడం... సాంస్కృతిక ఐక్యతకు సంబంధించిన ఒక శక్తిమంతమైన సందేశాన్ని ఇస్తోంది. ఆశ్చర్యమేమీ లేదు.. దక్షిణ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేశ పర్యటన చేసినప్పుడు స్వయంగా మహాత్మాగాంధీ లాంటి మహోన్నత వ్యక్తి ఈ పునరుద్ధరణ కోసం కలలుగన్నారు. కాంగ్రెస్‌లోని గాంధీ శిష్యులు ఆయన ఆశయాన్ని నెరవేర్చడంలో విఫలమవగా మోదీ ఆ కలను సాకారం చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ ఒక మానని పాత గాయంలా మిగిలిపోయింది. రాజకీయ అస్పష్టత, ముస్లింలు అత్యధికంగా ఉన్న కశ్మీర్ లోయలో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని మరింత రెచ్చగొట్టింది. భారత రాజ్యాంగ పరిధికి వెలుపల ఉండే 1953 నాటి పూర్వ స్థితిని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ 2014 వరకు ఎన్నో తీర్మానాలను ఆమోదించింది. కానీ ఒక్క దెబ్బతో ఆ రాష్ట్రం రెండుగా విభజన అయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీనితో ఆర్టికల్ 370 కేవలం గతానికి సంబంధించిన ఒక పనికిరాని అవశేషంగా మిగిలిపోయింది. గతంలో తిరుగుబాట్లు, హింసతో కొట్టుమిట్టాడిన ఈశాన్య రాష్ట్రాల విషయంలో కూడా ఇదే నిజమైంది.

దేశ రాజకీయ ఆలోచనా సరళిని మోదీ పూర్తిగా మార్చివేసి దానిని మళ్లీ వెనక్కి తిప్పలేని ఒక మార్గంలో పెట్టారు. ప్రజా జీవితంలో ఇటువంటి విప్లవాత్మక మార్పు వచ్చినప్పుడు తీవ్రమైన ప్రతిస్పందనలు రావడం సహజం. దీని ఫలితంగానే మోదీకి ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన ఆశయాలకు కట్టుబడి స్థిరంగా ముందుకు సాగుతున్నారు.


గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా ఆయన సుదీర్ఘమైన 24 ఏళ్ల పరిపాలనా కాలంలో ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ సవాళ్ల రూపంలో ఎన్నో అపూర్వమైన సంక్షోభాలను మోదీ సమానంగా ఎదుర్కొన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రాన్ని దాదాపు ఒక శత్రువులా పరిగణించింది. అంతేకాకుండా తప్పుడు కేసుల ద్వారా ఆయనను బోనులో నిలబెట్టడానికి అప్పట్లో తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి.

భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న పాకిస్థాన్‌ను అడ్డుకోవడానికి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి వాటిని భారత్ చేపట్టినప్పటికీ ఉద్రిక్తతలు ఒక స్థాయి దాటి పెరగకుండా చాలా గట్టి నియంత్రణలో ఉంచారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయి యుద్ధాలుగా మారకుండా జాగ్రత్తపడ్డారు. పలు దేశాలతో దౌత్య సంబంధాలను పటిష్ఠం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులు ఆయనకు అనేక వైఫల్యాలను ఆపాదించొచ్చు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంలో మోదీ లాంటి వ్యక్తిత్వాన్ని రకరకాలుగా విశ్లేషించడం సహజం. భారత్‌లో అత్యంత సుదీర్ఘకాలం పాటు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన సాగించిన ప్రస్థానం ఎన్నో చరిత్రాత్మక సంఘటనలతో కూడుకున్నది. అది నిరంతరం ప్రజా సమీక్షకు లోబడి ఉంటుంది.

చరిత్రకు– భావోద్వేగాలు, పక్షపాతం ఉండవని అంటారు. మహాత్మాగాంధీ తన కాలంలో విమర్శలను, ప్రశంసలను రెండింటినీ ఎదుర్కొన్నారు. ‘రక్తమాంసాలతో కూడిన ఇటువంటి ఒక వ్యక్తి ఈ భూమిపై నడిచాడంటే రాబోయే తరాలు అసలు నమ్మలేవు’ అని గాంధీ గురించి ఆల్బర్ట్‌ ఐన్‌స్టైన్‌ గొప్పగా రాశారు. చరిత్రను అంత కచ్చితమైన పదాలలో అంచనా వేయడానికి ఐన్‌స్టైన్‌కు ఉన్న దూరదృష్టి అవసరం. కానీ భవిష్యత్‌ తరాల కోసం మోదీ గురించిన చారిత్రక పరిశీలన కూడా అంతే ప్రాధాన్యంను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

అజయ్‌ సింగ్‌

భారత రాష్ట్రపతికి మాజీ ప్రెస్ సెక్రటరీ,

‘ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది న్యూ బీజేపీ: హౌ నరేంద్ర మోదీ ట్రాన్స్‌ఫార్మ్‌డ్ ది పార్టీ’ పుస్తక రచయిత

(నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 4,399 రోజుల నిరవధిక పదవీకాలాన్ని నేడు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా)

ఇవి కూడా చదవండి..

విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్

సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్

Updated Date - Jun 10 , 2026 | 02:17 AM