తిరుగులేని మహానాయకుడు
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:15 AM
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాధినేతగా అక్టోబర్ 7, 2026 నాటికి నిరంతరాయంగా 25 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుని ఒక అరుదైన చారిత్రక మైలురాయిని...
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాధినేతగా అక్టోబర్ 7, 2026 నాటికి నిరంతరాయంగా 25 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుని ఒక అరుదైన చారిత్రక మైలురాయిని చేరుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాం భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానంలోనూ, పాలనా వ్యవస్థలోనూ మోదీ చూపిన ప్రభావం విశిష్టమైనది. ఆయన దేశ ప్రధాని స్థాయికి ఎదగడం ప్రతి సామాన్యుడికీ ప్రేరణ కలిగించే విషయం.
మోదీ జీవితంలో అన్వేషణ, పట్టుదల, నిరంతర కృషి, క్రమశిక్షణ, నిజాయితీ ఇమిడి ఉన్నాయి. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖకు వెళ్లడం ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ బోధనలకు ఆకర్షితులయ్యారు. 1971లో ప్రచారక్‌గా ప్రస్థానం ప్రారంభించి, 16 ఏళ్లు అకుంఠిత శ్రమ చేసిన తర్వాతే 1987లో బీజేపీలో చేరారు. గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన కృషి వల్లే 1995లో రాష్ట్రంలో తొలిసారి బీజేపీ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర భారత రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఎన్నికల వ్యూహాలను ఆయన సమన్వయం చేశారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 22 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం 2014 మే 26 నుంచి నేటి వరకు భారత ప్రధానమంత్రిగా ఆయన కొనసాగించిన ఈ పాతికేళ్ల ప్రస్థానం, ఆయన హయాంలో దేశమంతటా బీజేపీ విస్తరించడం భారత రాజకీయ ముఖచిత్రంలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.
గుజరాత్‌లో మోదీ హయాంలో అమలు చేసిన పరిపాలనా సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి దేశానికే ఒక నమూనాగా మారింది. గుజరాత్ విజయాలు ఆయనను జాతీయ రాజకీయ యవనికపై అగ్రనాయకుడిగా నిలబెట్టాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించారు. బీజేపీకి 282 సీట్లు (ఎన్డీఏకు 336 సీట్లు) అందించారు. దాంతో 2014 మే 26న ఆయన తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలు ఆయన పాలనను, విధానాలను హర్షించినందువల్లే 2019, 2024లో మోదీ సారథ్యంలో ఎన్డీఏ వరుస విజయాలు సాధించింది. 2024 జూన్‌లో ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన నాయకుడిగా నిలిచారు. అంతేకాదు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ నేతృత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా అపూర్వమైన రాజకీయ ప్రాబల్యాన్ని, విస్తరణను సాధించింది. 2014కు ముందు కేవలం కొన్ని ఉత్తరాది, పశ్చిమ భారత రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ, మోదీ హయాంలో తూర్పు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించింది.
కేంద్రంలో ఆయన చేపట్టిన సమగ్ర సంస్కరణలు ప్రజల జీవితాల్లోనూ, దేశ అభివృద్ధి చిత్రపటంలోనూ అద్భుత మార్పులను సాధించాయి. డిజిటల్ విప్లవం ద్వారా మధ్య దళారుల వ్యవస్థను రూపుమాపిన మోదీ హయాంలో స్వచ్ఛ భారత్ అభియాన్, పీఎం ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ పథకాలు, సెమీ కండక్టర్ మిషన్, భారతమాల హైవే ప్రాజెక్టులు దేశ ప్రగతిని పరుగులు పెట్టించాయి. పర్యావరణ పరిరక్షణలో ‘నమామి గంగే’, దేశవ్యాప్తంగా సంపూర్ణ గ్రామీణ విద్యుదీకరణను సాధించారు. అంతేకాకుండా, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం, అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ ప్రతిష్ఠాపన వంటి కీలక నిర్ణయాలు ఆయన హయాంలోనే జరిగాయి.
సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే పొరుగు దేశాన్ని భయపడేలా చేసిన నరేంద్రమోదీ విదేశాంగ విధానంలో భారత్ స్థానాన్ని అంతర్జాతీయ యవనికపై సరికొత్త శిఖరాలకు చేర్చారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ద్వారా భారతదేశాన్ని విశ్వగురుగా మార్చారు. కరోనా సంక్షోభ సమయంలో ‘వ్యాక్సిన్ మైత్రి’ ద్వారా 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లు, మందులు అందించడం మోదీ మానవతా దౌత్యానికి నిదర్శనం. 2023లో భారత్ విజయవంతంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) తిరుగులేని గళంగా భారత్‌ను మోదీ నిలిపారు.
రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని విస్తరిస్తూ, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల అమలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మౌలిక ప్రగతికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించడం, పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం, ఎయిమ్స్, ఐఐటీ, ఎన్‌ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే లకు అధునాతన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పూర్తి చేయూతనిచ్చారు.
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా బ్లాక్ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల సమస్యలను పరిష్కరించేందుకు 15 రోజుల ‘సేవా సేతు అభియాన్’, 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలను గౌరవించే ‘అంగన్‌వాడీ సమ్మాన్– మాతృ సంవాద్’, యువత కోసం ‘నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’, పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, టీబీ నిర్మూలన వంటి సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసే ‘సేవా మే మేరా యోగదాన్’ వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నరేంద్రమోదీ అధికారంలో కొనసాగడం అంటే భారత ప్రజలు సురక్షిత ఛత్రఛాయలో నిర్భయంగా జీవించడం.
సత్యకుమార్ యాదవ్
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Also Read:
9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు
కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్