ఆమె... ఎగసిపడే కెరటం కాదు!
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:12 AM
ఇటీవలి వరకూ నారా భువనేశ్వరి ఓ సాధారణ గృహిణి. కుటుంబం ఆలనాపాలనా చూసుకుంటూ, వారితో తప్ప మిగతావారితో పెద్దగా మాట్లాడేవారు కూడా కాదు. రాజకీయాల్లో ఆమెకు అ, ఆ లు కూడా తెలియవు, ఏనాడూ...
ఇటీవలి వరకూ నారా భువనేశ్వరి ఓ సాధారణ గృహిణి. కుటుంబం ఆలనాపాలనా చూసుకుంటూ, వారితో తప్ప మిగతావారితో పెద్దగా మాట్లాడేవారు కూడా కాదు. రాజకీయాల్లో ఆమెకు అ, ఆ లు కూడా తెలియవు, ఏనాడూ రాజకీయాల్లోకి తొంగిచూసిందీ లేదు. కానీ, మూడేళ్ల క్రితం అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఆమె ఒక కొత్త పాత్రలోకి ప్రవేశించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 9, 2023న చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం రాష్ట్రాన్ని, దేశాన్ని కల్లోలంలో పడేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటూ ఆయనపై బురదజల్లి జైలుకు తరలించిన ఆ పరిస్థితుల్లో ప్రజలను చైతన్యపరచడం, తెలుగుదేశం కేడర్‌కు అండగా నిలవడం భువనేశ్వరి కర్తవ్యాలు అయ్యాయి. పేదల శోక వదనాలు ఆమెను కంటతడి పెట్టించాయి. ఎదురైన కష్టం ఆమెను కార్యోన్ముఖురాలిగా మార్చింది. ‘న్యాయాన్ని గెలిపించండి’ అంటూ రాష్ట్రమంతటా పర్యటించాలని ఆమె నిర్ణయించుకున్నారు, చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. భువనేశ్వరి చదువు అంతా ఆంగ్లంలో సాగింది కనుక ఆమెకు తెలుగులో ఉపన్యసించడం రాదు. కానీ కాలం, అవసరం ఆమెకు మంచి తెలుగు నేర్పింది. ఆమె అపర కాళిలా మారలేదు కానీ మహా చైతన్యమూర్తిగా మారింది. ఆమె మనసు అలలకు ఎగసిపడే కెరటం కాదు! నిండు కుండలా తొణకని వ్యక్తిత్వం భువనేశ్వరిది. ప్రజల్ని రెచ్చగొట్టి అరాచకం, అల్లర్లు సృష్టించడం ఆమె అభిమతం కాదు. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ఆమె రాష్ట్ర ప్రజలకు విపులంగా వివరించారు, వారిలో ఆలోచనలను రేకెత్తించారు. ఆమె వేదనంతా ఓట్ల రూపంలో కూడా మారింది.
ఆరుపదుల వయస్సు దాటినా భువనేశ్వరి నిరంతరం శ్రమిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషిస్తున్నారు. సిబ్బందితో మమేకమవుతూ, సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను విస్తృతపరుస్తున్నారు. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిన మనిషి. మునుపటిలా రిజర్వుడ్‌గా ఉండడం లేదు. డెయిరీతో పాటు ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల్ని విస్తృతంగా చేపట్టి బృహత్తర ఆశయంతో ముందుకు వెడుతున్నారు. కార్పొరేట్ రంగంలో సామాజిక బాధ్యతగా ఆమె ట్రస్ట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. పేదలకు ఎంతో చేయాలన్న తపన ఆమెది. ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 29 ఏళ్లు పూర్తయ్యాయి. దాని సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూలమూలలకూ విస్తరించాయి. మేనేజింగ్ ట్రస్టీగా పేదలకు సేవ చేయడానికే ఆమె ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తన విస్తృతితో ఉన్నతస్థానంలో ఉంది. పేదలకు ఉచిత విద్య, వసతి చేకూర్చాలన్న సమున్నత ఆశయంతో ఆ రోజుల్లో తొలుత గండిపేటలో ఎన్టీఆర్ స్కూల్ ఆరంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నేడు భువనేశ్వరి నేతృత్వంలో విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, రక్షిత మంచినీటి సరఫరా, బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయ చర్యలు వంటి వాటిని విస్తృతంగా అమలు చేస్తోంది.
కోవిడ్ మహమ్మారి కబళించిన తెలుగు రాష్ట్రాలలో ట్రస్టు ద్వారా అందించిన సహాయం, మందులు వెలకట్టలేనివి. విశాఖ హుద్‌హుద్ తుపాను సమయంలో, 2009లో మహబూబ్‌నగర్, కర్నూలు వరదల వేళ, కేరళ, ఉత్తరాంధ్రలో వరదలు, తుపానులు వచ్చినప్పుడూ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం అందించింది. మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేస్తోంది. కొత్తగా బ్లడ్ బ్యాంక్‌తో పాటు సంజీవిని క్లినిక్స్ కూడా ఆరంభించారు. ఈ కార్యక్రమాలన్నీ భువనేశ్వరి స్వీయ పర్యవేక్షణలో సాగుతున్నాయి. తలసేమియా బారినపడి తల్లడిల్లుతున్న 250 బాలబాలికలను దత్తత తీసుకుని వారిని ఆమె అన్ని విధాలా ఆదుకుంటున్నారు. బాధిత పిల్లలను ఆదుకునేందుకు కావాల్సిన నిధుల కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక బెనిఫిట్ షో కూడా నిర్వహించారు. అనేకమార్లు మారథాన్ రన్ కూడా నిర్వహించారు. తలసేమియా ఈ వ్యాధిపీడిత పిల్లలకు ఈమె ఒక ఆశాదీపం. భువనేశ్వరి చర్యల వల్ల ఈ రోజు సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.
సేవా రంగంలో, డెయిరీ రంగంలో ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి. గత ఏడాది నవంబర్ 4 భువనేశ్వరి జీవితంలో మరుపు రాని రోజు. లండన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025’తో సత్కరించింది. ఇది ఆమెకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. ఒక మహిళకు ఇంతటి అవార్డు దక్కడం దేశానికి గర్వకారణం. విభిన్నరంగాల్లో ఆమె చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి కేంద్రం పద్మశ్రీతో సత్కరించాలి.
n డాక్టర్ విజయకుమార్
(నేడు నారా భువనేశ్వరి పుట్టినరోజు)
ఇవి కూడా చదవండి..
దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్
యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
Read Latest Telangana News And Telugu News