మొదలైనచోటే ముగిసిన వివాదం!
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:24 AM
హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల వివాదం సుప్రీంకోర్టులో మొదలై అక్కడే ముగిసింది. లా విద్యార్థుల మీద, టీచింగ్ సిబ్బంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు...
హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల వివాదం సుప్రీంకోర్టులో మొదలై అక్కడే ముగిసింది. లా విద్యార్థుల మీద, టీచింగ్ సిబ్బంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు లేదని సుప్రీంకోర్టు సెప్టెంబరు 3న తీర్పు చెప్పింది.
సెప్టెంబరులో జరగాల్సిన నల్సార్ లా యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించారు. ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం న్యాయశాస్త్ర విద్యార్థులకు గొప్ప అవకాశం. కానీ నల్సార్ విద్యార్థులు దానికి అభ్యంతరం చెప్పారు. జస్టిస్ సూర్యకాంత్‌కు రాజ్యాంగ ప్రధాన విలువల మీద గౌరవం లేదనీ, అలాంటివారి చేతుల మీదుగా తాము పట్టాలు తీసుకోబోమనీ అన్నారు. దీంతో యూనివర్సిటీ జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించే ఆలోచనను విరమించుకుంది. కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు తెలపడం పట్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది నల్సార్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులైన వారిని దేశంలో ఏ బార్ అసోసియేషన్‍లోనూ నమోదు చేసుకోరాదని బీసీఐ అధ్యక్షులు మానన్ కుమార్ మిశ్రా తీవ్రమైన ఉత్తర్వు జారీచేశారు. మానన్‌కుమార్ మిశ్రా బీజేపీకి సన్నిహితులు. బీసీఐ అధ్యక్ష పదవిలో పదేళ్లుగా నిరాఘాటంగా కొనసాగుతున్న వారు. రెండేళ్ల క్రితం బిహార్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ పరువును కాపాడే లక్ష్యంతో మానన్‌కుమార్ మిశ్రా ఈ వినూత్న ఉత్తర్వులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ ఉత్తర్వులు రాగానే, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌తో సహా, దేశంలోని ప్రజాస్వామికవాదులంతా మానన్‌కుమార్ మిశ్రా నిర్ణయం మీద తీవ్రంగా స్పందించారు. నిరసనలు పెరగటంతో బీసీఐ తన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ ఆ వివాదం ముగియకుండా మరికొన్ని ఆసక్తికర మలుపులు తిరిగింది. నల్సార్ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులు మిహిరా సూద్, అభిషేక్ తివారీ బీసీఐ తీరుపైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియర్ అడ్వకేట్ పరమేశ్వర్ విద్యార్థుల కేసును వాదించారు. ఈ కేసు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనానికే వెళ్లింది. ఇక్కడే ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
ఇది నల్సార్ యూనివర్సిటీ కేసు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, ఈ కేసు అసలు సుప్రీంకోర్టులోనే ఆరంభం అయ్యి, తిరిగి సుప్రీంకోర్టుకే వచ్చింది. ఈ ఏడాది మేలో ఒక కేసు విషయమై సుప్రీంకోర్టుకు వచ్చిన సమాచార హక్కు కార్యకర్తలను సీజేఐ ‘బొద్దింక’లంటూ కసురుకున్నారు. ఆ విసుర్లనే ఆత్మగౌరవంగా భావించి, బొద్దింకల ఉద్యమం మొదలయ్యింది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుతో, యువతరం ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు చేపట్టింది. నిరసనకారుల మీద లాఠీలతో విరుచుకుపడితే ఈ ఉద్యమం ఆగిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. విద్యార్థుల మీద తీవ్రంగా లాఠీచార్జి జరిగింది. కానీ, లాఠీ కర్రకు మేకులు దించి కొట్టారు! సంప్రదాయ నిర్వచనం ప్రకారం అది లాఠీచార్జి కాదు; మేకులు దించడం. ఆపైన తుపాకుల్లో పెల్లెట్లు పెట్టి కాల్పులు జరిపారు.
నిజానికి ఇలాంటి దురంతాలు జరిగినప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్పందించవచ్చు. అలా జరగలేదు. పైగా, పోలీసుల వ్యవహార శైలి మీద స్పందించాలని కొందరు అడ్వకేట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి లాఠీచార్జికి సంబంధించిన వీడియోలను పరిశీలించమన్నప్పుడు సీజేఐ అసహనాన్ని వ్యక్తం చేశారు. తన సమయాన్ని వృథా చేయవద్దని మందలించారు. ఈ వార్త వైరల్ అయ్యింది. జెన్‌జీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి దానికి ముందున్న తరాలు జెన్ వై, జెన్ ఎక్స్ కూడా నిరసనలకు మద్దతుగా వచ్చాయి. కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించక తప్పలేదు. ‘ఉన్నత న్యాయమూర్తులకు పదవీ విరమణానంతరం నామినేటెడ్ పదవులు ఇవ్వరాదు’ అన్న డిమాండును బొద్దింకల ఉద్యమం ముందుకు తెచ్చింది. ఎవరిని ఉద్దేశించి ఈ డిమాండు పుట్టిందో తెలియనివారుండరు. ఇన్ని మెలికలు తిరిగిన నల్సార్ కేసు చివరకు అదే సీజేఐ ధర్మాసనానికే వచ్చింది. గతంలో రెండుసార్లు జరిగిన పొరపాట్లను జస్టిస్ సూర్యకాంత్ ఈసారి చేయదలచుకోలేదు. విద్యార్థులకూ తనకూ మధ్య జరుగుతున్న వ్యవహారంలో తలదూర్చడానికి బీసీఐ ఎవరు? అని గట్టిగా అడిగారు. మానన్‌కుమార్ మిశ్రాకు పెద్ద షాకిచ్చారు. అంతేకాదు, నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కు విద్యార్థులకు ఉందని గట్టిగా సమర్థించారు. తాను కూడా కాలేజీ రోజుల్లో నిరసనల్లో పాల్గొనేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అంతిమ తీర్పులో– అడ్వకేట్లు కాకముందు విద్యార్థుల వ్యవహారాల్లో తలదూర్చే అధికారం బీసీఐకు లేదని తీర్పు ప్రకటించారు.
మానన్‌కుమార్ మిశ్రాకే కాదు; బొద్దింకల నిరసనోద్యమం విషయంలో ఢిల్లీ పెద్దల మెప్పు కోసం దిగజారుడు పనులు చేసిన వారందరికీ నల్సార్ లా విద్యార్థుల నిరసన కేసుపై వచ్చిన ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది!
డానీ
సమాజ విశ్లేషకులు
ఈ వార్తలు కూడా చదవండి
రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..