Share News

తెలంగాణ మాండలికంతో, చేనేత నేపథ్యంలో పోరంకి నవల ‘ముత్యాల పందిరి’

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:28 AM

‘‘అ న్నీ నేనే మొదట రాశాను’’ అని చెప్పుకోవడం దాశరథి రంగాచార్యకు అలవాటు. ‘చిల్లర దేవుళ్ళు’ నవలతో తొలి తెలంగాణ మాండలిక నవల రాసింది కూడా తానేనని ఆయన ఇంటర్వ్యూలలో, సభలలో బాహాటంగా...

తెలంగాణ మాండలికంతో, చేనేత నేపథ్యంలో పోరంకి నవల ‘ముత్యాల పందిరి’

‘‘అ న్నీ నేనే మొదట రాశాను’’ అని చెప్పుకోవడం దాశరథి రంగాచార్యకు అలవాటు. ‘చిల్లర దేవుళ్ళు’ నవలతో తొలి తెలంగాణ మాండలిక నవల రాసింది కూడా తానేనని ఆయన ఇంటర్వ్యూలలో, సభలలో బాహాటంగా చెప్పుకున్నారు. చదివే ఓపిక, పరిశోధించే తీరిక లేని విమర్శకులు రంగాచార్య మాటలనే వేదవాక్కుగా భావించి దాన్ని బలపరుస్తూ వ్యాసాలు రాసేశారు. దాశరథి రంగాచార్య కంటే ముందు, అనగా 1964 లోనే పోరంకి దక్షిణామూర్తి ‘ముత్యాల పందిరి’ పేరిట తెలంగాణ మాండలికంలో నవల రాయడం, అదే సంవత్సరం ఆంధ్రప్రభ ఉగాది నవలల పోటీలో అది మూడవ బహుమతి పొందడం జరిగింది. ఆంధ్రప్రభలో 1964లో సీరియల్‌గా వచ్చిన ఈ నవల, 1968లో ఎమెస్కో పాకెట్ బుక్‌గా వచ్చింది. రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’ కూడా 1970లో ఎమెస్కో పాకెట్ బుక్స్ లోనే వచ్చింది. తర్వాత జరిగిన పరిశోధనలలో, 1955లోనే లోక మలహరి రాసిన ‘జెగ్గని యిద్దె’ అనే నవల తెలంగాణ మాండలికంలో వచ్చిందని తేలింది. కాబట్టి తెలంగాణ మాండలికంతో వచ్చిన నవలల్లో రెండవ నవల ‘ముత్యాల పందిరి’ కాగా, మూడవది మాత్రమే దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’. ఆ తర్వాత మాదిరెడ్డి సులోచన ‘తరం మారింది’ నవల వచ్చింది.

మాండలిక వృత్తి పదకోశాల నిర్మాణంలో భాగంగా క్షేత్ర పర్యటన చేసి, మాండలిక పదాలను సేకరించిన పరిశోధకుడిగా పోరంకి దక్షిణామూర్తి మాండలికాల మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. దాంతో వివిధ మాండలికాల మీద నవలలు రాయాలని సంకల్పించి ముందుగా తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’, తర్వాత కోస్తా మాండలికంలో ‘వెలుగు వెన్నెల గోదారి’, రాయలసీమ మాండలికంలో ‘రంగవల్లి’ నవలలు రాసి రికార్డు సృష్టించారు. సృజనాత్మక రచయితగా, క్షేత్ర పర్యటనలతో చేనేత పని వారి జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల, అదే నేపథ్యంగా తీసుకుని ‘ముత్యాల పందిరి’ నవలను రూపొందించారు.


ఇందులో చేనేత పని వారి కుటుంబంలో జన్మించిన చంద్రయ్యకు నేత పని ఇష్టం లేక, చదువుకోవడానికి బడికి వెళుతుంటాడు. ధనవంతుడైన మేనమామ లచ్మయ్య కూతురు ముత్యాలుతో ఆటపాటలతో అన్యోన్యంగా మెసలుతాడు. దరిద్రులన్న ఈసడింపుతో లచ్మయ్య మేనరికం పట్ల ఆసక్తి చూపడు. ముత్యాలు పుట్టినరోజుకు తండ్రి కొత్తగా చేయించిన ఉంగరాన్ని చూసి ముచ్చటపడిన చంద్రయ్య తన వేలికి పెట్టుకుని పోగొట్టుకుంటాడు. తండ్రికి, మేనమామకు భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు. కొత్త ఊర్లో చేరదీసిన సాలోండ్ల ఇంట్ల పెరుగుతూ నేత పని నేర్చుకుంటాడు. చంద్రయ్య వెళ్ళిపోయిన చాన్నాళ్ళకి బతుకమ్మ పండుగ సందర్భంగా నీళ్లకుంటలో ముత్యాలుకు ఉంగరం దొరుకుతుంది. చంద్రయ్య నిర్దోషి అని తేల్చుకుంటుంది. ముత్యాలు తండ్రి లచ్మయ్య మరో మోసగాడైన రాములుతో కలిసి ఊర్లో సహకార సంఘం పెట్టి అందర్నీ మోసం చేసి బోలెడు డబ్బు గడిస్తాడు. కొడుకు మీది బెంగతో వృద్ధాప్యంతో చంద్రయ్య తండ్రి చనిపోతాడు. తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చి చంద్రయ్య, పెంచిన వాళ్లకు చెప్పి వాళ్ళ సహాయంతో ఇంటికి చేరుకొని తల్లిని ఆదుకుంటాడు. ముత్యాలు, చంద్రయ్య మనసులు కలుస్తాయి. ముత్యాలు పట్ల తన ప్రేమకు గుర్తుగా చంద్రయ్య అపురూపమైన ‘ముత్యాల పందిరి’ చీర నేయడానికి పూనుకుంటాడు. అంతలో ముత్యాలుకు రాములుతో పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి లచ్మయ్య. లంబాడి లచ్మి వల్ల రాములు దుర్మార్గుడని, వాడు అమ్మాయిలను పెళ్లి చేసుకొని అమ్మి వేస్తాడని తెలుసుకున్న చంద్రయ్య, పెళ్లికూతురుతో వెళుతున్న రాములను అదే రైలు ఎక్కి వెంబడిస్తాడు. రాములు పారిపోగా, ముత్యాలును ఓదార్చి ‘ముత్యాల పందిరి’ చీర కప్పి తన సొంతం చేసుకుంటాడు.

ఇందులో చంద్రయ్య తల్లిదండ్రులు స్వతంత్రంగా మగ్గం పని చేసుకుంటూ ఉంటారు. కానీ మేనమామ లచ్మయ్య పేద నేతకారులు నేసిన వస్త్రాలని వ్యాపారస్తులకు అమ్మి బాగా కమిషన్ సంపాదించి గొప్పవాడు అవుతాడు. లచ్మయ్యను వ్యతిరేకిస్తూ ఊళ్లో నేత పనివారు ఒక సంఘం పెట్టి చంద్రయ్య తండ్రిని దానికి అధ్యక్షుడిగా చేస్తే, బావ అని కూడా చూడకుండా లచ్మయ్య, అతని మీదనే అభాండాలు సృష్టించి సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఆ బాధతోనే చంద్రయ్య తండ్రి ప్రాణాలు వదులుతాడు. కులవృత్తులు చేసుకునే వారిలోనే కొందరు దళారులు ఏర్పడి మిగిలిన వారిని దోపిడీ చేయడమనేది వర్గ సమాజంలో ఒక సహజమైన పరిణామం అని లచ్మయ్య పాత్ర ద్వారా రచయిత నిరూపించారు.


లచ్మయ్య కూలి సరిగా ఇవ్వక పనివాళ్ళను వేధిస్తూ ఉంటాడు. కూలి గురించి ఒక నేత పనిమనిషి ఇలా అంటాడు. ‘‘లచ్మయ్య పెంచుతాడా? ఆయన ఎంత అంటే అంతనే. ఎక్కువ గావాల్నంటే పనులకెళ్ళి తీపిస్తాడు. నువ్వు కాకుంటే నీ యసుంటోండ్లు, మంది లెస్సగున్నరులే పొమ్మంటాడు. ఏమి సెయ్యాలె. సచ్చి సచ్చి సేస్తనే ఉంటాం. ఇయ్యాలరేపు పైస గలోనిదే రాజ్యం. కష్టమొకనిది, లాభమొకనిది. గా పనులన్నీ లచ్మయ్య పేటల, పట్నంల పైసకు పైస లెక్కన లాభం చూసుకొని అమ్ముకుంటాడు.’’

ఈ ప్రధాన ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని చేనేత వృత్తి పనివారి గురించి, వాళ్ల జీవన విధానాన్ని గురించి వివరంగా తెలియజేయడంలో రచయిత సఫలమయ్యారు. నేతపని – తీరొక్క రీతులు, సాలోళ్ళలో రకాలు, నెంబర్‌ను బట్టి దారం తెలుసుకోవడం, కండెలు పట్టడం అన్నింటి గురించి సందర్భోచితంగా తెలియజేశారు. హోలీ, బతుకమ్మ పండుగలతో పాటు, చంద్రయ్య పెరిగిన ఇంట్లో అక్కగా ఉన్న పున్నమ్మ పెండ్లి సందర్భంగా సాంస్కృతికపరమైన విషయాలనెన్నింటినో వివరంగా తెలియజేశారు. సాలె వాళ్ల గురించి, వారి ఆశ్రిత కులాల గురించి వివరించారు. మధ్యలో లంబాడీల ప్రస్తావన వస్తే వాళ్ల పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు, వారు ధరించే నగల వివరాలను ఇచ్చారు. ‘‘తరీక, సాల్లె, థోడం దినాల, శనారం, పొద్దుమీకి, పోరలు, ఎక్క, అంబటాల, పెయ్యి’’ లాంటి ఎన్నో మాండలిక పదాలను పొదుపుకున్న ఈ నవలలో సంభాషణలే కాకుండా కథాకథనాలను కూడా తెలంగాణ మాండలికంలో రాసి పాఠకులను ఆకట్టుకోగలిగారు. దీన్ని ఒక వైపు తెలంగాణ మాండలిక నవలగా, మరోవైపు పద్మశాలి జీవన చిత్రణల నవలగా కూడా చెప్పుకోవచ్చు.

కె.పి. అశోక్ కుమార్

97000 00948

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 02:28 AM