Share News

మూసీ అభివృద్ధి రియలెస్టేట్‌ వెంచర్‌ కాదు!

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:59 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేవలం హైదరాబాద్‌ నగర ప్రజలనే గాక తెలంగాణ ప్రజలను కూడా అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తున్నది. ముందస్తు...

మూసీ అభివృద్ధి రియలెస్టేట్‌ వెంచర్‌ కాదు!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేవలం హైదరాబాద్‌ నగర ప్రజలనే గాక తెలంగాణ ప్రజలను కూడా అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తున్నది. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, హైడ్రా పేరుతో అస్పష్ట విధానాలతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలు ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం మూసీని పునరుజ్జీవింపజేయడం కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య: స్పష్టమైన పునరావాస విధానం లేకపోవడం. మూసీ నది పరివాహక ప్రాంతం వేలాది కుటుంబాలకు జీవనాధారం. చాదర్‌ఘాట్, అంబర్‌పేట్, మూసారాంబాగ్, అత్తాపూర్ వంటి ప్రాంతాలను కలుపుకొని ఈ ప్రాజెక్టు వలన దాదాపు పదివేలకు పైగా కుటుంబాలు నిర్వాసితులుగా మారే అవకాశం ఉంది. తగినంత ముందుగా ప్రజల్లో అవగాహన కలిగించకుండా, స్పష్టమైన విధానాలను ప్రకటించకుండా, పునరావాసానికి సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో ప్రకటన చేస్తూ, ‘‘విగ్రహాలు... సుందరీకరణ’’ అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు విజయవంతమైన నది పునరుజ్జీవనానికి సజీవ ఉదాహరణ. దాన్ని ఆదర్శంగా తీసుకోకుండా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నది. గుజరాత్‌లో సబర్మతి వద్ద ముందుగా సర్వే చేసి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే ప్రజలను తరలించారు. కానీ ఇక్కడ పునరావాసం చూపకుండానే కూల్చివేతలు మొదలుపెట్టారు.

మూసీ సుందరీకరణ కంటే ముందుగా అనేక నాలాల ద్వారా మూసీలో కలుస్తున్న మురుగు నీటి శుద్ధికి ఏర్పాటు చేయవలసిన ప్రక్రియ గురించి ఇప్పటివరకు ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు. సమస్యకు మూలమైన కాలుష్యాన్ని నివారించకుండా పైపై మెరుగులు దిద్దుతూ మూసీ సుందరీకరణ, పునరుజ్జీవన ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చివేస్తున్నారు. అనేక సంప్రదింపులు, వాస్తవిక పరిస్థితుల అంచనా, ప్రజల అభిప్రాయాలను సేకరణ తర్వాత పూర్తి ప్రాజెక్టు నివేదిక రూపొందాలి తప్ప తూతూ మంత్రంగా రెండు నెలల్లోనే పూర్తి చేసి అప్రజాస్వామికంగా కూల్చివేతలు చేపడతామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు.


సింగపూర్ వంటి దేశాల్లో వివాదాస్పదమైన ‘మెయిన్‌ హార్ట్’ వంటి సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో తెలంగాణ ప్రజలకు అర్థమయింది. మూసీ కారిడార్ హైదరాబాద్‌లోని అత్యంత విలువైన పట్టణ ప్రాంతాల గుండా వెళుతుంది. ఇక్కడ భూమి చాలా విలువైనది. ఇక్కడ జరిగే ప్రతి పునరాభివృద్ధి కార్యక్రమం అనివార్యంగా భూమి విలువతోనూ, భూవినియోగంతోనూ ముడిపడి ఉంటుంది. స్పష్టమైన విధానాలు లేకుంటే ప్రజలకు బదులుగా ప్రభుత్వ అధినేతలకు కావలసినవారు లాభపడతారు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. ఇప్పటికే కలిగింది. ప్రాజెక్టు నిర్వహణకు సరిపడా నిధులు లభించకపోతే పబ్లిక్‌–ప్రయివేట్‌ భాగస్వామ్యం ద్వారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజలతోపాటు మేధావులను కూడా తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పట్ల భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విధానంతో ఉంది. ప్రభుత్వం కేవలం అనుయాయిలకు దోచి పెట్టాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును ముందుకు తీసుకు వస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. మూసీ పునరుజ్జీవనం తప్పనిసరే. కానీ పునరావాస చర్యలు చేపట్టకుండా స్పష్టమైన విధానం లేకుండా తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం వేసి ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం విగ్రహాల పేరు చెప్పి విధాన నిర్వహణ లోపంతో ప్రజలను బెదిరిస్తే, అధికార దర్పం చూపిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు.

ప్రభుత్వం మొట్టమొదటగా శాస్త్రీయ పద్ధతిలో నదీ పరివాహక ప్రాంతాలను నిర్ధారించాలి. పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాల ఆధారంగా ప్రాంతాన్ని బట్టి పునరావాస పద్ధతులను నిర్ణయించాలి. పునరావాసం అవసరమైన చోట ముందుగానే తగిన ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలి. వారి జీవన ఉపాధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. పర్యావరణ సమతుల్యత, నీటి ప్రవాహ పునరుద్ధరణ లాంటి అంశాలపై స్పష్టమైన విధానాన్ని ప్రలోభాలకు పోకుండా నిర్ణయించాలి. ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ బదులుగా ప్రతి ఇంటికి ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను అనుసంధానించి భవిష్యత్‌లో మూసీ కాలుష్యాన్ని నివారించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య ప్రజల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచాలే తప్ప ఆందోళనను సృష్టించకూడదు. మూసీ ప్రక్షాళన శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి తప్ప ప్రజల జీవితాలను తలకిందులుగా చేసే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు.

తూళ్ల వీరేందర్ గౌడ్

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 02:59 AM