Share News

మునిగిన మట్టిపాట

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:22 AM

పటంలో లేదు– మా ఊరు. మట్టిలో ఉంది– మా పేరు. ఒక ఆకుపచ్చని సంతకం శాసనమై వచ్చి ముందుగా మా నీడను తరిమేసింది. ‘ప్రాజెక్ట్’ అన్న ఒక్క మాటతోనే మా చిరునామా ప్రభుత్వ కాగితాల్లో చెరిగిపోయింది,...

మునిగిన మట్టిపాట

పటంలో లేదు–

మా ఊరు.

మట్టిలో ఉంది–

మా పేరు.

ఒక ఆకుపచ్చని సంతకం శాసనమై వచ్చి

ముందుగా మా నీడను తరిమేసింది.

‘ప్రాజెక్ట్’ అన్న ఒక్క మాటతోనే

మా చిరునామా

ప్రభుత్వ కాగితాల్లో చెరిగిపోయింది,

నీటి అలల్లో కరిగిపోయింది.

కొలత తాడులతో గీసిన గీత

మ్యాప్‌పై కాదు–

మా జీవితాల నడుమ.

నీరు

ముందుగా గుమ్మాన్ని తాకింది,

తర్వాత పేరుని,

చివరికి మనిషిని!

ఇల్లు వదిలి సాగిపోతుంటే–

గడియారం నడుస్తూనే ఉంది,

కానీ కాలం మాత్రం

ఆ గుమ్మం దగ్గరే ఆగిపోయింది!

నీటిపై ఒక పైకప్పు తేలుతోంది–

అది మా ఊరు మిగిల్చిన

చివరి జ్ఞాపకం.

బస్తాలో బట్టలు,

కళ్లలో ఊరి గోపురం!

కొత్త గోడలు లేస్తున్నాయి గానీ–

అక్కడ మా పేర్లు

నిలబడటం లేదు.

అమ్మ చేతుల్లో

అదే పాత మట్టివాసన–

కానీ, ఈ నేల

ఆమెను గుర్తుపట్టడం లేదు.

‘‘ఎక్కడి నుంచి?’’ అని అడిగితే–

చెప్పడానికి ఊరు లేక

మౌనమే జవాబై నిలిచింది.

నీటిలో మునిగిన

పాత బడి గోడపై

రాసుకున్న మా పేరు

ఇంకా చెరిగిపోకుండా ఉండొచ్చు!

దీపం వెలిగింది–

వెలుగు వచ్చింది,

కానీ.. ఇల్లు చేరే

మనుషులే లేరు.

చీకటి ముసిరితే–

నీటి హోరు మాత్రమే.

తలుపు తెరిస్తే–

గాలి తప్ప ఎవరూ లేరు.

ఇప్పుడు నీరు ఉంది–

పంటలకు, పట్టణాలకు

మా ఊరు మాత్రం

కేవలం ఒక జ్ఞాపకం.

అభివృద్ధి అంటే–

ఒక చోటుని నిలబెట్టడానికి

మరో చోటుని ముంచడమేనా?

నీటిపై ఇంకా తేలుతోంది

ఒక ఆఖరి స్వరం–

మా పేరు

ఇంకెక్కడ, ఎలా నిలుస్తుంది?

మర్రాపు వసుంధరా దేవి

94414 67660

ఇవి కూడా చదవండి..

కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

Updated Date - Jun 15 , 2026 | 02:22 AM