Share News

బహుళ పొరల ప్రేమ కథ

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:38 AM

లౌ కిక అంశాలను అధివాస్తవికతతో ముడివేస్తూ లోతైన సత్యాలను అన్వేషించడం డా. వి. చంద్రశేఖరరావు కథల ప్రత్యేకత. రాజకీయ ఆదర్శాల విచ్ఛిన్న నేపథ్యంలో ఆయన కథలు నడుస్తాయి. తర్కానికి మించి...

బహుళ పొరల ప్రేమ కథ

లౌ కిక అంశాలను అధివాస్తవికతతో ముడివేస్తూ లోతైన సత్యాలను అన్వేషించడం డా. వి. చంద్రశేఖరరావు కథల ప్రత్యేకత. రాజకీయ ఆదర్శాల విచ్ఛిన్న నేపథ్యంలో ఆయన కథలు నడుస్తాయి. తర్కానికి మించి అనుభూతికి, వర్ణనకు మించి దృశ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ, దైనందిన జీవితంలోని అట్టడుగు పొరల్లో దాగి ఉన్న వేదనను ఆయన అక్షరీకరించాడు.

రచయిత సర్వజ్ఞుడిలా ఉండి కథను నడిపించే పద్ధతిని పూర్తిగా తిరస్కరించడం చంద్రశేఖర రావు ప్రత్యేకత. తన పాత్రలు ఎదుర్కొనే ‘ట్రామా’ లేదా మానసిక వేదనని కేవలం కథా గమనం కోసం కాకుండా, వాటి అస్తిత్వాన్ని నిర్మించే ఒక శక్తిగా ఆయన చూపిస్తాడు.

చంద్రశేఖరరావు కథలలో స్త్రీ పాత్రలు అత్యంత ప్రధానమైనవి. ఆయన కథల్లోని చాలా మంది స్త్రీలు మానసికంగా గాయపడిన వ్యక్తులుగా కనిపిస్తారు. ఈ స్థితిలో ఇక్కడ గతంలోని తీపి గుర్తు కంటే వర్తమానంలోని బాధే జ్ఞాపకాలను శాసిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర రావు ‘పూర్ణమాణిక్యం ప్రేమకథలు’ అనే కథని పరిశీలిద్దాం.

ఈ కథ పూర్ణ అనే స్త్రీ అంతర్ముఖ ప్రయాణాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. శారీరకంగా దగ్గరగా ఉన్నప్పటికీ భావోద్వేగంగా దూరంగా ఉన్న ప్రకాశంతో అనుభవం ఆమె లోపలి శూన్యాన్ని బహిర్గతం చేస్తుంది. అర్షద్‌తో గడిపిన ప్రేమ జ్ఞాపకాలు మాత్రం ఆమెకు జీవం నింపే శక్తిగా నిలుస్తాయి. తల్లి రాసిన ఉత్తరం పూర్ణను గత బాధల నుంచి బయటకు తీసుకురావడానికి, మరోసారి ప్రేమను ఆహ్వానించడానికి ప్రేరేపిస్తుంది. ఆ తరువాత పూర్ణ తనను తాను మళ్లీ నిర్మించుకుంటూ, జీవితం పట్ల కొత్త చూపును పొందుతుంది. చివర్లో ఆమె గత అనుభవాలన్నింటినీ ఒకటిగా స్వీకరించి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైందని సూచిస్తుంది.

ఇది ఒక సాధారణ ప్రేమకథ కాదు. జ్ఞాపకాల, శరీరం–మనసు విభేదాల, వ్యక్తిత్వ విఘటనల, కాలసంబంధ అనుభవాల మధ్య జరిగే అంతర్ముఖ ప్రయాణం. పాఠకుడిని సంఘటనలను అనుభవంలోనికి తెచ్చుకోమని సూచించే కథ. కథ లీనియర్‌గా కాకుండా విభిన్న కాలస్థితులమధ్య విభజించబడిన నిర్మాణంతో ఉంటుంది.

పూర్ణ చూపు కోల్పోవడం, ఆపరేషన్, ఒంటరితనం, మనోహరరావు, సుందరం, అర్షద్, ప్రకాశంలతో సంబంధాలు, ఉత్తరాల రూపంలో కథలు ‘ప్రేమకథలు’ అనే మెటా–నారెటివ్ అన్నీ కలసి దీన్ని ఒక fragmented narrativeగా మార్చుతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పూర్ణ మానసిక స్థితి ఎలా విభజించబడిందో, కథా నిర్మాణం కూడా అదేవిధంగా విభజించబడింది. ముఖ్యంగా– వాస్తవం vs భ్రమ, జ్ఞాపకం vs కల్పన లాంటి విభజనలు నిర్దిష్టంగా ఉండవు. ప్రేమ అనేది కూడా ఈ కథలో ఒకే విధంగా లేదు. అనేక రూపాలలో కనిపిస్తుంది. ఉదాహరణకి, సుందరంతో ప్రేమ అసంపూర్ణ, కుల–సామాజిక ఒత్తిళ్లతో కూడిన ప్రేమ. అర్షద్‌తో ప్రేమ ఆత్మీయ, ఆలోచనా–ఆధారిత ప్రేమ, ప్రకాశంతో ప్రేమ శారీరక సంబంధం ప్రాతిపదికతో కూడిన ప్రేమ, మనోహరరావుతో ప్రేమ కళ, కోపం కలిసిన ప్రేమ. అందువల్ల కథలో ప్రేమ స్థిరమైన భావం కాదు. అది ఒక అన్వేషణ, ఒక బాధ, ఒక విధ్వంసం కూడా.


పూర్ణ తన శరీరాన్ని గురించి ఒక దశలో ఇది ఒట్టి డస్ట్‌బిన్‌ అంటుంది. ఇది చాలా శక్తివంతమైన వ్యాఖ్యానం. ఆమె దృష్టిలో శరీరం ఒక రాజకీయ స్థలం. ప్రేమ, లైంగికత, గర్భస్రావం అన్నీ నియంత్రణా వ్యవస్థలు. అబార్షన్ అనేది కూడా కేవలం ఒక మెడికల్ ప్రాసెస్ కాదు. అది ఒక అస్తిత్వ నిర్ణయం. అలాగే పూర్ణ జీవితాన్ని ఇంకొకరు కథలుగా రాయడం ద్వారా అవి పాఠకుడి ముందుక రావటం చాలా కీలకమైన అంశం. మన జీవితాన్ని ఎవరు నిర్వచిస్తారు? మన జ్ఞాపకాలు నిజమా? లేక కథకుడి నిర్మాణమా? ఆనే ప్రశ్నలు ముందుకువస్తాయి. ఈ స్థితిలో కథ మెటాఫిక్షన్ (Metafiction)కి దగ్గరగా ఉంటుంది. మెటాఫిక్షన్ ఒక రకమైన కల్పనా సాహిత్యం. ఇది తను ఒక కల్పిత కథ అని పాఠకుడికి గుర్తు చేస్తుంది లేదా కథకున్న కల్పిత లక్షణాన్ని నొక్కి చెపుతుంది.

సామాజిక హింసకు ఒక రూపంగా కులం ఈ కథలో చూపబడుతుంది. చెహోవ్‌ నాటకాన్ని ప్రదర్శిస్తున్న మనోహారరావు వైపు తోటి నటుడు వెక్కిరింతగా చూడడం, ‘‘ఏడీ నీలోని నటుడ్ని బయటకు లాగు’’ అంటూ చెవి దగ్గర గొణగడం... మళ్లీ కాసేపు అయినాక ‘‘theatre is not your cup of tea’’ అని వెక్కిరించడం... చివరి బాణంగా మనోహర్‌కి మాత్రమే వినపడేలా, ‘‘and after all you are a dalit, ఈ కళలన్నీ జీన్స్ ద్వారానే వస్తాయి. నీ జీన్స్‌లో ఏమున్నాయ్ మాంసము, సారాయి తప్ప’’ అనడం... ఈ హింసకు ఒక ఉదాహరణ మాత్రమే. మనోహరరావుది కేవలం వ్యక్తిగత కోపం కాదు. సంఘటిత సామాజిక అవమానానికి ప్రతిస్పందన. అలాగే సుందరం పాత్ర కులం కోసం పూర్ణమాణిక్యం పేరు మార్చుకోమని చెప్తాడు. ‘‘మేరీ పూర్ణ’’ అని కాకుండా ‘‘లక్ష్మీ పూర్ణ’’ అని పెళ్ళి కార్డులో ప్రింట్ చేద్దామంటాడు ఈ రెండు సన్నివేశాలు ప్రేమ కూడా కుల రాజకీయాల వెలుపల ఉండదనే విషయాన్ని తెలియజేస్తాయి.

కథలో madness అనేది కేవలం మానసిక రోగం కాదు, అది ప్రేమ, దుఃఖం, జ్ఞాపకాలు, గాయాలు, వాస్తవికత మధ్య మసకబారిన రేఖగా చిత్రీకరించబడింది. పూర్ణ కంటి చూపు మందగించడం నుంచి మొదలై, మనోహర్ మరణం తర్వాత ఆమెలోకి ప్రవేశించిన భ్రమలు, ఫోన్‌లో వినిపించే అతని గొంతు, కలల్లో కనిపించే గిఫ్ట్ ప్యాక్, అపార్ట్‌మెంట్ నిండా మారుమ్రోగే పాటలు మొదలయినవన్నీ ఆమె మనస్సు నెమ్మదిగా వాస్తవం నుంచి దూరమవుతున్నట్లు చూపిస్తాయి. కథ చివర్లో ఉత్తరాల రూపంలో పూర్ణ చదివే ‘‘ప్రేమకథలు’’ కూడా ఆమె స్వంత జీవితాన్ని పైన చెప్పుకున్నట్లుగా మెటాఫిక్షన్ లాగా మార్చేస్తాయి. వాస్తవం, భ్రమ మధ్య గీత లేకుండా అన్నీ కలిసిపోతాయి. ఈ కథలో madness అనేది ఒక రకమైన రక్షిత సందర్భం, బాధను భరించలేనప్పుడు మనస్సు సృష్టించుకునే ప్రపంచం. కథలో madness వ్యక్తిగత గాయాలు, ప్రేమ నష్టం, స్వీయ–కథనం (self–narration) ద్వారా వ్యక్తమవుతుంది.


విడివిడిగా పాత్రల విశ్లేషణ చేసినప్పుడు అనేక విషయాలు బహిర్గతమౌతాయి. పూర్ణ పాత్ర చూస్తే ఆమె బలమైన, విభిన్నమైన, అంతర్గతంగా గాయపడిన వ్యక్తి. నిజానికి ఆమె ఒకే వ్యక్తి కాదు, అనేక అనుభవాల సమాహారం. ఆమె ప్రేమికురాలు, రచయిత్రి, బాధితురాలు, నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తి. మనోహరరావు కళాకారుడు, కోపిష్టి, వ్యవస్థతో ఘర్షణ పడగల వ్యక్తి. అతని ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యం కాదు, ఒక సామాజిక–మానసిక వ్యవస్థ కూలిపోవటం. అర్షద్ ఆదర్శవాదం, ప్రజాకళల పట్ల ప్రేమ కలవాడు. ఒక రకంగా ఒక రొమాంటిక్ రెబెల్. ఇక సుందరం & ప్రకాశం సాధారణ పురుషుల ప్రతినిధులు.

కథలో భాష కవిత్వంలా, దృశ్యాత్మకంగా బలంగా ఉంటుంది. రక్తపు చారలు, చెట్లు దుఃఖిస్తున్న చప్పుడు లాంటి వ్యక్తీకరణాలు ఇందుకు ఉదాహరణలు. ఈ కథలో వెలుగును ‘‘ఎర్రటి రిబ్బన్లు’’గా, దుఃఖాన్ని ‘‘నల్లని దుప్పటి’’గా అభివర్ణించడంలో తెలుగు భాషలోని సహజమైన మాధుర్యాన్ని రచయిత అద్భుతంగా చూపించాడు. వాడిపోతున్న చెట్లు, వలస పక్షులు, రక్తవర్ణంలో ఉన్న సూర్యాస్తమయాలు వంటి ప్రకృతి దృశ్యాలను వాడటం ద్వారా పాత్రల అంతరంగంలోని శూన్యాన్ని, బయటి ప్రపంచంలోని ఉదాసీనతను అద్భుతంగా పోల్చారు. పూర్ణ చూపు కోల్పోవడం కథలో అత్యంత శక్తివంతమైన మెటాఫర్. నిజాన్ని చూడలేకపోవడం, గతం నుంచి బయటపడలేకపోవడం, అంతరాళంలోకి చూసుకోవటం లాంటివాటిని ఇది సంకేతిస్తుంది. చివర్లో, పూర్ణకి చూపు తిరిగి వచ్చినా వాస్తవం ఇంకా అనిశ్చితంగానే మిగులుతుంది. అంటే, చూపు అనేది దానికదే జ్ఞానం కాదు, అది జ్ఞానానికి గ్యారంటీ కూడా కాదు. ప్రధాన కథనం మధ్యలో వచ్చే ఫోన్ కాల్స్, జ్ఞాపకాలు, కథలో కథలు పూర్ణ విచ్ఛిన్నమైన మానసికస్థితిని (Fragmented psyche) అద్దం పట్టినట్లు చూపిస్తాయి. అపార్ట్‌మెంట్‌లో పక్షులు ముంచెత్తడం లేదా పూర్ణ రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడం వంటి సర్రియలిస్టిక్ అంశాలు మ్యాజికల్‌ రియలిస్టు రచయితల శైలిని గుర్తుకు తెచ్చినప్పటికీ, కథ మాత్రం పూర్తిగా తెలుగు సంస్కృతికి, మూలాలకు కట్టుబడి ఉంటుంది. షేక్‌స్పియర్‌, చెకోవ్ వంటి పాశ్చాత్య ప్రస్తావనలు ఉన్నప్పటికీ, అవి బోన్సాయ్ మొక్కలు, అపార్ట్‌మెంట్ భవనాలు, స్థానిక ఆచారాలతో కలిసిపోయి ఒక విలక్షణమైన శైలిని సంతరించుకున్నాయి. ‘పూర్ణమాణిక్యం ప్రేమకథలు’ ఒక కథను చెప్పడం కంటే, ఒక కథను క్రమపద్ధతిలో చెప్పడం ఎంత అసాధ్యమో వివరిస్తుంది. జీవితం ఒక వరుస క్రమం కాదు. అది ఒకదానిపై ఒకటి అల్లుకున్న, పరస్పర విరుద్ధ అనుభవాల సమాహారం. చదివిన తర్వాత మనలో మిగిలేది ఒక ‘నిశ్శబ్ద అశాంతి’. పూర్ణమాణిక్యం ప్రేమకథలు కొన్ని ప్రేమకథల సంకలనమో లేక ఒక మానసిక చిత్రణో మాత్రమే కాదు. ఇది జ్ఞాపకం, అస్తిత్వం, వాంఛ లాంటి అంశాలపై సాగే ఒక సాంద్రమైన, బహుళ పొరల తాత్విక చింతన.

బి. తిరుపతిరావు

94404 08982

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్.

Updated Date - Apr 06 , 2026 | 03:38 AM