తర్జుమాలే ఉద్యమంగా!
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:03 AM
పదిహేడేళ్ళ కుర్రాడు. చేతిలో చిన్న పుస్తకం. మైదానం. ‘‘లేచిపోయినానని ఎవరన్నా అంటే నా మనసుకెంతో కష్టంగా వుంటుంది’’. తొలి వాక్యమే కలవరపరచింది. నవల చదవడం పూర్తయింది. కకావికలైపోయాడా...
పదిహేడేళ్ళ కుర్రాడు. చేతిలో చిన్న పుస్తకం. మైదానం. ‘‘లేచిపోయినానని ఎవరన్నా అంటే నా మనసుకెంతో కష్టంగా వుంటుంది’’. తొలి వాక్యమే కలవరపరచింది. నవల చదవడం పూర్తయింది. కకావికలైపోయాడా కుర్రాడు. ఎవడీ చలం? కష్టపడి ఇరవై రూపాయలు సంపాదించాడు. టికెట్ ౧౬ రూపాయలు. మద్రాసు రైలెక్కాడు. వెతుక్కుంటూ తిరువణ్ణామలై చేరుకున్నాడు. కుర్చీలో కూర్చుని వున్నాడు గుడిపాటి వెంకటచలం. చిరునవ్వుతో పలకరింపు. నర్తకి, ఆ అపరిచితుడికి టవల్ యిచ్చి, స్నానం చేసి రండి అంది. పొద్దున మిగిలిన మూడు ఇడ్లీలూ పెట్టింది. నాలుగైదు రోజులు అక్కడే, చలం సమక్షంలోనే వుండిపోయాడు. తిరిగి వెళ్ళడానికి డబ్బుల్లేవు. చలమే తిప్పలు పడి టికెట్ డబ్బులు యిచ్చి పంపించాడు. హైదరాబాద్ వచ్చి ‘శశిరేఖ’, ‘జీవితాదర్శం’, ‘అరుణ’, ‘హంపీకన్యలు’... వరసబెట్టి చదివాడు. ముక్తవరం పార్థసారథి పుట్టాడు.
జీవితాదర్శం అంటే శాంతి అని ౬౫ సంవత్సరాల క్రితమే డిస్కవర్ చేశాడు. చదువు వినా మరో మార్గం లేదనీ తెలుసుకున్నాడు. చలం ‘యోగ్యతాపత్రం’ పరిచిన వెలుతురు దారిలో నడక మొదలెట్టాడు. చలం తన చేతికి యిచ్చిన ‘గీతాంజలి’ని శ్రద్ధగా చదువుకున్నాడు. గురుదేవుని నుంచి గురజాడ దాకా ప్రయాణం – ఒక ఉద్వేగంతో మొదలయింది. కన్యాశుల్కం నుంచి కారల్ మార్క్స్ దాకా కాలి నడక. టాల్‌స్టాయ్ ‘ఆనా కెరినినా’ ఒక కుదుపు కుదిపింది. సెర్వాంటిస్ ‘డాన్ కిహోటే’ అల్లకల్లోలం చేసింది. చెహోవ్ పిలిచాడు. గోగోల్ కన్నీళ్ళతో కబుర్లు చెప్పాడు. అటు ఉత్తేజపరిచిన భారతీయ సాహిత్యం, ఇటు సప్తసముద్రాలూ దాటించిన ఇంగ్లీషు లిటరేచర్ జ్ఞానానికి ద్వారాలను బార్లా తెరిచాయి. రాయాల్సిన సమయం ఆసన్నమైందని చిన్న వయసులోనే తెలిసొచ్చింది. ముక్తవరం పార్థసారథి మొదటి కథ ‘స్వయంకృతాపరాధం’ ౧౯౫౯లో గోల్కొండ పత్రికలో వచ్చింది. నాటి నుంచి ౨౦౨౦ సంవత్సరం దాకా ఆయన రాస్తూనే వున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగం చేస్తూ, ఇద్దరు కొడుకుల్ని చదివిస్తూ, భార్య వసంతతో కలిసి కుటుంబ బాధ్యత మోస్తూ అరవై సంవత్సరాలు రాస్తూ, అనువాదాలు చేస్తూ వుండడం ఒక అరుదైన ఫీట్. పది నవలలు రాశారు. ఆయన మాగ్నం ఓపస్ ‘శూన్యం’. పార్థసారథికి బాగా నచ్చిన నవల కూడా అదే. బతుకులోని వేదననీ, విషాదాన్నీ, కన్నీటినీ, వోటమినీ దిగులు అక్షరాలుగా మన ముందు పరవడంలో స్పెషలిస్టు. ఆయన ‘రంగుల వల’ నాకు చాలా ఇష్టమైన నవల అన్నారు డాక్టర్ జంపాల చౌదరి. ‘‘నా ‘రంగుల వల’ థీమ్ ఫ్యామిలీ, అన్‌హేపీనెస్... అది నా పర్మినెంట్ థీమ్’’ అన్నారు ముక్తవరం.
చలం అప్పుడెప్పుడో వరవరరావుకి రాసిన వుత్తరంలో, వీలైతే పార్థసారథి అనే కుర్రాణ్ణి కలవరాదూ అని కోరారు. ‘శూన్యం’ నవలకి రాసిన ముందుమాటలో ‘‘పార్థసారథి నాకు చలం యిచ్చిన మిత్రుడు’’ అన్నారు వరవరరావు. ముక్తవరం చనిపోయారని తెలిశాక, వరవరరావు రాసిన వ్యాసంలో, ‘‘ఆయన పుస్తకాల చదువు దాహం, ఆ చదివింది నలుగురికీ చెప్పాలనీ, రాయాలనీ వెంటాడిన తపన, ఆయన దగ్గరికి ఎప్పుడూ పోవాలనే స్నేహాన్ని నిలబెట్టింది,’’ అన్నారు. ‘కించిద్విషాదం’, ‘మనసులోని చలి’, ‘పర్‌ఫెక్ట్–౨౭’, ‘నువ్వూ నేనూ చిన్నారావు’ ముక్తవరం రాసిన మంచి నవలలు. మానసిక సంఘర్షణ అనే అంతర్లోకపు కల్లోలానికి అక్షరరూపం ఇవ్వడం చేతనైనవాడు. Anxiety riddled life is a curse... not all wounds are physical.
ధూళి ఆకాశానికి ఎగిరినా విలువ పెరగదు. జ్ఞానం లేని యాత్రికుడు రెక్కలు లేని పక్షి అని తొలినాళ్ళలోనే గ్రహించిన పార్థసారథి కథలు ‘మిణుగురులు’ చదివి తీరాలి. నవలలూ కథలే కాకుండా, ప్రపంచ సాహిత్యంలో బాగా నచ్చిన వాటినీ, అందరూ చదవాల్సిన వాటినీ తెలుగులోకి తెచ్చారు ఒక కఠోరమైన క్రమశిక్షణతో! అంతర్జాతీయ రచనల్లో అత్యుత్తమ కథగా తరతరాల పాఠకుల ప్రశంసలు అందుకున్న టాల్‌స్టాయ్ ‘డెత్ ఆఫ్ ఇవాన్ ఇలిచ్’ని ‘మరణోపనిషత్’ పేరుతో తర్జుమా చేశారు. ‘వార్ అండ్ పీస్’ కంటే ‘ఆనా కెరినినా’ అంటే ఆయనకి ప్రేమ. ‘‘రచయితలందరూ నోబెల్ ప్రైజ్ అందుకోవడమే ఒక శిఖరారోహణ అనుకుంటారు. నోబెల్ ప్రైజ్ అందుకోలేనంత మహానుభావుడు టాల్‌స్టాయ్,’’ అన్నారు ముక్తవరం.
మన చిటికెన వేలు పట్టుకుని సాహిత్య లోకవిహారానికి తీసుకువెళ్ళే కరుణ నిండిన తండ్రి ముక్తవరం పార్థసారథి. సూటిగా, గుచ్చుకునేలా మాట్లాడతాడు. మనల్ని షాక్ చెయ్యడానికో, ఎంటర్‌టైన్ చెయ్యడానికో నవ్వించడానికో ప్రయత్నించడు అసలు. ఒక పూట గనక ఆయనతో గడిపితే, మనం ఇంకా పెరటి బావిలోనే వున్నామనీ, ఒక మహాసముద్రాన్ని మిస్సయ్యామనీ ఇట్టే తెలిసొస్తుంది. అయ్యో, ముక్తవరం పార్థసారథి చనిపోయారా! అని మనం ఆశ్చర్యపోనవసరం లేదు. దిగులూ పడనక్కర లేదు. ప్రపంచ సాహిత్యాన్ని కాకపోయినా, కనీసం ముక్తవరం రచనలు, అనువాదాలూ కూడా చదువుకోలేదే అని దిగులుపడాలి. ఆయన రాసిన మొత్తం ౬౯ పుస్తకాలూ అందుబాటులో వున్నాయి. హెచ్.బి.టి., పీకాక్, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవచేతన, మైత్రి, విరసం, నవోదయ... అందరూ పార్థసారథి పుస్తకాలు పబ్లిష్ చేశారు.
అమెరికా అవతరణ కోసం మూలవాసులైన రెడ్ ఇండియన్లను క్రూరంగా హతమార్చిన మహామానవ విషాదాన్ని డీ బ్రౌన్ ‘బరీ మై హార్ట్ ఎట్ వూండెడ్ నీ’ అని రక్తాక్షరాలతో రాస్తే, ‘నరహంతలు ధరాధిపతులై’ అని ముక్తవరం అనువదించారు. ప్రసిద్ధి చెందిన జాక్ లండన్ ‘ఐరన్ హీల్’ని ‘ఉక్కు పాదం’ అని తర్జుమా చేశారు. జాక్ లండన్‌దే ‘వైట్ ఫాంగ్’, టాల్‌స్టాయ్ ‘హాజీ మురాద్’, ఇసబెల్లా అలెండీ ‘డాటర్ ఆఫ్ ఫార్చ్యూన్’, రిచర్డ్ బాక్ ‘సీగల్’, చెహోవ్, గోగోల్ కథల్ని సరళ సుందరమైన తెలుగు వాక్యంతో మనకి అందించారు. ౩౫మంది నోబెల్ బహుమతి గ్రహీతల కథలతో, వాళ్ళ పరిచయాలతో ఆయన రాసిన ‘నోబెల్ తారలు’ అమూల్యమైన కాంట్రిబ్యూషన్‌గా నిలిచిపోతుంది. మూడు భాగాల ‘నవలా లోకం’లో ప్రపంచ ప్రసిద్ధ నవలల్ని పరిచయం చేశారు. షేక్‌స్పియర్ కథలు, విశ్వకథా శతకం, ‘పగిలిన అద్దం’ లాంటివి చదివితే, ఒక జ్ఞాన సముద్రాన్ని యీదినట్టే! ఒక నిజాన్ని కొంచెం మొరటుగా చెప్పుకోవాలంటే, గుడిపాటి వెంకట చలం – కార్ల్ మార్క్స్‌కి పుట్టిన అక్రమ సంతానంలో అగ్రజుడు ముక్తవరం పార్థసారథి. వామపక్ష భావజాలంతో ప్రభావితుడైన ఈ మంచి రచయిత కారల్ మార్క్స్ రచనల్ని లోతుగా అధ్యయనం చేశాడు. విషాదభరితమైన మార్క్స్ వ్యక్తిగత జీవితం, సౌందర్యరాశి అయిన భార్య జెన్నీ వాన్ వెస్టఫాలెన్‌తో కష్టాల కొలిమిలో కలిసి నడిచిన– ఇంతవరకూ పాఠకులకు తెలియని– కుటుంబ జీవితాన్ని ‘Love and Capital’ పేరుతో మేరీ గాబ్రియెల్ రాశారు. దానిని ‘ప్రేమ – పెట్టుబడి: కార్ల్, జెన్నీ మార్క్స్ విప్లవం చిగురించిన వేళ’ అని శ్రమకోర్చి ముక్తవరం అనువదించారు. ఆ ౫౫౦ పేజీల పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ ౨౦౧౬లో ప్రచురించింది. ‘‘పిల్లలూ... కమ్యూనిజాన్ని తెలుసుకుందామా..’’ బిని అడమ్ జాక్ జర్మన్ పుస్తకాన్ని సంక్షిప్తంగా పార్థసారథి మనకందించారు. ‘‘లోపల గడ్డకట్టిన సముద్రాన్ని పగలగొట్టే గొడ్డలి కావాలి పుస్తకం’’ అన్న కాఫ్కా మాటల్ని ఇష్టంగా గుర్తు చేస్తారు ముక్తవరం. కాఫ్కా లోకం ఎవరికీ అంతుబట్టదు అంటారాయన. పాబ్లో నెరుడా కవిత్వం వినడానికి లక్షమంది వచ్చేవారనీ, రాచరిక వ్యవస్థ కూలిపోనందుకు బాల్జాక్ గుండెలవిసేలా విలపించాడనీ చెబుతాడు. జీవితాంతమూ చదివీ, రాసీ సాహిత్య తపస్సిద్ధి పొందిన ఈ జ్ఞాని, తెలంగాణ నల్గొండ జిల్లా భువనగిరిలో ౮౨ఏళ్ళ క్రితం పుట్టారు. చదువులేని సమాజాన్ని చూసి కలత చెందారు. అవార్డులూ, సన్మానాలని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ‘‘రైటింగ్ అనేది పార్ట్ ఆఫ్ యువర్ కేరెక్టర్ కావాలి’’ అన్నాడు. ఎలా అయినా సెర్వాంటిస్ డాన్ కిహోటేని తెలుగులోకి తేవాలని తపించాడు. ఆ కోరిక తీరకుండానే, చిట్టచివరి కల నెరవేరకుండానే మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. దేహాన్ని మెడికల్ కాలేజికి, జీవితాన్ని ఉత్తమ సాహిత్యానికీ డొనేట్ చేసిన ధన్యుడు ముక్తవరం పార్థసారథి.
తాడి ప్రకాష్
97045 41559
ఇవి కూడా చదవండి..
ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్
మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ