Share News

విదేశీ హస్తంపై అప్పుడూ ఇప్పుడూ అదే గోల!

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:43 AM

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్వోన్నత నాయకుడు మోహన్‌ భగవత్‌ ఆచితూచి మాట్లాడుతారు. వర్తమాన భారతీయ ప్రజా జీవితంలో ప్రభావశీల, ప్రాబల్య రాజకీయ, సైద్ధాంతిక శక్తిగా ఉన్న...

విదేశీ హస్తంపై అప్పుడూ ఇప్పుడూ అదే గోల!

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్వోన్నత నాయకుడు మోహన్‌ భగవత్‌ ఆచితూచి మాట్లాడుతారు. వర్తమాన భారతీయ ప్రజా జీవితంలో ప్రభావశీల, ప్రాబల్య రాజకీయ, సైద్ధాంతిక శక్తిగా ఉన్న సంఘ్‌ పరివార్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ ప్రాధాన్యం, అంతకుమించి గౌరవం ఉంది. ఈ కారణంగానే భగవత్‌ తాజా హెచ్చరిక నిశిత పరిశీలనకు అర్హమైనది. నాగపూర్‌లో వార్షిక దసరా ఉపన్యాసాన్ని వెలువరిస్తూ ‘పాశ్చాత్య ప్రపంచం నుంచి ఒక తుఫాను వచ్చిందనీ, అది మన సమస్త సాంస్కృతిక వ్యవస్థలను, మర్యాదలను, సంస్కారాలను రూపుమాపుతోందనీ; ఫ్రాన్స్‌, అల్బేనియా బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలలో ఇటీవల సంభవించిన సంఘటనల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నదని, భారత్‌నూ అస్థిరపరచడాన్ని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయని భగవత్‌ హెచ్చరించారు.

మన దేశానికి విదేశీ శక్తుల నుంచి ముప్పు ముంచుకొస్తుందన్నదే భగవత్‌ హెచ్చరిక సారాంశం. అయితే అందుకు రుజువులు ఏవీ? ఎక్కడ ఉన్నాయి? ఆ కుటిల విదేశీశక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారి పేర్లనూ ఆయన వెల్లడించలేదు. విదేశీకుట్రలు, కుహకాలను నిర్ధారించే ఎటువంటి డాక్యుమెంట్లనూ ఆయన బహిర్గతం చేయలేదు. దేశీయ ఆందోళనకారులకు విదేశీ శక్తుల నుంచి నిధులు అందుతున్న జాడ కూడా లేదు. ఆయన కేవలం ఒక ఆరోపణ చేశారు. దేశంలో, ముఖ్యంగా యువ భారతీయులలో నెలకొన్న అశాంతికి ఒక సాకును మాత్రమే అది ప్రతిపాదించింది. క్షమించండి భగవత్‌ గారూ, మీరు ఈ విషయంలో ఘోరంగా పొరపడ్డారు.. భారత్‌ ఏమిటి? అది ఫ్రాన్స్‌ కాదు, నేపాల్‌ కాదు, బంగ్లాదేశ్‌ కాదు, లేదా మీ జాబితాలో ఉన్న మరే దేశమూ కాదు. ప్రతి సమాజమూ తన సొంత రాజకీయ గతిశీలతను, సామాజిక ఉద్రిక్తతలను, నిరసనలను అనివార్యం చేసిన తక్షణ కారణాలను కలిగి ఉంటుంది. ఒక దేశంలో సంభవించిన వీధి నిరసనలు మరో దేశంలో, ముఖ్యంగా అపార వైవిధ్యత ఉన్న సువిశాల భారతదేశంలో యథాతథంగా పునరావృతం కావు, కాబోవు. విభిన్న దేశాలలోని నిరసనల తీరుతెన్నులే వాటన్నిటి వెనుక ఒక ఉమ్మడి విదేశీ కుట్ర ఉన్నదని సూచించడం కాకతాళీయతను కారణత (కార్యకారణ సంబంధం)గా గందరగోళపడటమే అవుతుంది.


‘విదేశీ హస్తం’ మనకు అపరిచితమైనదా? కానేకాదు. దానికి దశాబ్దాల చరిత్ర ఉన్నది. మన ప్రభుత్వాలు ముఖ్యంగా ఇబ్బందికరమైన వాస్తవాలను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నప్పుడు ప్రజలను విదేశీశక్తులు రెచ్చగొడుతున్నాయని ఆరోపించడం పరిపాటిగా ఉన్నది. రాజకీయ అసమ్మతిని సహేతుకంగా వివరించడం అసాధ్యమైపోయినప్పుడు పాలకులకు ఆత్మపరిశీలన చేసుకోవడానికి బదులు తమను అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆక్రోశించడం మన రాజకీయాలలో సర్వసాధారణ విషయమై పోయింది. 1970లలో ఇందిరాగాంధీ పాలనను గుర్తు చేసుకోండి. ప్రజాందోళనలను, రాజకీయ వ్యతిరేకతను విదేశీ జోక్యం అనే అద్దంలోనే చూడడం జరిగేది.

వర్తమానానికి వద్దాం. కేవలం కొద్ది నెలల క్రితమే నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ వివాదంపై ప్రభుత్వ ప్రతినిధులు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)తో చర్చలు జరిపారు. ఇప్పుడు అదే జెన్‌జీ నాయకత్వంలో జరుగుతోన్న నిరసన ఉద్యమాన్ని విదేశీ కుట్ర కోణంలో చూస్తున్నారు మారిందేమిటి? సీజేపీకి విదేశీ శక్తుల నుంచి నిధులు అందుతున్నాయని ధ్రువీకరించే రుజువులు లభించాయా? లేక రాజకీయ లబ్ధికి తోడ్పడే ‘విదేశీ హస్తం’ సిద్ధాంతం తిరుగులేనిదిగా ఉపయోగపడుతున్నదా?

మోహన్‌ భగవత్‌కు, ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న: విదేశీ నిధులతో జరుగుతోన్న కుట్రలో ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి ఉద్యమకారులు, వీధి నిరసనకారులు భాగస్వాములు అయితే ఆ విషయాన్ని ఎందుకు నిరూపించరు? భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో శక్తిమంతమైన దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. చట్టవిరుద్ధమైన విదేశీ నిధులకు విశ్వసనీయమైన నిదర్శనాలు ఉన్నా, లేదా దేశాన్ని అస్థిరత్వం పాలు చేసేందుకు ఒక సమన్వయపూర్వక ప్రయత్నం జరుగుతున్నట్టు రుజువులు ఉన్నా, నిజానిజాల నిర్ధారణ చేసే బాధ్యతను దర్యాప్తు సంస్థలకు అప్పగించాలి. దర్యాప్తులో దోషులుగా రుజువయినవారిపై చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలి.


భగవత్‌ వాదనతో సమస్యేమిటంటే అసమ్మతికి దారితీసిన దేశీయ కారణాలను అది అలక్ష్యం చేస్తున్నది. సీజేపీ ఒక రాజకీయ శూన్యంలో ఆవిర్భవించలేదు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌లపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ‘నిరుద్యోగ’ యువత తీరుతెన్నులపై భారత ప్రధాన న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యతో మరింత అధికమైన సందర్భంలో సీజేపీ ప్రభవించింది. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ప్రక్రియలు, ఆ రాజ్యాంగ సంస్థ అత్యున్నత అధికారుల మధ్య విభేదాలపై ఒక జాతీయ దినపత్రికలో వెలువడిన ఒక పరిశోధనాత్మక వార్తా కథనం లేవనెత్తిన ప్రశ్నలే రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న ‘ఓట్‌ చోరీ’ ఉద్యమానికి ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. ఇవి స్పష్టంగా గుర్తించదగిన దేశీయ పరిణామాలు. వీటిపై నిశిత పరిశీలనతో కూడిన చర్చ జరగవలసి ఉన్నది. దీనిపై శ్రద్ధ చూపకుండా నిరసనలు ఒక విదేశీ కుట్రలో భాగమని కొట్టివేయడం అవి లేవనెత్తిన ప్రశ్నలను సహేతుకంగా ఎదుర్కోవడాన్ని తప్పించుకోవడమే అవుతుంది.

నిరుద్యోగం, అవినీతి, పరీక్షల్లో అక్రమాలు, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి క్షీణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు విదేశీ శక్తుల ప్రోద్బలం ప్రజలకు అవసరం లేదు. తమ భవిష్యత్తు గురించి కలవరపడేందుకు యువతకు దేశ సరిహద్దుల ఆవల నుంచి ఆదేశాలు అవసరం లేదు. ప్రజల్లో రాజకీయ అసంతృప్తి ఉన్నది, సందేహం లేదు. అది తరచూ వీధుల్లో నిరసన ప్రదర్శనలుగాను, కించిత్‌ హింసాత్మకంగాను వ్యక్తమవుతోంది. అయినంత మాత్రాన రాజకీయ అసంతృప్తి అనేది న్యాయ విరుద్ధమెలా అవుతుంది? శాంతియుతమైన నిరసనల చట్టబద్ధత నిరాకరించేందుకు, ఆందోళనలకు వ్యతిరేకంగా చేపట్టిన కఠిన చర్యలను సమర్థించుకునేందుకు విదేశీ–హస్తం కథనాలను ప్రభావశీలంగా ఉపయోగించుకోవచ్చు. చట్టవిరుద్ధ కార్యకలాపం, న్యాయసమ్మతమైన నిరసన మధ్య భేదాన్ని గుర్తించే విచక్షణను చూపడమే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ సార్థకత. చట్టాలను ఉల్లంఘించి నిరసనకారులకు విదేశీ శక్తుల నుంచి చట్ట విరుద్ధంగా నిధులు అందుతున్నట్టు రుజువులు ఉంటే వాటిని ప్రజలకు బహిర్గతపరచాలి. న్యాయవిహితమైన అసమ్మతిని కుట్రలు, కుహకాలకు నిదర్శనంగా భావించడం ప్రజాస్వామ్య స్వాభావిక లక్షణం ఎంతమాత్రమూ కాదు.


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పౌరుడు జాతిని వ్యతిరేకించకుండానే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించగలుగుతాడు; ఒక విద్యార్థి ఒక కుట్రలో భాగస్వామి కాకుండానే పరీక్షా విధానాన్ని ప్రశ్నించగలుగుతాడు; ప్రతిపక్ష నాయకుడు ఒకరు రాజ్య వ్యవస్థకు విరోధి కాకుండానే ఎన్నికల సంఘాన్ని సవాల్‌ చేయగలుగుతాడు. నిజానికి అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే స్వేచ్ఛ ఉండటమనేది– ఎటువంటి మినహాయింపులు లేకుండా సందేహరహిత విధేయతను డిమాండ్‌ చేసే పాలనా వ్యవస్థ నుంచి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని వేరుపరుస్తుంది, విశిష్టం చేస్తుంది.

ఆందోళనకారులకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయన్న విషయాన్ని చర్చిస్తున్నాం కదా. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు సమకూరుతున్న నిధుల విషయంలో మరింత పారదర్శకత ఉండాలన్న ప్రతిపాదనను, బహుశా, భగవత్‌ సైతం స్వాగతిస్తారని భావిస్తాను. సంఘ్‌ సామాన్య సంస్థ కాదు. శాఖలు, కార్యకర్తలు, కార్యకలాపాల పరంగా చాలా విస్తృతమైన సంస్థ అది. అటువంటి సంస్థ దైనిక కార్యకలాపాలకు సైతం ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండితీరాలి. సంఘ్‌కు ఆ ఆర్థిక కలిమి, బలిమి ఎలా లభిస్తోంది? తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుని చట్టబద్ధంగా నిధులు సమీకరించుకునే హక్కు ఆరెస్సెస్‌కు ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఇతర సంస్థలు నిధులు సమకూర్చుకోవడంలో పాటించి తీరాలని నిర్దేశిస్తున్న పారదర్శకతా ప్రమాణాలు ప్రతి ఒక్క సంస్థకూ వర్తిస్తాయా లేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

చివరగా ఒక చారిత్రక జ్ఞాపకాన్ని ప్రస్తావిస్తాను. 1973–74లో నరేంద్ర మోదీ ఒక యువ కార్యకర్త. గుజరాత్‌ నవ్‌ నిర్మాణ్‌ ఉద్యమం చెలరేగిన కాలమది. వీధి రాజకీయాలు ప్రప్రథమంగా నరేంద్ర మోదీ అనుభవంలోకి వచ్చిన సందర్భమది. గుజరాత్‌ పాలనా వ్యవస్థలో అవినీతిని ఎండగట్టిన ఆ ఉద్యమం అంతిమంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కారణమయింది. ఆ ఉద్యమంలో పాల్గొన్న అసంఖ్యాక యువజనులను విదేశీ నిధులు అందుకున్న విద్రోహులు అని యువ మోదీ ఆక్షేపించారా? ఆ ఉద్యమ లక్ష్యాలకు బాహ్యశక్తులు ఏవైనా మద్దతునివ్వడం జరిగి ఉంటే, ఆ యువ ఆందోళనకారుల డిమాండ్లు తక్కువ చట్టబద్ధమైనవి అవుతాయా?


సరళమైన విషయమిది. ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయ విధేయతలూ మారుతాయి. అయితే నిరసన తెలిపే హక్కు అనేది నిరసనకారులు అధికారంలో ఉన్నవారికి మద్దతుదారులై ఉండటంపై ఆధారపడి ఉండదు, ఉండకూడదు. కనుక భగవత్‌ గారూ, భారతీయ యువజనులు వీధుల్లో కదను తొక్కుతున్నంత మాత్రాన భారత ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ప్రమాదమేమీ లేదు. అధికారంలో ఉన్నవారు ఆందోళనలకు దిగిన యువజనుల డిమాండ్లను మనసు పెట్టి వినడం ఆపివేయడమే అసలైన పెద్ద ప్రమాదం. ఇది భారత ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. యువజనుల నిరసనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయాన్ని శోధించే ముందు, పోరాటపథంలోకి ప్రవేశించేందుకు మన యువతను పురిగొల్పిన దేశీయ పరిస్థితులను నిష్పాక్షికంగా తరచి చూడడమే ఇప్పుడు చాలా ముఖ్యం.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:44 AM