Share News

మోదీపై బద్ధ వ్యతిరేకత ఇంకా రాలేదు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:59 AM

తరువాత ఏమిటి? నిరసనల వెల్లువలో ఉన్న మనం ఇకపై ఏం చేయాలి? బెంగాలీ మార్కెట్‌లో కూర్చుని, ఏమంత రుచిగా లేని కాఫీ తాగుతూ నాలో నేను నిశితంగా, లోతుగా తర్కించుకున్నాను. ఈ ప్రశ్న...

మోదీపై బద్ధ వ్యతిరేకత ఇంకా రాలేదు!

తరువాత ఏమిటి? నిరసనల వెల్లువలో ఉన్న మనం ఇకపై ఏం చేయాలి? బెంగాలీ మార్కెట్‌లో కూర్చుని, ఏమంత రుచిగా లేని కాఫీ తాగుతూ నాలో నేను నిశితంగా, లోతుగా తర్కించుకున్నాను. ఈ ప్రశ్న అడిగేందుకు ఇది సందర్భోచిత సమయం కూడా. అక్టోబర్‌ 12న డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా వర్ధంతి. ఆయన చెప్పిన ఒక సత్యాన్ని మనం విస్మరించకూడదు. అదేమిటంటే ‘ఒక సజీవ ప్రజా సమూహం ఐదు సంవత్సరాలు వేచి ఉండదు’ అని. పోలీసులు గత పదిరోజులలో ఐదుసార్లు నన్ను నిర్బంధించారు– పట్టుకున్నారు, లాక్కెళ్లారు, నెట్టివేశారు, పోలీస్‌వ్యాన్‌లోకి విసిరివేశారు. ఎందుకు? భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపినందుకు!

సుప్రీంకోర్టు దాకా సాగిన నిరసన ప్రదర్శనలో పాల్గొని మేము వెనక్కు వచ్చి బెంగాలీ మార్కెట్‌లో కూర్చుని కాఫీ సేవనంలో సేదతీరిన సందర్భమది. న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కాదు అది. న్యాయస్థానాలపై ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా ఎంతమాత్రం కాదది. గత వారాంతంలో ఢిల్లీ వీధులలో అభాసుపాలైన సుప్రీంకోర్టు గౌరవాన్ని ఉద్ధరించేందుకు జరిగిన ప్రయత్నమే ఆ నిరసన ప్రదర్శన. అడుగడుగునా కర్ఫ్యూ అమల్లో ఉన్న జాతీయ రాజధానిలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఈ దేశ పౌరులుగా మాకు హక్కు ఉన్నదనే సత్యాన్ని చాటి చెప్పేందుకు నిర్వహించిన నిరసన అది. ఎటువంటి క్షణమది? ఒక భీతావహ పరిస్థితిని మేము చవి చూశాము.

సరే, తదుపరి చర్య ఎలా ఉండాలి? సీఈసీ వ్యతిరేక ఉద్యమం విస్తరించాల్సి ఉన్నది– భౌగోళికంగా, సామాజికంగా. ఆసేతుహిమాచలం అన్ని ప్రాంతాలకు ఈ ఉద్యమాగ్ని వ్యాపించాలి. సమస్త సామాజిక శ్రేణులూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. వీధులలో రోజూ యథావిధిగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ కొన్ని కొత్త కార్యాచరణ పద్ధతులను రూపొందించుకోవాలి. వ్యవస్థాగతంగా ఒత్తిళ్లు తీసుకువచ్చేందుకు తోడ్పడే అంశాలను గుర్తించాలి. ఉపయోగించుకోవాలి. నిరసన వ్యూహమూ, ఎత్తుగడలు రూపొందించుకుంటూ గమ్యమూ, దాన్ని చేరే మార్గాన్ని అర్థం చేసుకోవడం లక్ష్య సాధనకు విశేషంగా తోడ్పడగలదు.


రాజనీతి శాస్త్రవేత్త సుహాస్‌ పల్షీకర్‌ ప్రస్తుత నిరసనలను ‘పునర్‌ ప్రజాస్వామ్యీకరణ’గా అభివర్ణించారు. నిర్వీర్యమైన పలు రాజ్యాంగ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు అదొక మార్గమని ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన (నేను తరచూ పేర్కొనే) ‘ప్రజాస్వామ్యాన్ని స్వాధీనం చేసుకోవడం’ అనే దుష్ట ప్రక్రియ పర్యవసానాలే మన రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యాలు. చిత్రమేమిటంటే ‘ప్రజాస్వామ్యాన్ని స్వాధీనం చేసుకోవడం’ అనేది పూర్తిగా ప్రజాస్వామిక పద్ధతులలోనే జరిగింది. ఇందుకొక కీలక ఉపకరణం ‘ఎన్నికలపై గుత్తాధిపత్యాన్ని సాధించడం’. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కొత్త నిబంధనలతో ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా వ్యవహరించేలా చేసుకోవడం సంభవించింది. సరే, దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీని దుర్వినియోగపరచడం ఉండనే ఉంది. తుదకు ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), నియోజకవర్గాల పునర్విభజన, ఒక దేశం–ఒకే ఎన్నిక మొదలైన వాటితో ఎన్నికల వ్యవస్థను ఎటువంటి మినహాయింపు లేకుండా స్వాయత్తం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి శాశ్వత మెజారిటీ లభించేలా చేసేందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదిగో ఈ దుర్మార్గ, రాజ్యాంగ విరుద్ధ పన్నాగాలకు వ్యతిరేకంగానే ప్రస్తుత నిరసనలు ప్రజ్వరిల్లాయి.

ఎన్నికల సమగ్రత పునరుద్ధరణకే ఈ నిరసనలు. ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధంగా అమలు కావాలన్నదే వాటి ఏకైక లక్ష్యం. నిరసనకారులకు ఉమ్మడిగా ఒక అధికారిక ప్రణాళిక లేకపోయినప్పటికీ మూడు డిమాండ్ల విషయంలో వారి మధ్య పూర్తి ఏకీభావం ఉన్నది. వాటిలో మొదటిది– సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా లేదా అభిశంసన. భారత ఎన్నికల సంఘం పనితీరు రాజ్యాంగబద్ధంగా ఉండేలా చేసి, దాని విశ్వసనీయతను పునరుద్ధరించే దిశగా ఇదొక ప్రతీకాత్మక చర్య. రెండవది– ‘సర్‌’ ఉపసంహరణ. తద్వారా, ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద ఓట్ల తొలగింపును నిరర్థకం చేయడం. మూడవది– ఎన్నికల సంఘం కమిషనర్లుగా ఎవరినైనా నియమించేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిర్నిబంధ అధికారాలను ఇచ్చిన ‘ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు, పదవీ కాలం) చట్టం–2023’ రద్దు.

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరగాలన్న ఆకాంక్షే ఈ డిమాండ్లకు ప్రాథమిక ప్రేరణ. కనీసం, 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్నికల మాదిరిగా భారత పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయవిహితంగా జరగాలని ‘సర్‌’ వ్యతిరేక ఆందోళనకారులు ఆశిస్తున్నారు. అంతకు తక్కువగా ఏదీ వారికి ఆమోదయోగ్యం కాదు, కాబోదు.


ఈ నిరసనలు ఎన్నికల సమగ్రత పునరుద్ధరణకే గానీ ‘పాలన మార్పు’ (రెజిమ్‌ ఛేంజ్‌) కోసం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. నిరసనల వెనుక ఉన్న వివిధ శక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెన్వెంటనే దిగిపోవాలని కోరుకుంటూ ఉండవచ్చుగానీ సామాన్య పౌరులను అసంఖ్యాకంగా వీధులలోకి తీసుకువచ్చింది మోదీ పట్ల బద్ధ వ్యతిరేకత కానేకాదు. ఇంతవరకు అటువంటి వ్యతిరేక భావం ప్రజల్లో లేదు. ప్రజాస్వామికంగా, శాంతియుతంగా అధికార బదిలీకి వెసులుబాటు నిచ్చే న్యాయబద్ధమైన వ్యవస్థ పునరుద్ధరణ లక్ష్యమే సామాన్యులను ఆందోళనా పథంలోకి నడిపిస్తోంది. ఇప్పటికైతే ఇదే సత్యం. వారి లక్ష్యం ప్రజాస్వామికమైనది. అది నెరవేరి తీరాలి. అది నెరవేరేందుకు దోహదం చేసే మార్గాలు అన్నీ మూసుకుపోతే జరిగేదేమిటి? ప్రస్తుత ఆందోళనలు పాలన మార్పునకై ప్రజా తిరుగుబాటుగా పరిణమిస్తాయి. అదే సంభవిస్తే పౌరులు, వ్యవస్థలు భారీ మూల్యం చెల్లించవలసిరావడం అనివార్యమవుతుంది. ఇటువంటి స్థితిని ఊహించడమే భీతావహం గొల్పుతోంది.

నిరసనలను ముందుకు తీసుకుపోయేందుకు ప్రజాస్వామిక శక్తుల, మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ ఆందోళనలలో పాల్గొంటున్న శక్తుల పునర్వ్యవస్థీకరణ ఎంతైనా అవసరం. ఇప్పటివరకు ఈ నిరసనలు ‘స్వతస్సిద్ధ సమన్వయం’కు ఒక ప్రామాణిక ఉదాహరణగా ఉన్నాయి. ఒక ప్రధాన వ్యక్తి లేదా సంస్థ ఆదేశం లేదా కీలక సమన్వయం లేకుండానే క్రమబద్ధమైన సామూహిక కార్యాచరణగా ఈ నిరసనలు అయత్నకృతంగా రూపుదాల్చాయి. నిరసనలలో పాలుపంచుకుంటున్న భిన్న శక్తులు పరస్పరం ప్రతిస్పందించుకుంటున్నప్పుడు వారి కార్యాచరణలు ఎటువంటి ఉద్దేశపూర్వక ప్రణాళిక లేకుండానే ఏకీకృతమవుతాయి. ‘బాధ్యతాయుత పౌరులు’ (ఈ వ్యాసకర్త కూడా వీరిలో ఒకరు) ఇచ్చిన పిలుపూ ఆందోళనా శక్తుల స్వతస్సిద్ధ సమన్వయానికి దారితీసింది. మా పిలుపుతో అక్టోబర్‌ 2 నుంచి 4 వరకు ప్రజలు వీధులలోకి వచ్చి ఉవ్వెత్తున నిరసన తెలిపారు. అక్టోబర్‌ 10న జరిగిన ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చింది. ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు అక్టోబర్‌ 6 నుంచి 12 దాకా ప్రతిరోజూ ఆందోళనలు నిర్వహించాయి. ఇవేవీ సమన్వయ నిర్ణయాలతో జరిగినవి కావు. అయితే వాటన్నిటి ఉమ్మడి ఫలితం ఒక వాద్య సమ్మేళనం ప్రభావాన్ని లేదా ఒక రిలే రేస్‌ను తలపించాయి. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను ఒక విలక్షణ సామూహిక స్ఫూర్తితో నిర్వహించారు.


నిరసనకారుల డిమాండ్లను కించిత్‌ కూడా అంగీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆందోళనకారులు తమ ప్రయత్నాలను మరింతగా సమన్వయం చేసుకునే మార్గాన్ని కనుగొనాలి. సీజేపీ, ఇండియా కూటమి, విద్యార్థి, యువజన సంఘాలు, పౌర సమాజ సంస్థలు ఒకే ఛత్రం కిందకు రాకపోవచ్చు, రావాల్సిన అవసరం కూడా లేదు. అయితే అవి పరస్పర విరుద్ధ లక్ష్యాలతో పనిచేయకుండా ఉండాలి. తమ శక్తి సామర్థ్యాలను ఎట్టి పరిస్థితులలోను ఒకరు మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదు. ఈ విషయంలో అందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉంటారని నమ్మేందుకు ఆస్కారం నిండుగా ఉన్నది. ఇందుకు కారకుడు రాహుల్‌గాంధీ. ఆందోళనలు వేర్వేరుగా లేదా సమాంతరంగా జరగవని, అన్నీ ఒకే ఆందోళనగా జరుగుతాయని ఆయన స్పష్టంగా చెప్పారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్న విభిన్నశక్తులు అన్నిటిలోనూ ఈసారి ఒక మౌలిక మార్పు చోటుచేసుకున్నది. ఇది ఆ శక్తుల పునర్వ్యవస్థీకరణను సుసాధ్యం చేయగలుగుతుంది. ఈ పునర్వ్యవస్థీకరణ సుసాధ్యమవడం పైనే ఈ ఉద్యమ విజయం ఆధారపడి ఉన్నది. తమకు తాముగా సుసంఘటితమైన నిరసనకారుల (గత జూలైలో నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమించినవారు) శక్తి సామర్థ్యాలు ప్రస్తుత ఉద్యమ సాఫల్యతకు చాలా కీలకం. ఈ యువ నిరసనకారులు ఏ సంస్థకూ నిబద్ధమైనవారు కారు. ప్రస్తుత ఉద్యమ నిర్వహణలో పరస్పర విరుద్ధ సంకేతాలు కనిపిస్తే లక్ష్య సాధనలో వారి ఉత్సాహం సన్నగిల్లిపోయే ప్రమాదమున్నది. ఉద్యమ సారథులు ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. ఒక సంస్థ లేదా ఒక రాజకీయ పక్షం నేతృత్వంలో జరిగే ఉద్యమం కంటే పార్టీలు, సంస్థలు సంపూర్ణ మద్దతునిస్తున్న పౌరుల ఉద్యమంగా ప్రస్తుత ఉద్యమం కొనసాగాలని ఆ యువజనులు అభిలషిస్తున్నారు.

నా ఆలోచనా ప్రవాహం ఇంతటితో ఆగిపోయింది. నేను తాగుతున్న ఆ ‘మెషీన్‌ కాఫీ’ అయిపోయింది. దక్షిణ భారతీయ ఫిల్టర్‌ కాఫీ మినహా మరే కాఫీకీ ఆర్డర్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. జ్ఞానేశ్‌ కుమార్‌ ఎన్నికల సంఘం నుంచి నిష్క్రమించేంతవరకు నేనూ ఈ నిర్ణయం నుంచి వైదొలగను.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలూ చదవండి

రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 15 , 2026 | 01:59 AM