‘భీమ’ బాటసారి ఎం.ఎన్ భూషి
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:20 AM
ఇది 1944 నాటి మాట. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక విద్యార్థి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను చూసి, ఆయన మూర్తిని మనసులో ముద్రించుకున్నాడు. ఆ తరువాత అతను విద్యావంతుడై, పదమూడు పర్యాయాలు అంబేడ్కర్‌ను దర్శించుకోవాలని...
నివాళి
ఇది 1944 నాటి మాట. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక విద్యార్థి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను చూసి, ఆయన మూర్తిని మనసులో ముద్రించుకున్నాడు. ఆ తరువాత అతను విద్యావంతుడై, పదమూడు పర్యాయాలు అంబేడ్కర్‌ను దర్శించుకోవాలని ప్రయత్నించి, చివరి ప్రయత్నంలో ఎట్టకేలకు బొంబాయిలోని రాజగృహలో ఆ మహనీయుడిని కలుసుకుని పరమానందంతో ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ సంఘటనతో అంబేడ్కర్ ఆగ్రహోదగ్రుడయ్యారు. తాను ఆంధ్రా నుంచి వచ్చానని, ఈలి వాడపల్లి బంధువునని ఆ యువకుడు పరిచయం చేసుకున్నాడు. అంబేడ్కర్ ఆ యువకుడి భుజం తట్టి, జీవితంలో ఎవరి పాదాలకూ నమస్కరించవద్దని, మానసిక బానిసత్వం నుంచి బయటపడి, ఎవరికీ తలవంచకుండా ఆత్మగౌరవంతో బతకమని చెప్పాడు. ఆత్మీయంగా భోజనం పెట్టి, ఆంధ్ర రాజకీయాల గురించి వాకబు చేసి, అతడిని పంపించారు అంబేడ్కర్. అప్పటి నుంచి అతడికి అంబేడ్కర్ ఆశయమే ఊపిరి అయింది. మళ్లీ కొన్నాళ్లకు 1956లో అంబేడ్కర్ నేతృత్వంలో నాగపూర్‌లో లక్షలాది మందితో కలిసి అతను బౌద్ధ ధమ్మ దీక్షను స్వీకరించాడు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నవయాన బౌద్ధ విలువలతో అవిశ్రాంతంగా ప్రయాణించిన ఆ ‘భీమ’ బాటసారి పేరు ప్రొఫెసర్ ఎం.ఎన్. భూషి. నిబద్ధత కలిగిన అంబేడ్కర్ వాదిగా, సామాజిక కార్యకర్తగా, మేధావిగా, రచయితగా దశాబ్దాలపాటు అనునిత్యం ‘జై భీమ్’ స్మరణతో జీవించిన ఎం.ఎన్. భూషి, ఈ ఆగస్టు 1న హైదరాబాద్‌లో పరినిర్వాణం చెందారు.
ఎం.ఎన్. భూషి పేరు అసలు మాచారయ్య. మహారాష్ట్ర సంప్రదాయంలో.. ముందు వ్యక్తి పేరు, తర్వాత తండ్రి పేరు, తర్వాత ఇంటిపేరు పెట్టుకుంటారు. ఆ విధంగా ఆయన పూర్తి పేరు మాచారయ్య నాగన్న భూషి. నాటి తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు సమీపంలో గల పినపళ్ల ఆయన స్వగ్రామం. చిట్టెమ్మ, నాగన్న దంపతులకు 1935 జూలై 15న ఎం.ఎన్. భూషి జన్మించారు. నిరుపేద మాల కుటుంబానికి చెందిన ఈ దంపతులు నిరక్షరాస్యులైనప్పటికీ, తాము ఎదుర్కొంటున్న సామాజిక అణచివేత నుంచి విముక్తం కావడానికి విద్యయే సరైనదని గ్రహించారు. నిరంతరం కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి వారి భవితకు బంగారుబాటలు వేశారు. ఎం.ఎన్. భూషి మచిలీపట్నంలో ఎస్‌ఎస్‌ఎల్సీ అభ్యసించి, పాలిటెక్నిక్ శిక్షణ పొందారు. పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించి నల్లగొండ, ఔరంగాబాద్, వాడి, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో పద్నాలుగు సంవత్సరాల పాటు టెలికం ఇంజనీరుగా విశేష సేవలందించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి, అంబేడ్కర్ స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడే రాజీనామా చేయవద్దని, మరొక సంవత్సరం ఉద్యోగం చేస్తే పెన్షన్ వస్తుందని మిత్రులు ఎంత చెప్పినా వినకుండా కొలువును తృణప్రాయంగా విడిచిపెట్టి, రాజమండ్రి జనరల్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కపిలేశ్వరపురం జమీందారు కుటుంబానికి చెందిన ఎన్.బి.పి. పట్టాభిరామారావు లాంటి హేమాహేమీని ఢీకొని ఓడిపోయారు.
ఎం.ఎన్. భూషి నిరంతర అధ్యయనశీలి. మనువాద సమాజంలో దళితుడిగా తనకున్న అనుభవాలతో రచనలు చేశారు. ప్రజాస్వామ్యానికి కుల వ్యవస్థకు నడుమ జరిగే సంఘర్షణను చిత్రిస్తూ ఆయన ‘Democracy vs Casteism’ అనే గ్రంథం రాశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఔన్నత్యాన్ని విశ్లేషిస్తూ ‘Viswaratna Dr.BabaSaheb Ambedkar– His struggle and Lifetime achievement’ పేరుతో లఘు కవితా సంకలనాన్ని వెలువరించారు.
భారతదేశంలో మూడు తరాల అంబేడ్కరిస్టులకు ఎం.ఎన్. భూషి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి. అంబేడ్కర్ శిష్యులు పి.సి. కాంబ్లే, బాబూరావు గైక్వాడ్, బి.డి. ఖోబ్రగడే లాంటి వాళ్లతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. బొంబాయిలో నివసించే సందర్భంలో ఎం.ఎన్. భూషి... అంబేడ్కర్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించే కళాశాల, హాస్టల్ విద్యార్థులకు ఆంగ్ల వ్యాకరణం, అంబేడ్కర్ ఉద్యమ ప్రస్థానం తదితర అంశాలను బోధించేవారు. ఎం.ఎన్. భూషి వృత్తిరీత్యా ఆచార్యుడు కానప్పటికీ అక్కడ కొంతమంది విద్యార్థులు, మిత్రులు ఆయనను ‘ప్రొఫెసర్’ అని గౌరవంగా పిలిచేవారు. తరువాతి కాలంలో కూడా అందరూ ఆయనకు ఆ విధంగానే మర్యాదనిచ్చారు. అదే సందర్భంలో దళిత్ పాంథర్స్‌తో ఆయనకు పరిచయమేర్పడింది. ఎం.ఎన్. భూషికి మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ మంచి మిత్రులు. నారాయణన్ అమెరికాలో భారతదేశ రాయబారిగా ఉన్నప్పుడు, ఆయన ఆహ్వానం మేరకు భూషి అమెరికా వెళ్లి, కొన్నాళ్లు ఆయన ఇంట్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం, మలితరం దళిత ఉద్యమ నాయకులతో, ఆచార్యులతో, కవులతో, కళాకారులతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. అనేక సందర్భాల్లో వారితో కలిసి నడిచారు. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అంబేడ్కర్ తాత్త్వికతను, కాన్షీరామ్ రాజకీయ కార్యాచరణను ఎం.ఎన్. భూషి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి కులనిర్మూలన ఆవశ్యకతను, దళిత తాత్త్విక భావజాలాన్ని వ్యాపింపజేయడంలో భూషి విశేషంగా కృషి చేశారు. అణగారిన వర్గాల విద్యార్థులు చిన్న చిన్న లక్ష్యాలతోనే సరిపెట్టుకోకుండా, సివిల్ సర్వెంట్స్‌గా ఎదగాలని చెబుతూ ఎంతోమందికి భూషి ప్రేరణ కలిగించారు. ఎం.ఎన్ భూషి ఉద్యోగ ప్రస్థానం నల్లగొండ నుంచి ప్రారంభమయింది కాబట్టి ఆయనకు నల్లగొండ అంటే అమిత ఇష్టం. చాలాకాలం ఆయన ఆ ప్రాంతంలో నివాసమున్నారు. అక్కడి దళిత నాయకులను, కార్యకర్తలను ప్రభావితం చేశారు. అంబేడ్కర్ కార్యాచరణ, ఆయన త్యాగాలు తలుచుకొని ఎం.ఎన్. భూషి కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతూ పసిపిల్లవాడిలా బోరున దుఃఖించేవారు. అంబేడ్కరిస్టులను తాత్త్విక బంధువులుగా, ప్రాణ స్నేహితులుగా భావించారు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన దళిత కవులు నేతల ప్రతాప్‌కుమార్ తన ‘సమతా వసంత గానం’ కవితా సంకలనాన్ని, రాచమళ్ల దేవయ్య ‘అంబేడ్కర్ మహా బౌద్ధయానం’ గేయకావ్యాన్ని భూషికి అంకితమిచ్చారు. గత ఏడాది జూన్‌లో– ఎం.ఎన్. భూషి నివసిస్తున్న వృద్ధాశ్రమానికి వెళ్లి, ‘చోడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం’ పుస్తకానికి ముందుమాట రాయమని అడిగితే, వారం రోజుల్లో ఈ వ్యాసకర్తకు ముందుమాట డిక్టేట్ చేశారు. తొమ్మిది పదుల ప్రాయం నిండినా ఎం.ఎన్. భూషి ఇటీవలి కాలం వరకూ ‘భీమో’త్సాహంతో జీవించారు. ఆయన మాటలు వింటుంటే... ‘అంబేడ్కర్ రథం’ ముందుకు కదులుతున్నట్లు ఉంటుంది.
ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు
తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్
డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..