మన పొలాలకు పాకిన యుద్ధం!
ABN , Publish Date - Apr 01 , 2026 | 02:00 AM
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా...
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నది. ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉపయోగించే యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు ముఖ్యంగా గ్యాస్, ఫాస్ఫేట్, పొటాష్ ఈ గల్ఫ్ దేశాల నుంచి హోర్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతాయి. దీని మూసివేత వల్ల వాటిని దిగుమతి చేసుకునే వ్యవసాయ ఆధారిత దేశాలకు సమస్యలు తప్పవు. యుద్ధం వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గిపోవడం, రవాణా ఖర్చులు పెరగడం, అంతర్జాతీయ ధరలు భారీగా పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఈ సమస్యలు చూసినవే.
ప్రపంచంలో అతిపెద్ద ఎరువుల వినియోగ దేశాల్లో ఒకటి భారత్. కానీ మన దేశం పెద్ద మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటోంది. ఎరువుల కొరతతో పాటు రైతులకు సబ్సిడీ భారమూ పెరగవచ్చు, పంట ఖర్చులు పెరిగి లాభాలు తగ్గవచ్చు. ఈ పరిస్థితుల్లో రైతులు ముందుగా ప్రణాళిక వేసుకుంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. 1) రసాయన ఎరువులపై ఆధారపడడాన్ని పూర్తిగా కాకపోయినా కొంత వరకైనా తగ్గించాలి. సేంద్రియ ఎరువులు, కంపోస్ట్, గోబర్ గ్యాస్ స్లరీ వాడాలి. 2) భూసార పరీక్షలు చేయించి, ఎరువు అవసరం ఎంత ఉందో తెలుసుకుని వాడితే ఖర్చు తగ్గుతుంది. 3) పంటల ఎంపికలో మార్పులు చేయాలి. తక్కువ ఎరువు అవసరమయ్యే పంటలు (మిల్లెట్స్, పప్పుధాన్యాలు) ఎంచుకోవాలి. వరి, చెరకు వంటి అధిక ఎరువు పంటలను తగ్గించాలి. 4) బయోఫెర్టిలైజర్ల వాడకం పెంచాలి. 5) రైతు సంఘాలుగా ఏర్పడి, వారంతా కలసి ఎరువులు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు దొరుకుతాయి, నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. 6) నీటి నిర్వహణకు డ్రిప్, స్ప్రింక్లర్ వాడితే ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఫర్టిగేషన్ ద్వారా తక్కువ ఎరువుతో ఎక్కువ ఫలితం వస్తుంది.
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, దాని ప్రభావం చివరకు రైతు పొలం వరకు వస్తుంది. అందుకే ఎక్కువ ఎరువులతో చేసే వ్యవసాయం నుంచి ఎరువులు తక్కువగా వాడే స్మార్ట్ వ్యవసాయం వైపు మారాల్సిన సమయం వచ్చింది. రసాయన ఎరువుల కొరతను ఎదుర్కొనేందుకు జీవన ఎరువుల వాడకం వైపు మళ్లితే రైతు గెలుస్తాడు.
శ్యాంమోహన్
ఇవి కూడా చదవండి..
యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ