ఈ మానసిక దాస్యం నుంచి విముక్తి ఎప్పుడు?
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:51 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏప్రిల్ 18న జాతి నుద్దేశించి ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యంలో అత్యున్నత రాజకీయ స్థానంలో ఉన్న నాయకుడు ప్రధానమంత్రి. కనుకనే మనలో చాలా మందికి ఆ ప్రభావదాయక...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏప్రిల్ 18న జాతి నుద్దేశించి ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యంలో అత్యున్నత రాజకీయ స్థానంలో ఉన్న నాయకుడు ప్రధానమంత్రి. కనుకనే మనలో చాలా మందికి ఆ ప్రభావదాయక వ్యక్తి ప్రసంగం ఒక అత్యవసరమైన సందేశాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి కూడా కొన్ని సందర్భాలలో జాతి నుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే అవి కేవలం లాంఛన ప్రాయంగా చేసే ప్రసంగాలే. ప్రధానమంత్రి ప్రసంగాలు భిన్నమైనవి. దేశం ఒక సంక్షోభం ముంగిట ఉన్నప్పుడో లేదా దేశ పౌరులలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసే విధాన నిర్ణయం తీసుకున్నప్పుడో ప్రధానమంత్రి జాతి జనుల నుద్దేశించి ప్రసంగిస్తారు. పెద్ద విలువగల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్న విషయాన్ని నవంబర్ 8, 2016 రాత్రి ఎనిమిది గంటల సమయంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి తెలియజేయడాన్ని, అలాగే మార్చి 24, 2020న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుపరుస్తున్నట్టు ప్రకటించడాన్ని ఎవరు మరచిపోగలరు? ఈ కారణంగానే ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే ఆ ప్రసంగ విషయానికి ఎంతో ప్రాధాన్యముంటుంది, ఆ విషయ అత్యావశ్యకతను అది సూచిస్తుంది.
అయితే ఈ నెల 18న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి అటువంటి ప్రాధాన్యమేదీ లేదు. భారత జాతీయ పతాకం వెనుక ఉండగా వెలువరించిన ప్రసంగంలో మహిళా రిజర్వేషన్‌ను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. నిజానికి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)తో మహిళలకు మరిన్ని సీట్లు కేటాయించే అంశంతో ముడిపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026 పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో తమ ప్రభుత్వం విఫలమయినందుకు భారత మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆ ప్రసంగం చేయడం ఒక అసాధారణమైన విషయం. రెండు కీలక రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఆయన ఆ ప్రసంగం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రధానమంత్రిగా ఆయన ఆ ప్రసంగం చేయకూడదు. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మోదీపై ఎలాంటి చర్య తీసుకోకపోగా నామమాత్రంగానైనా ఆక్షేపణ తెలుపలేదు. సరే, మోదీ ఆ ప్రసంగం చేయడం ద్వారా తాను నిర్వహిస్తున్న అత్యున్నత పదవి రాజకీయ హుందాను కళంకపరిచారు. ఎటువంటి వాదనలూ ఆయన ఆ ప్రసంగాన్ని చేయడాన్ని న్యాయసమ్మతం చేయలేవు. నరేంద్ర మోదీ చర్యలో రాజకీయ నైతికతను అలా ఉంచితే ఆయన ప్రసంగానికి దేశ పౌరుల ప్రతిస్పందన నాకు అమిత ఆసక్తి గొలుపుతోంది. దానిని నిశితంగా పరిశీలించవలసిన అవసరమున్నది. మన రాజ్యాంగంపై అవగాహన ఉన్న కొద్ది మంది పౌరులు, ప్రధానమంత్రిగా మోదీ ఆ ప్రసంగం చేయడాన్ని ఆక్షేపిస్తూ ఈసీఐకి లేఖలు రాశారు. సామాజిక మాధ్యమాలలో మోదీ చర్యపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మోదీ ప్రసంగాన్ని తప్పుపట్టినవారు ఎంతో మంది లేరని చెప్పడం సత్యదూరమేమీ కాదు. ఆయన తన అభిప్రాయాన్ని ప్రజలకు నివేదించారని, ప్రధానమంత్రి కనుక ఆయన ఆ అధికార స్థానం నుంచి దేశ ప్రజలతో సంభాషించారని చాలా మంది భావించారు. ప్రధానమంత్రిగా ఆయన ఆ ప్రసంగం చేయడం తప్పు అనే మౌలిక సత్యాన్ని దేశ పౌరులు గుర్తించలేదు. రాజకీయాల పట్ల మన నిబద్ధత, బాధ్యత గురించి ఇది ఏమి చెబుతుంది? అధికారంతో మన సంబంధాలు ఏమిటి అనేది ప్రస్తుత సందర్భంలో చాలా సముచితమైన ప్రశ్న అని నేను భావిస్తున్నాను. అధికారం ప్రజలపై, ముఖ్యంగా భారతీయులపై విడ్డూరమైన ప్రభావాన్ని నెరపడం కద్దు. అధికారంలో ఉన్నవారికి విధేయులుగా ఉండేలా వ్యవహరించేలా మన సామాజిక వ్యవస్థ మనలను తీర్చిదిద్దుతోంది. పాలకులకు ప్రశ్నలు సంధించేవారు సైతం ఈ దాస్యతత్వాన్ని రక్త గతం చేసుకున్నవారే కావడం గమనార్హం. ప్రశ్నించడమనేది అధికారం ద్వారా నియంత్రితమవుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న శ్రేణులు యథాతథంగా కొనసాగేలా మాత్రమే ఆ ప్రశ్నల తీరుతెన్నులు ఉండేలా అధికారంలో ఉన్నవారే నిర్దేశించడం జరుగుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నవారికి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేసేందుకు అనుమమతించరు. ప్రస్తుత అధికార అసమతౌల్యతలు మరింత దృఢమయ్యేలా మాత్రమే ప్రశ్నించే వైఖరులు ఉండితీరాలి.
అసలు అధికారంలో ఉన్నవారి చర్యలు, నిర్ణయాలను నిశితంగా ప్రశ్నించాలన్న ఆలోచనే చాలా మందికి ఉండదు. ప్రశ్నించినా సహేతుకమైన, సబబైన సమాధానాలను వారు డిమాండ్ చేయరు. ఒకరి అదుపాజ్ఞలలో ఉండడం, చెప్పింది చేయడమే చాలా సహజ విషయంగా మన సమాజంలో పరిగణన పొందుతోంది. తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి ఈ మనోవైఖరిని ఆక్షేపించారు. ‘బానిసత్వంలోనే ఉండిపోవాలనే ఆరాటానికి మనం ఎప్పుడు స్వస్తి చెప్పుతాం?’ అని ఆయన ప్రశ్నించారు. వలస పాలన కాలంలో ఆయన ఈ ప్రశ్న వేసినప్పటికీ, ఇప్పటికీ ఎంతో ఉపయుక్తత ఉన్న విషయమది. ఎందుకని? మానసిక దాస్యం అనేది మనలో ఇప్పటికీ నిండుగా ఉన్నది. ఈ కారణంగానే మనం మన నాయకులకు గుడ్డి విధేయత చూపుతున్నాం. ఏకీభవించనప్పుడు మౌనంగా ఉండిపోతున్నాం! ఇది మనకు తాతల తరం నుంచి వస్తున్న అలవాటు. దాన్ని కొనసాగించడమే సుఖప్రదంగా మనకు కనిపిస్తోంది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ భూస్వామ్య, పితృస్వామ్య భావజాలాలు ఈ మానసిక దాస్యాన్ని మరింతగా దృఢతరం చేస్తున్నాయనేది ఒక నిష్ఠుర సత్యం. సరే, ప్రధాని మోదీ రాజ్యాంగ నైతికతకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది విద్యాధికులు మాత్రమే పట్టించుకునే సమస్య అని, సామాన్యులు ఎవరూ తమ నాయకులు రాజకీయ మర్యాదలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని లక్ష్యపెట్టరనే వాదన ఒకటి గట్టిగా ఉన్నది. ఇది ప్రమాదకరమైన వాదన. దీని ప్రకారం పేదలు, అణగారిన వర్గాలవారు రాజకీయ ఔచిత్యాన్ని పట్టించుకోరని, రాజకీయాల గురించి వివేకశీలంగా ఆలోచించగల సామర్థ్యం వారికి లేదని భావించవలసి వస్తుంది. ఇదెంతవరకు నిజం?
మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలు జీవన సౌఖ్యాల గురించే ఎక్కువగా ఆలోచించడం పరిపాటి. పేద ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారు కేవలం ఉపాధి, తిండి, గూడు గురించి మాత్రమే ఆందోళనపడరు. జీవన యాతనలకు కేవలం ఆర్థిక ఉపశమనానికి పరిమితం కాని సంపూర్ణ స్వేచ్ఛ గురించి వారు కలలుగంటారు. స్వయంప్రతిపత్తితో తమ జీవితాలను తామే నిర్ణయించుకోగల సామర్థ్యం కోసం ఆరాటమే వారి స్వేచ్ఛా స్వప్నం. పరిపూర్ణ స్వేచ్ఛకై తమ ఆరాటాన్ని ఆంగ్ల విద్యావంతుల వలే వారు స్పష్టంగా వ్యక్తీకరించలేక పోవచ్చు గానీ, ఆ సమగ్ర స్వేచ్ఛను ఆ విద్యాధికులు అర్థం చేసుకోలేని రీతుల్లో వారు అవగాహన చేసుకుంటారు. అంతేగాదు, స్వేచ్ఛను సమకూర్చుకునేందుకు పేదలు చూపే చొరవ శక్తిమంతమైనది. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజల ఉత్సుకత కంటే అది చాలా బలీయమైనది. ఇదిగో, ఈ కారణంగానే అధికారంలో ఉన్నవారు ఆ పరిపూర్ణ స్వేచ్ఛా స్వాప్నికులను, అంటే పేదలను సదా తమ నియంత్రణలో ఉంచుకునేందుకు తాము చేయగలిగినదంతా చేస్తుంటారు.. మరీ ముఖ్యంగా తాము అనుమతించిన ఆలోచనా రీతులకు భిన్నమైన సరళిలో పేదల ఆలోచనలు సాగేందుకు ససేమిరా అంగీకరించరు. అణగారిన వర్గాల వారికి అధికారం కొరవడడానికి కారణమేమిటి? స్వేచ్ఛ కోసం వారు చేస్తున్న పోరాటాన్ని అమల్లో ఉన్న సామాజిక సంప్రదాయాలు, రాజకీయ ఆధిపత్యాలు అపరిమితంగా కష్టతరం చేయడమే కాదూ?
ప్రభుత్వాలకు కఠినమైన ప్రశ్నలు సంధించడంలో వైఫల్యానికి నిజమైన బాధ్యులు సామాజికంగా విశేషాధికారాలు అనుభవిస్తున్న వారేనని నిక్కచ్చిగా చెప్పితీరాలి. జీవన సౌఖ్యాలు నిరంతరం అందుబాటులో ఉన్న సామాజిక శ్రేణులివి. తాత, ముత్తాతల కాలం నుంచీ జీవితం ఒక పండుగలా గడుస్తుండడంతో అధికారంలో ఉన్న వారి పట్ల విధేయతతో వ్యవహరించడం ఈ సామాజిక వర్గాలకు ఒక స్వతస్సిద్ధ లక్షణంగా మారింది. సమాజంలో అట్టడుగున ఉన్నవారితో పోల్చి చూసినప్పుడు ఈ సామాజిక వర్గాలలో చాలా మంది జీవన సౌఖ్యాలకు నోచుకుంటున్నవారే. వారి ఆర్థిక బలిమి కంటే సామాజిక ప్రభావప్రాబల్యాలు చాలా చాలా అధికం. కనుకనే జీవన మనుగడకు ముఖ్యమైన స్వేచ్ఛను వారు లక్ష్యపెట్టరు. కేవలం ఆర్థికాభ్యుదయం పరంగానే ‘స్వేచ్ఛ’ గురించి వివేచిస్తారు. ఆ సమున్నత ఆదర్శాన్ని ఆర్థిక ఉన్నతి కోసం ఉపయోగించుకుంటారు. సామాజిక పురోగతి, రాజకీయ ప్రగతి, సృజనాత్మకత పరంగా స్వేచ్ఛను అర్థం చేసుకోవడం సామాజిక విశేషాధికారాలతో అలరారుతున్న వారికి దాదాపుగా అసాధ్యమైపోతోంది. శక్తిమంతమైన సామాజిక వర్గాలు తమ ఆర్థిక బలిమికి మరింతగా దోహదం చేసే విద్యా నమూనాలను రూపొందించి అమలుపరుస్తూ లబ్ధి పొందుతున్నాయి. సమస్త సామాజిక వ్యవస్థలు, నిర్మాణాలను ప్రభావితం చేయగల సామర్థ్యం ఈ కులీన వర్గాలకు ఉన్నందున వారి జీవన స్థితిగతులు సమాజంలోని సమస్త శ్రేణులకు ఆకాంక్షాత్మకమయ్యాయి. ఈ పరిస్థితిలో మోదీ రాజకీయ ప్రవర్తనాసరళి మన మనసులను గాయపరిచేదిగా, మన అవగాహనను వక్రీకరించేదిగా, మన అభిప్రాయాలను ప్రభావితం చేసేదిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా రాజకీయ నైతికతను అసంగతం చేస్తోంది. సామాజిక అంతరాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలూ కలిసికట్టుగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు సంధించాలి, ప్రజాప్రతినిధులను జవాబుదారీగా ఉంచాలి; రాజకీయ ప్రవర్తనా రీతులు అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండితీరాలని డిమాండ్ చేయాలి. పౌర భాగస్వామ్యం ఇంత క్రియాశీలకంగా ఉంటేనే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది.
టి.ఎమ్. కృష్ణ
సంగీతవేత్త, సామాజిక వ్యాఖ్యాత
(ది టెలిగ్రాఫ్)
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News