Mega Hyderabad Plan: మెగా హైదరాబాద్.. వికేంద్రీకృత పాలనకు ఆటంకం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:46 AM
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరిస్తోందని గగ్గోలు పెడుతూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాల అధికారాలను క్రమంగా కేంద్రీకరిస్తూ వికేంద్రీకరణ పాలనను దెబ్బతీయడం...
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరిస్తోందని గగ్గోలు పెడుతూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాల అధికారాలను క్రమంగా కేంద్రీకరిస్తూ వికేంద్రీకరణ పాలనను దెబ్బతీయడం తీవ్రమైన చర్య. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయడం మాత్రమే కాకుండా, అనేక గ్రామ పంచాయితీలను సమీప మునిసిపాలిటీల్లో కలపడం కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఈ విలీనంపై అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా విధానపరమైన ప్రక్రియలు, నోటిఫికేషన్లు, వార్డు విభజనలు, జనాభా, పన్నుల సర్దుబాట్లు వంటి అంశాలపైనే చర్చిస్తున్నాయి. కానీ ప్రజాస్వామ్యాన్ని మరింత కేంద్రీకరించే ఈ విధాన దిశ సరైనదేనా? అనే ప్రశ్నను లేవనెత్తకపోవడం అత్యంత ఆందోళనకరం. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్లు కూడా రాజ్యాంగ ఆత్మ, వికేంద్రీకరణ పాలన, స్థానిక స్వపరిపాలనపై దెబ్బ వంటి మౌలిక అంశాలను లేవనెత్తలేదు. రాజ్యాంగంలోని 73, 74 సవరణలు స్థానిక స్వపరిపాలనకు చట్టబద్ధమైన హోదా, అధికారాలు, బాధ్యతలు కల్పించాయి. అయితే రాష్ట్ర స్థాయిలో రాజకీయ–పరిపాలనా ప్రతిఘటనల వల్ల ఈ సవరణలు పూర్తిగా అమలుకావడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం వికేంద్రీకరణ పాలనకు విరుద్ధం. దాదాపు కోటి ముప్పై లక్షల జనాభాను ఒకే మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చి, నిర్ణయాధికారాలను మరింత కేంద్రీకరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇంత భారీ జనాభాకు ఒకే పరిపాలనా వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
దేశంలో వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని నిరూపించిన అనేక నమూనాలు ఉన్నాయి. అందులో కేరళ మోడల్ ముఖ్యమైనది. ఇటీవల కేరళ క్యాడర్‌కు చెందిన ఒక తెలుగు ఐఏఎస్ అధికారి కూడా, కేరళ అభివృద్ధికి ప్రధాన కారణం వికేంద్రీకరణ పాలనే అని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘సమగ్రాభివృద్ధి’ పేరుతో ఈ విలీనాన్ని సమర్థించుకుంటోంది. ఇక్కడ కీలకమైన ప్రశ్న విలీనం చేయదలచుకున్న పట్టణ స్థానిక సంస్థల ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారా? ఆయా మునిసిపాలిటీల సర్వసభ్య సమావేశాల్లో ఈ అంశంపై తీర్మానాలు జరిగాయా? శంకరపల్లి మున్సిపాలిటీలో చందిప్ప గ్రామ పంచాయతీ విలీనానికి వ్యతిరేకించి తమ స్థానిక పాలనను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలోని వార్ధా పట్టణంలో ఒక గ్రామ పంచాయితీ, మునిసిపాలిటీలో విలీనాన్ని తిరస్కరించి స్వతంత్రంగా కొనసాగుతున్నది. మేము నిర్ణయాలు చేస్తాం మీరు అమలుపరచండి అనే ధోరణిని వ్యతిరేకిస్తూ చేసిందే 73, 74 రాజ్యాంగ సవరణ అని గుర్తించాలి.
ఈ సవరణల ప్రధాన రూపకర్త రాజీవ్‌గాంధీ సంకల్పానికి, ఆయన కలగన్న స్థానిక స్వపరిపాలన బలోపేత లక్ష్యానికి ఈ విలీన చర్య వ్యతిరేకం. పౌరుల అవసరాలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు బలమైన స్థానిక ప్రభుత్వాల ద్వారానే సాధ్యం. ప్రతి అంశాన్ని కేవలం ఆర్థిక కోణంలో మాత్రమే చూడలేం. రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ముఖ్యమైన హక్కు పాలనలో భాగస్వామ్యం. ఎన్నికల సమయంలో ఓటు వేసే హక్కుతోనే పౌరులను పరిమితం చేసి, పాలనలో భాగస్వాములను చేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. స్థానిక ప్రభుత్వాలను పటిష్ఠం చేయడం ద్వారా కేరళ మానవవనరుల అభివృద్ధి సూచికల్లో అగ్రస్థానంలో నిలిచింది. అధిక అక్షరాస్యత, తక్కువ శిశు మరణాల రేట్లు, మెరుగైన ఆరోగ్య–విద్య సూచికలు మెరుగు పరచుకున్నారు. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో సేవలందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
అందుకే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు తిరిగి బదలాయించాలి. స్థానిక ప్రభుత్వాలను మెగా హైదరాబాద్‌లో విలీనం చేయడం కాదు, వాటిని బలోపేతం చేయడమే మన ముందున్న మార్గం. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల పూర్తి విశ్వాసంతో, దృఢమైన రాజకీయ సంకల్పంతో కేరళ తరహా వికేంద్రీకరణ దిశగా తెలంగాణ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్.వెంకట్‌రెడ్డి
జాతీయ కన్వీనర్, ఎం.వి ఫౌండేషన్
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!