‘‘ప్రపంచాన్ని ఎలా లోపలికి తీసుకుంటానో అలాగే ప్రెజెంట్ చేయాలని...’’
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:51 AM
నా యూనివర్సిటీ చదువులోను, నేను తీసుకున్న జర్నలిజం శిక్షణ లోను ఎక్కువగా తారసపడేది నాన్ ఫిక్షన్ రచనలే. నాన్ ఫిక్షన్ జీవితాన్ని facts (ఘటనల) సమాహారంగా చూస్తుంది. అకడమిక్, జర్నలిస్టిక్ రైటింగ్‌లో...
ఇరవైలూ ముప్పైల వయస్సులో ఉండి ప్రధానంగా కథలు, నవలలు రాస్తున్న వారిని పరిచయం చేసే ఉద్దేశంతో, వచన రచనపై వారి అభిప్రాయాల కదంబంగా, ఈ ‘కొత్త వాక్యం’ శీర్షికను ప్రారంభిస్తున్నాం.
వివిధ
నా యూనివర్సిటీ చదువులోను, నేను తీసుకున్న జర్నలిజం శిక్షణ లోను ఎక్కువగా తారసపడేది నాన్ ఫిక్షన్ రచనలే. నాన్ ఫిక్షన్ జీవితాన్ని facts (ఘటనల) సమాహారంగా చూస్తుంది. అకడమిక్, జర్నలిస్టిక్ రైటింగ్‌లో బైనరీ పాలిటిక్స్ కూడా ఎక్కువ. అంటే మంచీ చెడూ అనే రెండు ధ్రువాలే తప్ప మధ్యలో ఏమీ ఉండవన్నట్టు రాస్తారు. కానీ జీవితం అనేది మంచీచెడులకు మధ్యే ఎక్కువ నడుస్తుంది, facts కు వెనకాలే ఎక్కువ జరుగుతుంది. అందుకే నాన్ ఫిక్షన్లో జీవితపు ఎన్నో వైరుధ్యాలను పట్టుకోలేం అనిపిస్తుంది. అందుకే కథా రచన నాకు ముఖ్యం.
నా మొదటి కథ ‘చెదిరిన ఆదర్శం’ 2013లో రాసాను. అప్పట్లోనే నేను ఖమ్మ జిల్లాలో చిన్న పల్లెటూరి నుంచి యూనివర్సిటీలో చదువుకోవటానికి వచ్చాను. యూనివర్సిటీలో నాకు ఎదురైన ఆదర్శవాదానికీ, నా ఇంట్లో వాస్తవాలకూ మధ్య తేడా గురించి ఆ కథలో రాశాను..
ఇప్పటిదాకా నాకు జరిగినవో, నా చుట్టూ జరిగినవో– అవే రాసాను. తెలిసిన మనుషులు, చూసిన విషయాలే నా కథల్లోకి వచ్చాయి. నా ‘సిలకం డబ్బా’ కథల పుస్తకంలో కథలన్నీ అలాంటివే. కానీ జరిగింది జరిగినట్టే రాయటం ఎప్పుడూ వీలవదు. కొంత కల్పించి రాయక తప్పదు. చిత్రమైన విషయం ఏమిటంటే– నా కథలు చదివినవాళ్ళు కొంతమంది నేను కల్పించి రాసినవాటిని నిజంగా జరిగిన విషయాలనుకున్నారు, నిజంగా జరిగినవి రాస్తే అవి కల్పించి రాసాననుకున్నారు.
నేను 90ల్లో పల్లెటూరిలో పుట్టి పెరిగాను. నా ముందు తరం కాస్త నెమ్మదైన జీవితాన్ని గడిపింది. మనుషుల మధ్య దగ్గరతనం ఎక్కువ ఉండేది. అలాంటి ప్రపంచం ఆఖరి దశలో నా బాల్యం గడిచింది. నేను పెరిగి పెద్దయ్యేసరికి చుట్టూ టెక్నలాజికల్ బూమ్. మా తరం ఈ రెండు ప్రపంచాల మధ్య చిక్కుకున్న తరం అనిపిస్తుంది. మేం ఎంతగా ఈ కొత్త కాలానికి అడాప్ట్ అయినా ఎప్పుడోకప్పుడు సహజమైన జీవితం నుంచి ఎంత దూరం వచ్చేసామన్నది స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ మా పరుగును ఆపేది కావచ్చు, లేదా రాజీపడి మరింత మెకానికల్‌గా ఐపోయేట్టూ చేయవచ్చు. ఈ పరిస్థితికి బాహ్య పర్యవసానాల గురించి చాలామంది రాసారు. గ్లోబలైజేషన్ వల్ల వృత్తులు పోవటం, ఊరికి దూరమై పట్టణాలకు వలస రావటం గురించి చాలా కథలే వచ్చాయి. కానీ ఈ పరిస్థితి అంతరంగంలో కలగజేసే సంఘర్షణ గురించి ఎక్కువమంది రాయలేదు.
రాయటంలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి అనుకుంటాను. కథకు మొదలేమిటీ ముగింపేమిటీ అన్నది అంతా ఒక అవగాహనకు వచ్చాక రాయటం మొదలుపెట్టడం ఒక పద్ధతి. నేను మొదట్లో చాలా కథలను ఇలాగే రాసాను. ఇలాగాక, ఏదో ఒక అస్పష్టమైన ఆలోచనతోనో ప్రేరణతోనో రాయటం మొదలుపెట్టి, రాస్తూన్న క్రమంలోనే దానికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వటం ఇంకో పద్ధతి. ఈ పద్ధతిలో మన కథని మనం రాస్తూనే కనుగొంటాం. నా కథల పుస్తకంలోని కథల్లో అన్నిటికన్నా చివర రాసిన ‘సమాధి తోట’ ఇలా రాసిన కథే. ఆ కథను మా ఇంట్లో పెంపుడు పిల్లి గురించి రాద్దాం అని మొదలుపెట్టాను. కానీ ఆ కథ చివరకు నా కుటుంబంలో దగ్గరివాళ్ల మరణాల గురించి తలపోసుకునే కథగా మారింది. ఈ కథ మొత్తం రాయటానికి ఒక వారం రోజులు పట్టింది. ఆ వారంలో ప్రతి రోజూ రాయటానికి కూర్చోగానే అనుకోని విషయాలు వచ్చి కథలోకి చేరేవి. దాంతో రైటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఇదే నా స్వభావానికి నప్పే పద్ధతేమో అనిపించింది. ఈ పద్ధతిని మరింత ఎక్స్ప్లోర్ చేస్తూ కథలు రాయాలని ఉంది.
నేను పొలిటికల్లీ కాన్షియస్ వ్యక్తినే. నాకు రాజకీయ, సామాజిక సిద్ధాంతాల మీద అవగాహన ఉంది. వాటి అవగాహనతో సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసు. కానీ ఐడియాలజీస్ ఎప్పుడూ వ్యక్తులను ప్రత్యేకంగా చూడవు. ఆ వ్యక్తుల మధ్య పోలికలను (patterns) పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. వారిని కేటగరైజ్ చేయటానికి, ఆర్గనైజ్ చేయటానికి ప్రయత్నిస్తాయి. నేను సిద్ధాంతాల లెన్స్‌తో మనుషుల్ని చూడటం మొదలుపెడితే వాళ్ళలో చాలామందిని ఒక్కటిగా చేసే కామన్ థీమ్స్ మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళని ఎవరికి వారుగా విడదీసే ప్రత్యేకతలు, వైరుధ్యాలు కనిపించవకపోవచ్చు. కానీ ఈ ప్రత్యేకతలను, వైరుధ్యాలను పట్టుకోగలిగినప్పుడే మనం జీవితాన్ని ఇంకా దగ్గరగా, స్పష్టంగా చూపించగలం. అందుకే నేను రాజకీయ, సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తినే అయినప్పటికీ, రాసినప్పుడు పాత్రల్నీ, సంఘటనల్నీ ఆ అవగాహనకు అతీతంగా చూడటానికి ప్రయత్నిస్తాను. ప్రపంచాన్ని ఎలా లోపలికి తీసుకుంటానో అలాగే ప్రెజెంట్ చేయాలని అనుకుంటాను. ఆ విషయంలో రాజీపడను.
ఎప్పటి నుంచో నా లోపల ఒక నవల నలుగుతూ ఉంది. యూనివర్సిటీ కేంపస్ నేపథ్యంలో, నా అంతరంగ అనుభవం పునాదిగా ఆ కథ జరుగుతుంది. ఇప్పటిదాకా రాసిన కథలన్నీ జరిగిన విషయాలకు చాలా దగ్గరగా రాసాను. ఇప్పుడు ఈ నవలలో ఇమేజినేషన్ ఎక్కువ వాడి రాయాలని ఉంది. అలాగే నేను ఇప్పటిదాకా రాసినవన్నీ దాదాపు ఫస్ట్ పెర్సన్లో రాసినవే. అలా ‘నేను’ అని కథ చెప్తున్న పాత్ర మీద నా సెన్సిబిలిటీస్ తెచ్చి మోపుతున్నానేమో అనిపిస్తుంది. అలా కాకుండా రాయబోయే నవలని పూర్తిగా థర్డ్ పర్సన్లో రాయాలని ఉంది.
నా సెన్సిబిలిటీకి దగ్గరగా రాసినవాళ్ళ రచనలను నేను మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. అవి కాల గమనంలో నిలకడగా నిలబడి ఏదో ఒక కోణంలో కొత్తగా కనిపిస్తూ, మనకి కొత్తది ఏదో నేర్పిస్తూ ఉంటాయి. అలాంటివి నేను రాయగలనో లేదో తెలీదు కానీ కొన్ని ఏళ్ళ తర్వాత నేను రాసినవి కనీసం నాకు నేను ఇష్టంగా చదువుకోగలిగేలా ఉండాలి.
తెలుగు సాహిత్యంలో పుస్తక సమీక్షలు ఎక్కువ పొగడ్తలకో తెగడ్తలకో పరిమితమై ఉంటాయి. చాలా కొద్దిమంది మాత్రమే మన రచనలోను, శైలిలోనూ మనకే అస్పష్టంగా ఉన్న విషయాలను ఎత్తి చూపిస్తూ, కొత్త కోణాలను విశదపరుస్తూ సమీక్షలు రాయగలరు. అలాంటి సమీక్షలు కొత్తగా రాసేవాళ్ళకి ఉపయోగపడతాయి.
మేడి చైతన్య
ఈమెయిల్: chaituuoh2@gmail.com
ఈ వార్తలూ చదవండి
చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం