‘మేధో మనువాదులు’ ఉన్నప్పుడు, ‘మేధో నక్సల్స్’ ఉండరా?
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:40 AM
ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని ఒక సభలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన మాట్లాడిన వేదికని ‘శ్రీరామ్ సేన...’ అనే బీజేపీ అనుకూల సంస్థవాళ్ళు శుద్ధి చేశారు...
ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని ఒక సభలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన మాట్లాడిన వేదికని ‘శ్రీరామ్ సేన...’ అనే బీజేపీ అనుకూల సంస్థవాళ్ళు శుద్ధి చేశారు. ఇలా చెయ్యడాన్ని ‘మనువాద మనస్తత్వం’ అని రాహుల్‌గాంధీ విమర్శించారు. అంటే, కుల విధానం ప్రకారం ఖర్గే అంటరాని కులానికి చెందిన వ్యక్తి కాబట్టి, కుల వివక్షతతో అలా చెయ్యడం మనువాదం అవుతుందని కాంగ్రెస్ వాదన.
ఢిల్లీ ఎర్రకోట నుంచీ ఆగస్టు 15న ఇచ్చిన ఉపన్యాసంలో, ప్రధాని మోదీ వాడిన ఒక కొత్త మాట ‘దిమాగీ నక్సల్స్’! దీనికి తెలుగు పత్రికలు ఇచ్చిన అనువాదం ‘మేధో నక్సలైట్లు’ అని. అంటే, అడవుల్లో ఉన్న నక్సలైట్లను తుడిచిపెట్టాం. కానీ, బుర్రల్లో (దిమాగ్‌లో) ఇంకా అవే భావాలున్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించి, ఏరిపారెయ్యాలి అని. ప్రతిపక్షాల్ని దృష్టిలో పెట్టుకునే, ప్రధాని అలా అన్నట్టు భావించి, ‘‘మేధో నక్సలైట్’నని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను’’ అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ప్రకటన! ‘గ్రీన్ హంట్’ పేరుతో నక్సలైట్ల అణచివేతకి పాల్పడిన మాజీ పాలకులు తమని తాము ‘మేధో నక్సలైట్లు’గా చెప్పుకోవడం పెద్ద జోక్! అయితే, ప్రధాని ఆ మాటని ప్రతిపక్షాలను ఉద్దేశించి అనలేదనీ, మావోయిస్టు భావజాలం ఉన్నవారిని ఉద్దేశించి మాత్రమే అన్నట్టు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ‘మావోయిస్టుల్ని తుడిచిపెట్టేశామని ఘనంగా చెప్పుకున్న ప్రభుత్వం, మమ్మల్ని కాక, ఇంకెవర్ని ఉద్దేశించి ఆ మాట అంటున్నది?’ అని కాంగ్రెస్ వాదన. ఆ మాటా నిజమే. అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారినెవరినైనా, కమ్యూనిస్టులుగా ముద్రకొట్టి వేధించడం కొత్తేమీ కాదు.
75 ఏళ్ళనాడు గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో, మెకార్తీయిజం పేరుతో కమ్యూనిస్టుల్నే కాకుండా, ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించే వారిని వెంటాడి వేధించింది అక్కడి ప్రభుత్వం. యూనివర్శిటీలలో, పత్రికలలో, హాలివుడ్ సినిమా రంగంలో, ప్రభుత్వ శాఖల్లో, అనుమానం వచ్చిన ప్రతీ వారినీ వేధించింది. నేడు వింటున్న ‘అర్బన్ నక్సల్స్’, ‘దిమాగీ నక్సల్స్’ రకం మాటల్ని, వాళ్ళకి తోచినట్టు అక్కడా వాడారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం ఉన్న వారిని ‘ఎర్రమంద’ (రెడ్స్), ‘లోపలి శతృవులు’ (ఎనిమీస్ వితిన్), ‘కమ్యూనిస్టు నాస్తికులు’ అనీ; కమ్యూనిస్టు సానుభూతిపరుల్ని ‘గులాబీ రంగు గాళ్ళూ’ (పింకోస్), ‘తోటి ప్రయాణికులు’ (ఫెలో ట్రావెలర్స్) అనీ; ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే ఇతర పార్టీల వారిని ‘కుట్రదారులు’ (సబ్ వర్షన్) అనీ– ఇలా అనేక రంగాల వారిని ఉద్యోగాలలోనించీ తీసెయ్యడం, జైళ్ళలో పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం వగైరా చేశారు.
మళ్ళీ మోదీ ప్రయోగించిన కొత్త పదబంధం దగ్గిరికి వస్తే, దీన్ని దుష్ట సమాసం అనవచ్చు. (రెండు వేర్వేరు భాషా పదాల కూడికగా). ఇది వ్యాకరణం ప్రకారమే కాకుండా, శ్రామిక కోణం నుంచీ కూడా ‘దుష్ట’ స్వభావం కలిగిన పదబంధం. శ్రామిక ప్రజల కోసం, పోనీ కనీసం ఆదివాసీల కోసం, తప్పుగానో ఒప్పుగానో జరిగిన పోరాటానికి సానుభూతి చూపిన వారిని ‘మేధో నక్సల్స్’ అనడం, వారిని గుర్తించి ఏరిపారేయాలనడం అన్యాయం.
మోదీ వాడిన ‘దిమాగీ’ (మేధో) అనే విశేషణాన్ని, రాహుల్‌గాంధీ వాడిన ‘మనువాద్ మైండ్ సెట్’కి అన్వయిస్తే, అది ‘దిమాగీ మనువాద్’ అవుతుంది. మనువాదం అనే మాట కొన్ని వందల ఏళ్ళనాటి మాటే అయినా, అది అన్ని రకాల అసమానతలనీ సమర్ధించే ఆలోచనా విధానం. అందుకే అంటున్నది ‘మేధో మనువాదులు’ ఉన్నంతకాలమూ, ‘మేధో నక్సల్స్’ ఉంటారు అని!
రాహుల్ వాడిన ‘మనువాదీ మాన్సిక్తా’ అనే మాట ఆయన కనిపెట్టింది కాదు. ఎప్పట్నించో దళిత ఉద్యమకారులు అంటున్నదే! ‘దిమాగీ నక్సల్స్’ అన్న పదప్రయోగం మోదీకే ప్రత్యేకం. బీజేపీ అనుకూల వివేక్ అగ్నిహోత్రి వాడిన ‘అర్బన్ నక్సల్స్’ అన్న మాటని ఆధారం చేసుకుని, కొత్తదనం కోసం, ‘దిమాగీ’ అనే విశేషణం చేరింది. ఇంతకీ, ఇలా కొత్త కొత్త పదబంధాలూ, కొత్త కొత్త నినాదాలూ మోదీ ఉపన్యాసాల్లో తరచూ దొర్లుతూ ఉంటాయి గదా? అవి ఆయన స్వంతమా, ఎవరన్నా రాసిపెడతారా?– అని సందేహం కొందరికైనా కలుగుతుంది. అందుకే 2016లో ‘ది ఎకనామిక్ టైమ్స్’ పత్రిక వారూ, 2021లో ‘ఇండియా టుడే’ పత్రిక వారూ, ‘సమాచార హక్కు చట్టం’ కింద– ‘‘మోదీ ఇచ్చే ఉపన్యాసాలు, ఆయనే స్వయంగా తయారు చేసుకుంటారా, ఎవరైనా రాసిపెడితే, వాటిని తిరిగి వల్లిస్తారా? అలా ఎవరైనా రాసిపెట్టడానికి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులిస్తారు’’ అని అడిగారట. దానికి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచీ (20–1–2021న) వచ్చిన జవాబు సారాంశం: ‘‘విషయాన్ని బట్టీ సందర్భాన్ని బట్టీ అనేకమంది వ్యక్తులు, జర్నలిస్టులు, అధికారుల నుంచి సమాచారమూ నోట్సూ వస్తాయి. వాటిని స్వయంగా చూసి, మోదీయే తుదిరూపం ఇస్తారు’’ అని. అయితే, వాటికోసం ప్రధానమంత్రి కార్యాలయం ఎంత ఖర్చు పెడుతుంది?– అన్న ప్రశ్నకి మాత్రం జవాబు ఖాళీగా ఉంచేశారట! (ఇంతకీ ఆ డబ్బు ఏ ఖాతా కింద ఎవరికి ఎంత ఇస్తారో, ఆ ఆదాయాన్ని, ఆ వ్యక్తులు ఆదాయపన్ను శాఖ వారికి చూపిస్తారో లేదో!)
ఎవరు రాసి ఇస్తేనేమి? ఆ ఉపన్యాసం శ్రామిక ప్రజలకు అనుకూలమా, వ్యతిరేకమా? అన్నదే మనకి ప్రధానం. కానీ, శ్రమ దోపిడీ మీద ఆధారపడి ఉన్న వర్గ సమాజంలో, మేధో మనువాదులూ ఉంటారు; మేధో నక్సల్సూ ఉంటారు. అసలు తెలుసుకోవలిసింది ఇదే! ఇది తెలుసుకోకుండానే, ‘ఏరిపారేస్తాం! తుడిచిపెట్టేస్తాం!’ అంటే అది సాధ్యమయ్యే పని కాదు. నిరసన, ప్రతిఘటన, తిరుగుబాటు– అనేక రూపాల్లో నిరంతరమూ తలఎత్తుతూనే ఉంటాయి. ఇది చరిత్ర చెప్పే నిజం!
ఈ నిజాన్నే, కవి సాహిర్ లూధ్వియాన్వీ ఇలా చెప్పాడు: దౌర్జన్యం ఎంతైనా దౌర్జన్యమే/ అది పెరిగిపోతే చివరికి నశించిపోతుంది./ రక్తం ఎంతైనా రక్తమే/ అది చిందితే గడ్డకట్టిపోతుంది./ యుద్ధరంగంలో మీరు అణచివేయాలని చూసిన ఆ రక్తమే ఈ రోజు/ వీధుల్లోకి, బజార్లలోకి పొంగి వచ్చింది–ఎక్కడో జ్వాలగా, ఎక్కడో నినాదంగా, ఎక్కడో రాయిగా మారి./ రక్తం ప్రవహించడం మొదలైతే/ బయోనెట్లతో దాన్ని ఆపలేరు/ అది తలెత్తి నిలబడితే/ నియమాలతో దాన్ని అణచలేరు./ దేహం మరణించడం అసలు మరణం కాదు. / దేహం నశించినంత మాత్రాన/ మనుషులు మరణించరు./ గుండె చప్పుడు ఆగినంత మాత్రాన/ ఆశయాలు మరణించవు.
బి.ఆర్. బాపూజీ
ఈ వార్తలను కూడా చదవండి:
పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్
ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా.. గంటకు 45.6 కిలోమీటర్ల వేగంతో చైనా 'సూపర్‌మ్యాన్' రోబో..