యాంత్రికమైన జ్ఞానార్జన!
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:01 AM
ఇవ్వాళ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మనసున్న మనిషిని తయారు చేసే నిలయాలుగా లేవు. అవి ఉద్యోగాలకు టికెట్లు ఇచ్చే కౌంటర్లుగా మారాయి. మార్కులు, ర్యాంకులు గ్రేడ్లు ప్యాక్ చేసి విడుదల చేసే ఉత్పత్తి.....
ఇవ్వాళ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మనసున్న మనిషిని తయారు చేసే నిలయాలుగా లేవు. అవి ఉద్యోగాలకు టికెట్లు ఇచ్చే కౌంటర్లుగా మారాయి. మార్కులు, ర్యాంకులు గ్రేడ్లు ప్యాక్ చేసి విడుదల చేసే ఉత్పత్తి కేంద్రాలయ్యాయి. ఇక్కడ విద్యార్థి ఆలోచించే ప్రాణి కాదు, కేవలం ఒక ఫైల్. ఒక హాల్ టికెట్ నెంబర్. ఒక రిజల్ట్. అతని కళ్లలో ప్రశ్నలు ఉంటాయి, కానీ వాటి చెంతే స్టాప్ సిగ్నల్ కూడా ఉంటుంది. తరగతి గది ఇప్పుడు ప్రశ్నలకు చోటివ్వదు. అది టైమ్ టేబుల్‌కు విధేయంగా ఉంటుంది. ఎంత సిలబస్ చెప్పామన్నది ముఖ్యం, ఎవరికి ఏమి అర్థమైందన్నది కాదు. సంస్కృతి ఈ క్యాంపస్‌లలో అప్పుడప్పుడూ అతిథిలా ప్రవేశిస్తుంది. ఏటా ఒక రోజు– ఒక స్టేజ్, ఒక సెల్ఫీ; మరుసటి రోజు ఒక న్యూస్ క్లిప్, మళ్లీ మౌనం.
కవితలు సిలబస్ అంచుల్లో పడుకుంటాయి. సినిమాలు ‘డిస్ట్రాక్షన్’గా ముద్ర వేయబడతాయి. భాషలు పరీక్ష పేపర్ వరకే పరిమితమవుతాయి. విద్య వేగంగా పరిగెడుతోంది... లోతు మాత్రం వెనుకబడుతోంది. సర్టిఫికెట్లు పెరుగుతున్నాయి... స్పృహ మాత్రం తగ్గుతోంది. విద్య మనిషిని కాదు సి.విని తయారు చేస్తోంది. ఆలోచనను కాదు ఫలితాన్ని కొలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కాలేజీలు, విశ్వవిద్యాలయాలు భవిష్యత్తును రూపొందించే ప్రదేశాలుగా కాక, పరీక్షలు నిర్వహించే శిక్షణ కేంద్రాలుగా మిగిలిపోతాయి. నిజానికి కాలేజీలు విశ్వవిద్యాలయాలు కేవలం తరగతుల గదులు, కారిడార్లు, పరీక్షా హాళ్ల సమాహారం కాదు. అవి భావాలు శ్వాస తీసుకునే ప్రదేశాలు, ఆలోచనలు స్వేచ్ఛగా నడిచే స్థలాలు. ప్రశ్నలు, జవాబులు పక్కపక్కనే కూర్చునే స్థలాలు. నవయువ మనసులు నెమ్మదిగా, మనిషిగా మారడాన్ని నేర్చుకునే వాతావరణం అది. సాంస్కృతిక వాతావరణమే ఆయా క్యాంపస్‌లకు కనిపించని హృదయ స్పందన. అది లేకపోతే జ్ఞానం యాంత్రికమవుతుంది,
డిగ్రీలు కేవలం ప్రాణం లేని కాగితాలవుతాయి, విద్య అనుభూతిని మరిచిపోతుంది. సాయంత్రం వేళ ఒక కవిత గొంతెత్తి చదివినప్పుడు, మసక వెలుగుల్లో ఒక నాటకం సాధన చేస్తున్నప్పుడు, హాస్టల్ గదిలో పుట్టిన పాట, రాత్రి గాలిలో కలిసిపోయినప్పుడు అక్కడే విద్య నిశ్శబ్దంగా తన సంపూర్ణతను పరిపూర్ణతను పొందుతుంది. ఎందుకంటే అక్కడే విద్యార్థులు ఏమి ఆలోచించాలో కాదు, దేన్ని ఎలా చూడాలో నేర్చుకుంటారు. ఇతర భాషలను, చరిత్రలను, ఇతరుల బాధలు, ఆనందాలను; ప్రాంతం, కులం, మతం, లింగం పేరుతో అడ్డుగా నిలిచిన గోడలను కరిగించి, పంచుకున్న క్షణాలను సృష్టిస్తుంది. సాంస్కృతిక వాతావరణం విశ్వవిద్యాలయాలకు ఒక అంతఃకరణను ఇస్తుంది. సాంస్కృతికత ఉన్న విశ్వవిద్యాలయం ఆలోచించే పౌరులను, సున్నితమైన మనసులను, అన్యాయాన్ని సాధారణంగా అంగీకరించని హృదయాలను సమాజానికి అందిస్తుంది. అటువంటి క్యాంపస్ తన గేట్ల వద్ద ముగియదు. అది సమాజంలోకి ప్రవహిస్తుంది. ప్రశ్నలుగా, కళగా, ప్రతిఘటనగా, ఆశగా... కాలేజీ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో సంస్కృతిని నిర్మించే అనేక దారులున్నాయి.
ఆలోచనకు స్వేచ్ఛ, భిన్నతకు గౌరవం, సృజనాత్మకతకు చోటు అనే విలువలు.. గోడలపై రాసే నినాదాలుగా కాదు, దైనందిన కార్యక్రమంగా మారాలి. క్యాంపస్‌లో కొన్ని ప్రదేశాలు ఎప్పుడూ తెరిచి ఉండాలి. ఆడిటోరియం తాళం వేసిన గది కాకుండా, సాయంత్రం ఆలోచనలు చేరే మైదానంగా మారాలి. గ్రంథాలయం కేవలం పరీక్షల కోసం, మార్కుల కోసం చదివే వేదికగా కాకుండా, మనసు నిశ్శబ్దం కావడానికి ఉపయోగపడే ప్రదేశంగా ఉండాలి. భయపడే చోట సంస్కృతి ఎప్పుడూ పుట్టదు. విద్యార్థులు కేవలం వినియోగదారులు కాదు, వారే సంస్కృతి సృష్టికర్తలు. సిలబస్ కూడా సంస్కృతితో మాట్లాడాలి; శాస్త్రం కవితను వినాలి; సాహిత్యం సమాజాన్ని ప్రశ్నించాలి; సినిమా తత్వశాస్త్రంతో వాదించాలి. తరగతి గది– జీవితం నుంచి విడిపోయిన దీవిలా ఉండకూడదు.
ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పే యంత్రాలు కాదు. వారు సంస్కృతికి దీపస్తంభాలు. ఒక కవితను సూచించడం, ఒక సినిమా చూడమని చెప్పడం, ఒక ప్రశ్నను ఆపకుండా ముందుకు నెట్టడం ఇలాంటివే పెద్ద సాంస్కృతిక చర్యలు. ఉపాధ్యాయుడికి గౌరవం ఉండాలి. భాషలు క్యాంపస్‌లో వినిపించాలి. మాతృభాషలు, ప్రాంతీయ స్వరాలు, జానపద గీతాలు– అన్నీ కలిసి మాట్లాడినప్పుడు సంస్కృతి విస్తరిస్తుంది. ఒకే స్వరం సంస్కృతి కాదు. సాంస్కృతిక వేదికలు అందరికీ చెందాలి.
సంస్కృతి పరిపక్వత నేర్పే క్యాంపస్‌లకు డబ్బు అవసరమే. గదులు అవసరమే. పుస్తకాలు, వేదికలూ అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది సంకల్పం. దాన్ని ఎప్పుడో ఒకసారి కాదు నిరంతరం ప్రతిరోజూ నెరవేర్చాలి. బయట ప్రపంచంతో క్యాంపస్‌లు మాట్లాడాలి. రచయితలు రావాలి, కళాకారులను పిలవాలి. సమాజం కాంపస్‌లోకి రావాలి. సంస్కృతి ఒంటరిగా బతకలేదు. సంస్కృతిని సంఖ్యలతో కొలవలేం. దాని ఫలితం ప్రశ్నల్లో కనిపిస్తుంది; ప్రశాంత మనసుల్లో మెరుస్తుంది; సమాజంలోకి వెళ్లిన విద్యార్థుల్లో, వాళ్ళ జీవితాల్లో నెమ్మదిగా బయటపడుతుంది. అప్పుడే కాలేజీ, విశ్వవిద్యాలయ క్యాంపస్ ఒక సంస్థగా కాదు... ఒక సజీవ విద్యా సంస్కృతిగా మారుతుంది. మనసున్న సమాజాన్ని సృష్టించే వేదిక అవుతుంది.
వారాల ఆనంద్
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..