మాట్లాడుకుందాం రా!
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:59 AM
మన భిన్నత్వమంతా మిత్రత్వమే ఎవరో దీన్ని శత్రుత్వంగా మార్చేశారు మన మధ్య దూరాన్ని...
మన భిన్నత్వమంతా మిత్రత్వమే
ఎవరో దీన్ని శత్రుత్వంగా మార్చేశారు
మన మధ్య దూరాన్ని పెంచేశారు
అనుమానాలను రగిలించేశారు
మెట్లూ, గోడలూ కట్టేశారు
సహజాతాలనూ చిదిమేశారు
మాట్లాడుకుందాం రా
నేను ఉన్న దగ్గరే ఉన్నాను
ప్రకృతిలోనే ఉన్నాను
చేతులు చాచే ఉన్నాను
ఎదురు చూపై ఉన్నాను
మాట్లాడుకుందాం రా
సామాజిక దూరమంటే ఏమిటి?
ఎవరు నీకది నేర్పారూ?
జెండర్ దూరమంటే ఏమిటీ?
ఎవరు నీకది చెప్పారూ?
మాట్లాడుకుందాం రా
సామాజిక వనరుల దొంగతనమే ఈ దడి
నిన్ను నువ్వు జైలుగా మార్చుకోవడమే ఈ మడి
చిక్కుముడుల కట్టుబాట్లే ఈ సామాజిక గొంగడి
ఉతికి ఉతికి ఆరెయ్యడమే మన కట్టడి
మాట్లాడుకుందాం రా
స్నేహకాంతిని ప్రేమ వెన్నెలనూ
ఎవరడ్డుకుంటారు చెప్పు?
మంచు కొండలు
క్రీనీడలే కరిగిపోతాయి
మగ, కుల, వర్ణ మట్టాలు
కట్టగా నిలవగలవా చెప్పు?
మాట్లాడుకుందాం రా
కృపాకర్ మాదిగ
ఇవి కూడా చదవండి
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ
నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క