Share News

అదే పాత రక్షణ వ్యూహం!

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:52 AM

మానవ విముక్తిని కోరుకునే ఏ సిద్ధాంతమైనా కాలక్రమేణా ఎదురయ్యే ‘కొత్త ప్రశ్నలకు’, చారిత్రక అనుభవాలకు సమాధానం చెప్పగలిగినప్పుడే నిలబడుతుంది. ఆంధ్రజ్యోతిలో ‘వ్యవస్థలో మార్పు...

అదే పాత రక్షణ వ్యూహం!

మానవ విముక్తిని కోరుకునే ఏ సిద్ధాంతమైనా కాలక్రమేణా ఎదురయ్యే ‘కొత్త ప్రశ్నలకు’, చారిత్రక అనుభవాలకు సమాధానం చెప్పగలిగినప్పుడే నిలబడుతుంది. ఆంధ్రజ్యోతిలో ‘వ్యవస్థలో మార్పు మనిషి పరివర్తనకు హామీ ఇవ్వదు’ అనే నా వ్యాసానికి (10.09.2026) బదులుగా రంగనాయకమ్మ గారు ‘పాత ప్రశ్నలకు కొత్త జవాబులు ఉండవు’ అంటూ స్పందించారు (14.10.2026). ప్రశ్న–జవాబుల రూపంలో ఆమె చేసిన విశ్లేషణ సంప్రదాయ మార్క్సిజపు పాత రక్షణా కవచాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. ఎదుటి విమర్శకుడు చైనా, యుగోస్లేవియా లేదా మిలోవాన్ జిలాస్ ప్రస్తావనలు తెస్తాడని ముందే ఊహించి తానే వాటిని ప్రస్తావించడం మనోవిజ్ఞాన శాస్త్రంలో చెప్పే ‘టీకా వ్యూహం’ (inoculation strategy) లాంటి తాత్విక విన్యాసం మాత్రమే! ఈ రక్షణాత్మక వ్యూహం సిద్ధాంతానికి తాత్కాలిక రక్షణ ఇస్తుందే తప్ప నిజమైన సామాజిక– మానసిక విశ్లేషణకు దోహదపడదు. ఆధునిక జగత్తు సరికొత్త సామాజిక ప్రశ్నలను ముందుకు తెస్తున్నప్పుడు శతాబ్దాల నాటి ఆలోచనా సరళితో కేవలం ఆర్థిక క్షేత్రంలోనే మానవ చేతనను కుదించి చూడాలనుకోవడం శాస్త్రీయ ధోరణి కాదు.

బాహ్య వ్యవస్థ మారగానే దానికి అనుగుణంగా మనుషుల ఆలోచనలు, ప్రవర్తన కూడా మారిపోతాయనుకోవడం ఒక ఆశావాద భ్రమ మాత్రమే! 1921లో సోవియట్ విప్లవ రచయితల సదస్సులో లెనిన్ తీవ్ర ఆవేదనతో ‘‘పాత సమాజం చనిపోయినప్పుడు దాన్ని పూడ్చడానికి శవం దొరకదు, అది మన మధ్య కుళ్లిపోతూ సమస్త వాతావరణాన్ని విషపూరితం చేస్తుంది’’, అని స్వయంగా ఒప్పుకున్నాడు. వ్యవస్థను మార్చే పోరాటంలో పాల్గొన్న మనుషులే పాత సమాజపు విషపూరిత మనస్తత్వాన్ని తమతో పాటు మోసుకొస్తారనడానికి ఇది ఒక ఆధారం. 1917 అక్టోబర్ విప్లవం ద్వారా సోవియట్ యూనియన్‌లో ఆస్తి హక్కులను రద్దుచేసి సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పినప్పటికీ మనుషుల అంతరంగంలో ఉన్న ఆధిపత్యకాంక్ష మారలేదు. ఫలితంగానే 1936 నుంచి 1938 మధ్యకాలంలో స్టాలిన్ హయాంలో సొంత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతల మధ్యే పరస్పర అణచివేత, విచారణల పేరుతో రక్తపాతంతో కూడిన మహాప్రక్షాళన (Great purge) సాగింది.

విముక్తి అంటే ఆధిపత్యం లేని స్థితి అని సైద్ధాంతికంగా తెలిసినంత మాత్రాన మనిషి తనలోని అధికార ప్రవృత్తిని తనంతట తానే నిగ్రహించుకుంటాడని సూత్రీకరించడం చారిత్రక వాస్తవాలను విస్మరించడమే. ప్రముఖ విప్లవ నాయకుడు ట్రాట్‌స్కీ తన ‘The Revolution Betrayed’ (1936) గ్రంథంలో దీనిని శాస్త్రీయంగా విశ్లేషించారు. సమాజంలో కొరత ఉన్నప్పుడు వస్తువుల పంపిణీ కోసం ఒక ‘క్యూ’ ఏర్పడుతుందని, ఆ క్యూను క్రమబద్ధం చేయడానికి ఒక పోలీస్ అవసరం అవుతాడని, ఆ పోలీసే క్రమంగా సమస్త అధికారాలను ఆక్రమించుకుంటాడని ట్రాట్‌స్కీ నిరూపించారు. సిద్ధాంత పుస్తకాల్లో దోపిడీ లేని సమాజం గురించి ఎంత స్పష్టంగా రాసివున్నప్పటికీ చేతికి అధికారం రాగానే మానవ మనసులోని ఆధిపత్య కాంక్ష ఆ సిద్ధాంతాన్ని సైతం స్వార్థానికి వాడుకుంటుంది.


అలాగే శ్రమ విభజనను మార్చడం లేదా ఆస్తి హక్కును రద్దు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో ఆధిపత్య ధోరణి నశిస్తుందన్న భావన కూడా చారిత్రక వాస్తవాలకు దూరమే. సోవియెట్ యూనియన్ నుంచి 1949 తర్వాత చైనా వరకు ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చినప్పటికీ పాత యజమానుల స్థానంలో కమ్యూనిస్టు పార్టీ బ్యూరోక్రాట్లు ‘నోమెన్ క్లెతురా’ (Nomen kletura) అనే నూతన పాలకవర్గంగా రూపాంతరం చెందారు. యుగోస్లేవియా విప్లవ నాయకుడు మిలోవాన్ జిలాస్ ‘ది న్యూ క్లాస్’ (1957) గ్రంథంలో చెప్పినట్లుగా రాజ్యంలో ఆస్తి హక్కులు లేకపోయినా అధికార పీఠంపై ఉన్న వ్యక్తులు పాత ఆస్తిపరుల కంటే ఎక్కువ ఆధిపత్యం చలాయించారు. కళ్ల ముందు ఇన్ని విఫల ప్రయోగాలు, చారిత్రక ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చైనాలో ‘సోషలిస్టు పునాదులే సరిగ్గా పడలేదు’ అని విశ్లేషించడం బాధ్యతారాహిత్యం. అక్కడ సోషలిస్టు పునాది పడకుండా అడ్డుకున్నది వ్యవస్థను నడిపిన మనుషుల్లోని ఆధిపత్య ప్రవృత్తి కాకపోతే ఇంకేమిటో రంగనాయకమ్మ ఆలోచించాలి.

వ్యవస్థలో మార్పు అనేది ఒక తలుపును మాత్రమే తెరుస్తుంది. కానీ ఆ తలుపు దాటి లోపలికి నడిచే మనిషి తనలోని ఆధిపత్య స్వభావాన్ని వదులుకోకపోతే ఆ కొత్త ఇంట్లో కూడా పాత కారాగారాన్నే పునర్నిర్మిస్తాడు. అంతరంగ పరివర్తన లేని ఏ వ్యవస్థ మార్పూ పరిపూర్ణ విముక్తికి హామీ ఇవ్వలేదన్నది ఊహాజనిత తత్వశాస్త్రం కాదు, శతాబ్ద కాలపు సోషలిస్టు ప్రయోగాల రక్తంతో చరిత్ర రాసిన పచ్చి నిజం.

ఆయిరబోయిన బిక్షపతి

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి.

Updated Date - Nov 05 , 2026 | 03:52 AM