Share News

వివాహం వర్సెస్ సహజీవనం!

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:15 AM

గత రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను పరిశీలిస్తే.. సహజీవనాన్ని నేరంగా చూడటం నుంచి వ్యక్తిగత హక్కుగా గుర్తించడం వరకు ఒక మార్పు వచ్చిందని గమనిస్తాం. అయితే...

వివాహం వర్సెస్ సహజీవనం!

గత రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను పరిశీలిస్తే.. సహజీవనాన్ని నేరంగా చూడటం నుంచి వ్యక్తిగత హక్కుగా గుర్తించడం వరకు ఒక మార్పు వచ్చిందని గమనిస్తాం. అయితే సహజీవనాన్ని వివాహ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మాత్రం కోర్టులు గుర్తించలేదు.

సహజీవనం అంటే వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం లేదా కలిసి ఉండటం. విదేశాల్లో దీన్ని ‘కోహాబిటేషన్’ (cohabitation) అంటారు. స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాల్లో 70–80శాతం జంటలు వివాహానికి ముందు కలిసి ఉంటున్నాయి. అయితే వీరికి చట్టపరంగా ‘రిజిస్టర్డ్ పార్టనర్‌షిప్’ అనే ఆప్షన్ ఉంది. దీని ప్రకారం వివాహం లేకుండానే ఆర్థిక, సామాజిక హక్కులు దొరుకుతాయి. ఫ్రాన్స్‌లో సహజీవనం చేసే వారికి ‘పాక్స్’ (PACS – Civil Solidarity Pact) అనే చట్టం ఉంది. అమెరికాలో అయితే 50శాతం జంటలు వివాహానికి ముందు కలిసి ఉంటాయి. ఆ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ‘కామన్ లా మ్యారేజ్’ ఉంటుంది. 7–10 ఏళ్లు కలిసి ఉంటే చాలు, వివాహం లేకపోయినా చట్టపరమైన హక్కులు వస్తాయి. అలాగే కెనడాలో వివాహం లేకుండా కలిసి ఉండే జంటలకు ‘కామన్ లా పార్టనర్’ హోదా ఉంది. పాశ్చాత్య దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ. చాలా దేశాల్లో వివాహం లేకుండా కలిసి ఉండే జంటలకు చట్టపరమైన హక్కులు ఉన్నాయి. విదేశాల్లోని ఈ సహజీవనం ట్రెండ్‌ ఇప్పుడు భారతదేశంలోనూ విస్తరిస్తోంది.

మన దేశంలో వివాహాన్ని ఒక పవిత్రబంధంగా భావిస్తారు. అది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు, రెండు కుటుంబాల కలయిక. కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజానికి పునాది లాంటిది. అటువంటి వ్యవస్థ పట్ల ఇప్పుడు యువతరంలో అననుకూల భావన నెలకొన్నదంటే అందుకు అనేక కారణాలున్నాయి. కుటుంబ వ్యవస్థకు పునాదులైన ‘సహనం, సర్దుకుపోవడం, రాజీపడటం’ వంటి భావనలు ప్రస్తుతం అదృశ్యమైపోయాయి. ఎందుకు సహించాలి, ఎందుకు సర్దుకుపోవాలి, ఎందుకు రాజీపడాలి– అని ఈ తరం ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ సంపాదిస్తున్నారు. అందువల్ల పెళ్లికి సిద్ధమవుతూనే కొన్ని కండీషన్స్ పెడుతున్నారు. ఆర్థికపరమైన భారం తమ మీద పడకూడదని, స్వేచ్ఛ కావాలని, అత్తమామల అభిప్రాయాలు తమపై రుద్దకూడదని, భార్యాభర్తలు ఇరువురు చెరిసగం పనులు చేసుకోవాల్సిందేనని... ఇలా అనేకం. అరవై శాతం యువత ఆలోచన ఇలాగే ఉంటుంది. వీరు పెళ్లిని రిజెక్ట్ చేయడం లేదు, రీడిఫైన్ చేస్తున్నారు. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా వల్ల ‘పర్ఫెక్ట్ పార్టనర్’ దొరుకుతాడన్న నమ్మకం కూడా వారిలో బాగా పెరిగింది. కట్నం, కులం కంటే మాటలు కలుస్తాయా, రెస్పెక్ట్ ఇస్తాడా/ ఇస్తుందా అన్నదే ప్రధానం. పార్ట్‌నర్‌ అంటే బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమే! పెళ్లైనా సొంత ఫ్రెండ్స్, సొంత హాబీస్, సొంత సెల్‌ఫోన్ ప్రైవసీ ఉండాలి. ‘పెళ్లి చేసుకుంటా, కానీ నా లైఫ్ నా ఇష్టం’ అన్న ఆలోచనలో నేటి యువతరం ఉన్నది.


సహజీవనం చేసే వారికి కోర్టులు కూడా రక్షణగా నిలుస్తున్నాయి. వయోజనులు ఇష్టపడి కలిసి ఉంటే ఖాప్ పంచాయతీలు, పోలీసులు, కుటుంబ సభ్యులు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. దీన్ని మీరితే కోర్టు ధిక్కరణ కేసు అవుతుంది. పోలీసులు వేధిస్తే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయవచ్చు లేదా నేరుగా మేజిస్ట్రేట్ దగ్గర ఫిర్యాదు ఇవ్వవచ్చు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహజీవనంపై కొన్ని నిబంధనలు విధించేందుకు ప్రయత్నిస్తోంది. వాటి ప్రకారం– సహజీవన బంధంలోకి ప్రవేశించే జంటలు తమ నివాస పరిధిలోని జిల్లా రిజిస్ట్రార్‌ వద్ద వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఆ బంధం ముగిసిపోతే దానిని అధికారికంగా రద్దు చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇలాంటి మరికొన్ని నిబంధనలతో ఒక ముసాయిదా బిల్లును రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరికొన్ని రాష్ట్రాల్లో సహజీవన సంబంధాన్ని నోటరీ దగ్గర అఫిడవిట్ రూపంలో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇది సహజీవనం చేసే ఆ ఇద్దరి వివరాలు, సంబంధం, ఆస్తి విషయాలు రాసుకున్న అగ్రిమెంట్. కోర్టులో సాక్ష్యంగా పనికొస్తుంది. బ్యాంక్, ఇన్సూరెన్స్, పీఎఫ్‌లో భాగస్వామిని నామినీగా పెట్టుకోవడానికి; ఆస్తి ఉంటే తప్పకుండా విల్లు రాయించుకోవడానికి; పిల్లలు పుడితే విడిపోయిన తర్వాత వారి పెంపకం బాధ్యత ఎవరు తీసుకోవాలన్న నిర్ణయానికి ఈ అగ్రిమెంట్‌ వీలు కల్పిస్తుంది. ఒక రకంగా వివాహ బంధానికి ఉన్న భరోసానే సహజీవనానికి కూడా న్యాయస్థానం ఇచ్చింది. కాకపోతే వివాహ బంధానికి ఉన్నంత చట్టబద్ధత సహజీవనానికి లేదు.

ప్రస్తుతం వివాహ వ్యవస్థకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రత్యామ్నాయంగా ఎన్ని మోడల్స్ వచ్చినా, మన దేశ సంస్కృతికీ, వివాహ వ్యవస్థకూ విడదీయలేని బంధం ఉన్నది. కాలానుగుణంగా కొంత తొట్రుపాటుకు గురైనా ఎప్పటికైనా వివాహ వ్యవస్థే అంతిమంగా నిలిచి గెలుస్తుంది అన్నది సంప్రదాయవాదుల నమ్మకం!

బాలినేని నాగభూషణరావు

జర్నలిస్ట్

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 02:15 AM